- పాత బిల్లులు క్లియర్ కావట్లే.. కొత్త పనులకు శాంక్షన్ రావట్లే
- ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైళ్లు ఆగడంతో మంత్రుల నిస్సహాయత
- ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్
- ఆదాయంలో అత్యధికం జీతభత్యాలు, గత సర్కారు అప్పులకే!
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ సర్కారుకు పెనుశాపంగా మారాయి. సుమారు రూ.7 లక్షల కోట్ల పాత అప్పులు, వాటికి నెలనెలా కట్టాల్సిన కిస్తీలకు తోడు గత బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన రూ.40 వేల కోట్ల బిల్లులు ఆర్థికశాఖకు గుదిబండలా తయారయ్యాయి.
దీంతో కాంగ్రెస్ వచ్చాక చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు ఆర్థిక శాఖలో భారీగా పేరుకుపోయాయి. చేసిన పనులకు నిధులు రాక, కొత్త పనులకు ఆమోదం లభించక ఆయా శాఖల మంత్రులు తలపట్టుకుంటున్నారు. సీఎంతో పాటు మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు హామీలు ఇస్తున్నా పనులకు మాత్రం మోక్షం కలగడం లేదు.
వర్క్స్శాంక్షన్ కాకపోవడంపై ఎమ్మెల్యేలు మంత్రులపై అలకబూనుతున్నారు. కొద్దిరోజులుగా తమ నియోజకవర్గాల్లో ఆయా పనులకు సంబంధించిన ఫైళ్ల గురించి ఇన్చార్జ్ మంత్రులతో పాటు సంబంధిత శాఖల మంత్రుల దగ్గర ఆరా తీస్తున్నారు. ఫైళ్లను ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం పంపామని, అక్కడి నుంచి ఎలాంటి స్పందనలేదని, ఈ విషయంలో తామేమీ చేయలేమని మంత్రులు చేతులెత్తేస్తున్నారు.
అప్పుడు నియోజకవర్గాల్లో జనాలకు హామీ ఇచ్చి, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తే తాము జనాల్లో ఎలా తిరగగలమని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, లాబీల్లో ఇదే అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడంతో పెండింగ్ బిల్లుల విషయం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
రుణమాఫీతో మారిన సీన్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.7 లక్షల కోట్ల దాకా అప్పులు చేసింది. పోతూపోతూ కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు భారీగా బకాయిలు పెండింగ్పెట్టింది. గతేడాది డిసెంబర్ 20 నాటికి ఆర్థికశాఖ వద్ద రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ఉన్నట్లు ఆఫీసర్లు తేల్చారు. ఇందులో ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో ఎక్కువ బిల్లులు పెండింగ్ పడ్డాయి. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక అన్ని బిల్లులను క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం బిల్లులను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వస్తున్నది.
ఇప్పటి వరకు దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా పాత బిల్లులను క్లియర్ చేసినట్లు తెలుస్తున్నది. అవి పోగా ఇంకా కాంట్రాక్టర్ల బిల్లులు దాదాపు రూ.34 వేల కోట్లు, ఉద్యోగుల బిల్లులు రూ.6 వేల కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి. రూ.2 లక్షల మేర రుణమాఫీ కోసం సర్కారు ఏకంగా రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. దీంతో దాదాపు నాలుగు నెలల నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. పెద్ద ఏజెన్సీలకు పెండింగ్పడ్డ పెద్దపెద్ద బిల్లులే రిలీజ్చేస్తున్నారని, చిన్న పనులు చేపట్టిన కాంట్రాక్టర్లను పక్కనపెడ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బిల్లులు క్లియర్చేయకపోవడంతో ఆయా శాఖల్లో చాలా పనులు నిలిచిపోతున్నాయి. దీంతో తమకు పూర్తిస్థాయిలో కాకున్నా సగం సగమైనా బిల్లులు చెల్లించాలని చిన్నకాంట్రాక్టర్లు కోరుతున్నారు. టోకెన్లు జనరేట్ అవుతున్నాయే తప్ప ‘ఇ -కుబేర్’ నుంచి డబ్బు మాత్రం అకౌంట్లలో జమ కావడంలేదని వాపోతున్నారు.
