భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మన ఊరు–మన బడి ప్రోగ్రెస్‌పై కలెక్టర్ అనుదీప్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో మన ఊరు–మన బడి, దళితబంధు, తదితర స్కీమ్స్ అమలు తీరుపై ఆయా శాఖల అధికారులతో శనివారం సమీక్షించారు. మన ఊరు–మన బడి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులపై పర్యవేక్షణ కొరవడిందని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. దీనికి ఇంజనీరింగ్ అధికారులతో పాటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాలని అన్నారు. పినపాక నియోజకవర్గంలో పనులు స్లోగా నడుస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో మాత్రమే పనుల్లో ఎందుకు జాప్యం ఎందుకు జరుగుతుందని డీఈని ప్రశ్నించారు. కారణాలు చెప్పకుండా దసరా సెలవుల్లో ప్రతీ మండలంలో రెండు పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మరమ్మతులు కంప్లీట్ చేయాలని ఆదేశించారు. నిధులు సకాలంలో ఇస్తున్నా పనుల్లో ఆలస్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేసిన తరువాత ప్రత్యేక బృందాలు పరిశీలిస్తాయని చెప్పారు. జిల్లాలో మిగిలిన 33 దళితబంధు యూనిట్లకు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 30 తరువాత ఒక్క యూనిట్కూడా పెండింగ్‌లో ఉండవద్దని అన్నారు. మరో 500 యూనిట్లు మంజూరవుతున్నట్లు తెలిపారు. డీఈఓ సోమశేఖర శర్మ, ఇంజనీరింగ్, దళిత బంధు అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి జిల్లాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే నెల 3న ప్రకాశం స్టేడియంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు అన్ని శాఖలు పాల్గొనాలని సూచించారు.
పనులను పరిశీలించిన కలెక్టర్
ములకలపల్లి: జలశక్తి అభియాన్ నోడల్ ఆఫీసర్ యువరాజ్, కలెక్టర్ అనుదీప్ శనివారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలకేంద్రంతో పాటు పూసుగూడెంలోని మెగా పార్కులను ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్న ఇంకుడుగుంతలను పరిశీలించారు . అనంతరం ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పీడీ మధుసూదన్ రాజు, సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్, జడ్పీటీసీ సున్నం నాగమణి, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీవో నాగేశ్వర రావు, ఈజీఎస్ ఏపీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.