రిటైరయిన కార్మికులు అరకొర పింఛన్లతో అవస్థలు

రిటైరయిన కార్మికులు అరకొర పింఛన్లతో అవస్థలు
  • బొగ్గు గనుల్లో పింఛన్​ రూ.500లోపే
  • 24 ఏండ్లుగా పింఛన్​పెంచలేదు 
  • అతి తక్కువగా వస్తున్న పింఛన్లు రోగాలకే సరిపోవడం లేదు
  • 10న దేశవ్యాప్తంగా సీఎంపీఎఫ్‌‌ ఆఫీస్‌‌ల ముందు నిరసనకు నిర్ణయం 

గోదావరిఖని, వెలుగు: దేశవ్యాప్తంగా కోల్‌‌ సెక్టార్‌‌లో పనిచేసి రిటైరయిన కార్మికులు అరకొర పింఛన్లతో అవస్థలు పడుతున్నారు. 8వ వేజ్ బోర్డుకు ముందు రిటైరయిన వేలాది  మంది కార్మికులకు రూ.500 కంటే తక్కువ పింఛన్‌‌ వస్తోంది. ఇంత తక్కువ మొత్తంతో ఎలా బతకాలని రిటైర్డ్​ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. పింఛన్‌‌ పెంచాలని డిమాండ్‌‌ చేస్తూ  ఈ నెల 10న దేశవ్యాప్తంగా కోల్‌‌ మైన్స్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ (సీఎంపీఎఫ్‌‌) ఆఫీస్‌‌ల ముందు రిటైర్డ్‌‌ కార్మికులు, ఉద్యోగులు నిరసన తెలపాలని నిర్ణయించారు. 

కాంగ్రెస్‌‌ ప్రభుత్వ హయాంలో...

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం 1998 మార్చి 5న జీఎస్‌‌ఆర్ నంబర్‌‌ 123(ఇ) ప్రకారం కోల్‌‌ మైన్స్‌‌ పింఛన్​స్కీమ్‌‌ను ప్రవేశపెట్టింది. దీనిప్రకారం ప్రతి మూడేండ్లకోసారి పింఛన్ రివిజన్‌‌ చేయాలి. కానీ ఇప్పటివరకు దేశంలోని బొగ్గు గని కార్మికులకు పింఛన్​పెంచలేదు. బొగ్గు గనుల్లో సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల కార్మికులు బొగ్గు దుమ్మును పీల్చుకొని రోగాల బారినపడుతున్నారు. లంగ్స్​డిసీజెస్, నడుము, కాళ్ల నొప్పులు.. ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి టైంలో వారికి ఆర్థిక భరోసా కల్పించే పింఛన్.. తక్కువ వస్తుండటంతో వేలాది కార్మికులు, కార్మిక కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.  రూ.వెయ్యిలోపు పింఛన్​తీసుకునేవారు దేశవ్యాప్తంగా 1,36,919 మంది రిటైర్డ్​కార్మికులున్నారు. తెలంగాణ సింగరేణి పరిధిలో 19,128 మంది రిటైర్డ్​కార్మికులున్నారు. వీరికి పింఛన్ స్కీమ్​ అమలైనా కనీస పింఛన్​ పెరగలేదు. 

పింఛన్ రివ్యూలే లేవు.. 

రిటైర్డ్‌‌ కార్మికులకు ఎంత పింఛన్ చెల్లించాలనే అంశంపై రివ్యూ చేయడానికి మూడేండ్లకొకసారి మీటింగ్ నిర్వహించాలని పింఛన్​స్కీమ్‌‌లో పొందుపర్చారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి రివ్యూలు చేయడం లేదు. పెన్షన్​ ఫండ్‌‌ లోటు బడ్జెట్‌‌ ఉండడం వల్లనే పింఛన్​పెంచడం లేదని సీఎంపీఎఫ్‌‌ ట్రస్టీ బోర్డు చెబుతున్నప్పటికీ ఆ లోటును పూడ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. ఇటీవల జరిగిన మీటింగ్‌‌లో వెలికితీసిన  ప్రతి టన్ను బొగ్గుపై రూ.15 చొప్పున సీఎంపీఎఫ్‌‌ ట్రస్ట్‌‌కు చెల్లించేందుకు కోల్‌‌ ఇండియా అంగీకరించింది. దీనివల్ల కొంత ఉపశమనం కలిగినా, పెద్దగా ప్రయోజనం లేదని పెన్షనర్స్‌‌ అసోసియేషన్ లీడర్లు చెబుతున్నారు. 


