- ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి సర్కార్ కసరత్తు
- అసంపూర్తిగా ఉన్న ‘డబుల్’ ఇండ్లపై త్వరలో క్లారిటీ
- వాటినీ పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం
- కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న డబుల్ లబ్ధిదారులు
జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్య త్వరలో పరిష్కారం కానున్నట్లు ఇటు ఆఫీసర్లు, అటు లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు కసరత్తులు స్టార్ట్ చేసింది. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో మార్గదర్శకాల తయారీకి ఉన్నతాధికారులు రెడీ అవుతున్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో నిధులు రాక మధ్యలోనే ఆగిపోయిన డబుల్ ఇండ్లను కూడా పూర్తి చేసి పేదలకు ఇచ్చే యోచనలో కొత్త ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కొత్త పథకం కింద లబ్ధిదారుల ఎంపికతో పాటు పాత ఇండ్ల పూర్తిపై ఫోకస్ పెట్టేందుకు విధివిధానాల ఖరారు ప్రక్రియ వేగవంతం అయిందని చెబుతున్నారు. దీంతో తమకు ఇండ్లు దక్కుతాయని లబ్ధిదారులు ఆశతో ఉన్నారు.
జనగామలో జిల్లాలో ఇచ్చింది 858 ఇండ్లే...
గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంలో జనగామ జిల్లాకు 4,372 ఇండ్లు మంజూరు అయ్యాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూరల్ ఏరియాలో రూ.5.04 లక్షలు, అర్బన్ ఏరియాల్లో రూ. 5.30 లక్షలు కేటాయించారు. మొత్తం మంజూరైన ఇండ్లలో 3,280 ఇండ్లకు మాత్రమే టెండర్లు పూర్తి కాగా మిగిలిన 1,092 ఇండ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. టెండర్లు పిలిచిన వాటిలో 1,360 ఇండ్లు కంప్లీట్ కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఇండ్లను పూర్తి చేయాలంటే రూ. 250 కోట్లు అవసరం అవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు.
పూర్తయిన ఇండ్లను కేటాయించేందుకు జనగామ నియోజకవర్గంలో 471, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 224, పాలకుర్తి నియోజకవర్గంలో 539 మంది కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా 1,234 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ 858 మందికి మాత్రమే ఇండ్లను అప్పగించారు. మిగతా వారికి ఇంకా అప్పగించాల్సి ఉంది. పూర్తయిన ఇండ్లను అప్పగించాలని లబ్ధిదారులు పలుమార్లు ఆందోళనకు దిగారు.
కలెక్టరేట్‌ను ముట్టడించినా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో లబ్ధిదారులకు ఇండ్లను ఎప్పుడు అందించాలనే ఆదేశాల కోసం ఆఫీసర్లు ఎదురుచూస్తున్నారు.
కొత్త సర్కారుపైనే లబ్ధిదారుల ఆశలు
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు కట్టుకునే వారికి రూ. 5 లక్షల సాయం, స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలోకి రావడంతో ఇప్పుడైనా తమకు ఇండ్లు దక్కుతాయని పేదలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెడీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడంతో హౌజింగ్ ఆఫీసర్లు ఆ పనుల్లో నిమగ్నం అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్‌పై వేరే శాఖల్లో పనిచేస్తున్న హౌజింగ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను మాతృ సంస్థలోకి తీసుకొచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
సర్కారు ఆదేశాల మేరకు చర్యలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ఇంకా మార్గదర్శకాలు అందలేదు. గత ప్రభుత్వ హయాంలో జనగామ జిల్లాకు 4,372 ఇండ్లు మంజూరు అయితే 1,360 కంప్లీట్ అయ్యాయి. 1,234 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి 858 మందికి ఇండ్లు ఇచ్చాం. ప్రభుత్వం నుంచి క్లారిటీ రాగానే చర్యలు తీసుకుంటాం. నిర్మాణంలో ఉన్న మరో 3,280 ఇండ్లపై స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది.
దామోదర్‌రావు, హౌజింగ్ ఈఈ, జనగామ