ప్రతినెలా రూ.5వేల కోట్ల గ్యాప్..
2024–-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యం ప్రకారం సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, నాన్ టాక్స్ రెవెన్యూ, అప్పులు ఇతరత్రా అన్ని కలిపి ప్రతినెలా రాష్ట్రానికి రూ.22,838 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వివిధ కారణాల వల్ల ప్రభుత్వానికి యావరేజ్‌గా రూ.17 వేల కోట్లు మాత్రమే వస్తున్నది. కానీ ప్రతి నెలా ఖర్చు మాత్రం రూ.22వేల కోట్లుగా ఉన్నది. అంటే ప్రతినెలా దాదాపు రూ.5 వేల కోట్ల గ్యాప్ ఉంటున్నది. దీంతో సర్కారు సగటున ప్రతి నెలా రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల దాకా అప్పులు తీసుకుంటున్నది.
ALSO READ : పాలమూరు ప్యాకేజీ 3కి కొత్త అంచనాలు వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రతినెలా విధిగా చెల్లించాల్సిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సగటున రూ.5వేల కోట్ల దాకా ఉంటుండగా, గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీలకే దాదాపు రూ.6,500 కోట్ల దాకా చెల్లించాల్సి వస్తోంది. అంటే వస్తున్న రాబడిలో 65 శాతం ఈ రెండింటికే పోతున్నది. ఇక ప్రభుత్వ రోజువారీ ఖర్చులు, చేయూత పెన్షన్లు, ఇతర గ్రీన్ చానెల్ నిధులకే మిగిలిన నిధులను సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. దీంతో పాత బకాయిలు, కొత్త పథకాల అమలు ప్రభుత్వానికి
సవాల్‌గా మారింది.
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కష్టాలు..
ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, జీఎల్‌ఐ, కమ్యూటేషన్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు ప్రభుత్వం వద్ద భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. అప్పులు తెచ్చి మరీ ట్రీట్మెంట్ చేయించున్న మెడికల్ రీ-యింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్ పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై ఇటీవల పలు ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను కలిశాయి. తమ పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్చేయాలని విజ్ఞప్తి చేశాయి. నిజానికి రిటైర్ అయ్యాక ఉద్యోగులకు పూర్తిస్థాయి జీఎల్‌ఐ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచింది. కానీ, 58 ఏండ్ల వయసు నిండినవారికి జీఎల్‌ఐ మెచ్యూరిటీ సొమ్మును క్లియర్ చేయాలన్న నిబంధన ఉంది.
వీటి బిల్లులు పంపించినా పెండింగ్‌లో పడిపోతున్నాయి. రిటైరైన ఉద్యోగులు ‘కమ్యూటేషన్ పెన్షన్’ కింద తమ నెలవారీ పెన్షన్‌లో 40 శాతాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తామంటూ ఒప్పందం చేసుకుంటారు. ఇందుకుగాను రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం కొంత మొత్తం సొమ్మును అడ్వాన్సుగా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి వయసు బట్టి రూ.10–15 లక్షల వరకు సొమ్ము అందుతుంటుంది. ఈ బిల్లులను పంపించినా క్లియర్ కావడం లేదు. రిటైర్ అయినవారికి వెంటనే గ్రాట్యుటీ సొమ్మును చెల్లించాలి. ఇదివరకు రూ.12 లక్షలు గరిష్ఠ గ్రాట్యుటీని మొదటి పీఆర్సీ సిఫారసుల మేరకు రూ.16 లక్షలు చేసింది. ఉద్యోగి రిటైర్ కాగానే ఈ గ్రాట్యుటీ, జీపీఎఫ్ సొమ్ము కోసం బిల్లులు పంపితే పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఇంకోవైపు పెండింగ్ డీఏలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రతినెలా ఆదాయ, వ్యయం ఇలా
- ఆదాయం : రూ.17 వేల కోట్లు
- అప్పుల వడ్డీలు, కిస్తీలు : 6,500 కోట్లు
- ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు : రూ.5వేల కోట్లు
- ప్రతి నెలా ఖర్చు(నిర్వహణ కలిపి) : రూ.22వేల కోట్లు
- ఆదాయం, ఖర్చు మధ్య తేడా : రూ.5వేల కోట్లు