14 ఏండ్లుగా  రూ.235 పింఛనే...


సింగరేణి జీడికె 1 గనిలో కోల్‌‌ కట్టర్‌‌గా పనిచేసి 1996లో రిటైర్డ్‌‌ అయ్యాను. రిటైర్డ్‌‌ అయ్యే నాటికి పెన్షన్​ స్కీమ్​లేదు. 1998 నుంచి ఇది అమల్లోకి రావడంతో దరఖాస్తు చేసుకుంటే  రిటైర్డ్ అయిన 12 ఏండ్లకు అంటే 2008లో నెలకు రూ.235 పింఛన్‌‌ రాశారు. అప్పటి నుంచి అదే పింఛన్​వస్తోంది. యాక్సిడెంట్‌‌లో చేయి విరగడంతో ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛన్​వస్తుండగా ఆ డబ్బుతో షుగర్, బీపీ టాబ్లెట్లు తెచ్చుకుంటున్నాను. 

‒ ఎం.చందర్‌‌రావు, 
రిటైర్డ్‌‌ సింగరేణి కార్మికుడు

నెలకు రూ.425 పింఛన్‌‌తో ఎలా బతికేది


సింగరేణి జీడికె 6బి, 11ఏ గనుల్లో కోల్‌‌ ఫిల్లర్‌‌ కార్మికుడిగా పనిచేసి 2001లో రిటైర్డ్‌‌ అయ్యాను. అప్పుడు రూ.425 పెన్షన్ ఇచ్చారు. ఇప్పటికీ అదే పెన్షన్ వస్తున్నది. గనిలో పనిచేసే చోట తక్కువ ఎత్తు ఉండడంతో వంగుతూ పనిచేయడం వల్ల నడుము నొప్పి, కాళ్లనొప్పులు వచ్చాయి. ఇప్పుడు నడవలేని  స్థితిలో ఉన్నాను. నాకొచ్చే పింఛన్​ మందులకు కూడా సరిపోదు. భార్య కూలికి వెళ్లి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. 

‌‌‒ ఇరుగురాల రాజయ్య, రిటైర్డ్‌‌ కార్మికుడు


బొగ్గుతో పాటు ఓబీ నుంచి కూడా డబ్బు జమచేయాలి


కోల్‌‌మైన్స్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ (సీఎంపీఎఫ్‌‌) ట్రస్ట్‌‌లో డబ్బులు లేని పరిస్థితుల్లో దేశంలో వెలికితీసే ప్రతి టన్ను బొగ్గుపై రూ.15 చొప్పున జమచేయాలని తీసుకున్న నిర్ణయం హర్షణీయం. అయితే ఈ డబ్బు రిటైర్డ్‌‌ కార్మికులకు పింఛన్​పెంచేందుకు సరిపోదు. కోల్‌‌ సెక్టార్‌‌లో కోల్‌‌ఇండియా, సింగరేణిలో ఓపెన్‌‌ కాస్ట్‌‌ లు ప్రారంభిస్తున్నారు. ఇందులో ఓవర్‌‌ బర్డెన్‌‌ (ఓబీ)ని తొలగించాకే  బొగ్గును తీయాల్సి ఉంటుంది. ఒక క్యూబిక్‌‌ మీటర్ ఓబీ తీస్తే రూ.25 చొప్పున సీఎంపీఎఫ్‌‌ ట్రస్ట్‌‌కు చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే రిటైర్డ్‌‌ కార్మికులకు కనీస పెన్షన్‌‌ ఇచ్చేందుకు వీలవుతుంది. 

‒ ఎం.బాబూరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి, కోల్‌‌మైన్స్‌‌ పెన్షనర్స్‌‌ అసోసియేషన్‌‌