బొగ్గు గని రిటైర్డు ఉద్యోగుల పెన్షన్​ పెంచాలి.. రిటైర్డు ఉద్యోగుల వినతి

బొగ్గు గని రిటైర్డు ఉద్యోగుల పెన్షన్​ పెంచాలి.. రిటైర్డు ఉద్యోగుల వినతి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో  రిటైర్డు అయిన తమకు తక్కువ పెన్షన్​ వస్తుందని  రిటైర్డు ఉద్యోగుల సంఘాల లీడర్లు అన్నారు.  ఆదివారం హైదరాబాద్​లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​రెడ్డిని కలిసి పెన్షన్ పెంచాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. 35 ఏండ్లకు పైగా బొగ్గు గనుల లోపల ప్రమాదకర పరిస్థితుల్లో పని చేసి సంస్థకు లాభాలు తెచ్చామన్నారు. వృద్ధాప్యంలో  అనారోగ్యం బారిన పడినప్పుడు పెన్షన్ డబ్బులు సరిపోవడం లేదని వాపోయారు. 1998 నుంచి పెన్షన్ పెంచలేదని ఫలితంగా వేల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

ఓఎన్​జీసీ, నాల్కో కు చెందిన  రిటైర్డు ఉద్యోగులకు ప్రతి ఐదేండ్లకోసారి పెన్షన్​  పెంచుతూ ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని వివరించారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు కూడా ప్రత్యేక ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్​ చేశారు. 63 పేజీల నివేదికను కేంద్రమంత్రికి అందించారు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పందిస్తూ  రిటైర్డు ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని, ప్రత్యేక ఆర్థిక సహకారం కోసం తెలంగాణ సీఎంకు లెటర్​రాస్తానని హామీ ఇచ్చారు. 

కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సింగరేణి రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వాసుదేవ రావు, ప్రధాన కార్యదర్శి జేవీ దత్తాత్రేయులు, కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్సీ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.బాబు రావు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్,  సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రావు తదితరులు ఉన్నారు.