- ఆరేండ్లు పెన్షన్ తీసుకున్న దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి
- తప్పుడు వివరాలతో ఆసరా పథకంలో నమోదు
- అన్న ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తండ్రికి పెన్షన్
- అధికారుల పరిశీలనలోఅక్రమాలు వెలుగులోకి
హైదరాబాద్/భూపాలపల్లి, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ఆసరా పింఛన్లలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో ఓ కార్పొరేషన్ చైర్మన్ కూడా పెన్షన్ తీసుకున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. బీఆర్ఎస్ హయాంలో 5 వేల మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారని, వారిలో ఓ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారని, ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడ్తామని శనివారం అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రకటించారు. దీంతో సెర్ప్అధికారులు అలర్ట్ అయ్యారు.
ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరని ఆరా తీయగా.. బీఆర్ఎస్ హయాంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసిన కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అని తేలింది. భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామానికి చెందిన ఆయన.. మూడు టర్మ్ లు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసి, ఆరేండ్లు పెన్షన్ తీసుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్‌గా రూ.లక్షకు పైగా జీతం, కారు, అలవెన్సులు పొందుతూ పింఛన్ కూడా తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
తప్పుడు వివరాలతో..
దివ్యాంగుడైన వాసుదేవరెడ్డిని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా 2017 మే 29న అప్పటి ప్రభుత్వం నియమించింది. తర్వాత మరో రెండుసార్లు ఆయన పదవీకాలం పొడిగించింది. రూ.లక్షకు పైగా జీతం, అలవెన్స్‌లు, కారు, ఇతర సౌకర్యాలను కల్పించింది. ఆరేండ్లు పదవిలో కొనసాగిన ఆయన.. ఆ టైమ్‌లో పెన్షన్ తీసుకున్నారు. వాసుదేవరెడ్డికి దివ్యాంగుల కోటాలో వాసు కేతిరెడ్డి పేరుతో 2014 నవంబర్‌లో ఆసరా ఫించన్ (పెన్షన్ ఐడీ డబ్ల్యూజీబీయూఆర్ 02547) మంజూరైంది. అందులో తండ్రి పేరు చంద్రారెడ్డిగా నమోదు చేశారు.
డీఆర్‌డీవో ఆఫీసర్లు గ్రామంలో విచారణ చేపట్టగా.. అసలు పేరు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అని, తండ్రి పేరు గణపతి రెడ్డి అని గ్రామస్తులు తెలిపారు. తప్పుడు వివరాలతో పెన్షన్ తీసుకుంటున్నారని విషయం బయటపడింది. ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే వాసుదేవరెడ్డి సొంతూరుకు వచ్చి వేలిముద్ర వేస్తారని.. మిగతా నెలలు పంచాయతీ కార్యదర్శి వేలిముద్రల ఆధారంగానే పింఛన్ తీసుకుంటున్నట్టు ఆఫీసర్ల విచారణలో తేలింది.
తండ్రికీ పెన్షన్..
గొర్లవీడు గ్రామానికి చెందిన కేతిరెడ్డి గణపతిరెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో చిన్నవాడు వాసుదేవరెడ్డి. గణపతిరెడ్డి మొదటి కొడుకు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో పని చేస్తున్నాడు. రెండో కొడుకు అగ్నిమాపక శాఖలో ఉద్యోగం చేస్తూ హనుమకొండలో ఉంటున్నాడు. ఈయన గవర్నమెంట్ ఉద్యోగి అయినప్పటికీ, తండ్రి గణపతిరెడ్డికి పెన్షన్ వస్తున్నది.
గొర్లవీడు గ్రామంలో అనర్హులకు పింఛన్లు వస్తున్నాయని, గతంలో 30 మందికి పైగా పేర్లను అధికారులు తొలగించారు. ఆ టైమ్‌లో వాసుదేవరెడ్డి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. అయితే అప్పుడు తన తండ్రి పేరు తీసెయ్యకుండా వాసుదేవరెడ్డి లీడర్ గిరి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో 5 వేల మంది అనర్హులకు ఆసరా: సీతక్క
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5 వేల మంది అనర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చిందని మంత్రి సీతక్క తెలిపారు. వారిలో ఓ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారని చెప్పారు. అప్పట్లో కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసిన ఆయన.. ప్రభుత్వం నుంచి లక్షల జీతం తీసుకుంటూ పెన్షన్ కూడా తీసుకున్నారన్నారు. శనివారం అసెంబ్లీలో ఆసరా పింఛన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నలకు మంత్రి క్లారిటీ ఇచ్చారు.
హరీశ్ రావు అవాస్తవాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం నెలలో చివరి తేదీన కూడా పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయన్నారు. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసు తగ్గింపుపై గత ప్రభుత్వం మూడున్నరేండ్లు జాప్యం చేసి ఎన్నికలకు ముందు తగ్గించిందన్నారు.
పింఛన్ తీసుకున్నది నిజమే..
కేతిరెడ్డి వాసుదేవరెడ్డి దివ్యాంగుల కోటాలో పింఛన్ తీసుకున్నది నిజమే. ఈ నాలుగేండ్లలో 20 సార్లు నేనే వేలిముద్రలు వేస్తే, పోస్టాఫీస్ సిబ్బంది ఆయనకు పింఛన్ డబ్బులు అందజేశారు. అధికారుల ఆదేశాలతో విచారణ జరుపుతున్నాం.
– కల్పన, పంచాయతీ కార్యదర్శి, గొర్లవీడు
అందజేసింది నేనే..
వాసుదేవరెడ్డి ఆరేండ్లుగా ప్రతి నెల దివ్యాంగుల పింఛన్ తీసుకుంటున్నారు. ఆయన ఊళ్లోకి వచ్చినప్పుడు వేలిముద్రలు వేసి పింఛన్ తీసుకుంటారు. ఊళ్లోకి రానప్పుడు సెక్రటరీ వేలిముద్రలు వేస్తే, ఆ డబ్బులను నేను వారి కుటుంబసభ్యులకు అందజేస్తాను.
– కిరణ్, పోస్టాఫీస్ సిబ్బంది, గొర్లవీడు