ఎమ్మెల్యే ఆలకు కాంగ్రెస్ నేతల వినతి
దేవరకద్ర, వెలుగు:అర్హులకు పింఛన్లు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. శుక్రవారం చిన్న చింతకుంట మండల కేంద్రంలో పింఛన్ కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. అంతకుముందు ఎమ్మెల్యే వద్దకు వస్తున్న నేతలను భూత్ఫూర్ సీఐ రజిత రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. గమనించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్ జాబితాలో చాలామంది అర్హులకు పేర్లు లేవని వాపోయారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్పందించిన ఎమ్మెల్యే పార్టీలకతీతంగా అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని, పరిశీలించి పింఛన్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
మనబడి పనులకు దసరా టార్గెట్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మనఊరు–మనబడి కింద చేపట్టిన పనులను దసరా నాటికి కంప్లీట్ చేయాలని అడిషనల్ కలెక్టర్ మనూ చౌదరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో విద్యాశాఖలోని ఇంజనీరింగ్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత కింద 290 స్కూళ్లు ఎంపిక కాగా 170 స్కూళ్లలో పనులు ప్రారంభం అయ్యాయన్నారు. కాగా, గతంలో రిలీజ్ చేసిన రూ.2 కోట్ల పనులకు సంబంధించి రూ.54 లక్షల వివరాలను మాత్రమే నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులవారీగా ఏంబీ బుక్‌ను సబ్మిట్ చేసి ఆన్‌లైన్‌లో జనరేట్ చేసిన వారికి వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అలాగే రూ.30 లక్షలకు పైగా నిధులతో పనులు చేపట్టనున్న 66 స్కూళ్లకు సంబంధించిన వెంటనే ఆన్‌లైన్ టెండర్లను పిలవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈవో గోవిందరాజులు, పీఆర్‌ఈఈ దామోదర్ రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ భాస్కర్ పాల్గొన్నారు.
బోయపల్లిలో భగీరథ నీళ్లొస్తలేవు
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని 16 వార్డు(బోయపల్లి)లో 15 రోజులగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఖాళీ బిందెలతో ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వారాలుగా నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కౌన్సిలర్, మిషన్ భగీరథ ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దాదాపు గంట సేపు ధర్నా చేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ మోతీలాల్ అక్కడికి చేరుకొని నీళ్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాలను పట్టించుకోరా..?
- ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలు
- అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
అమనగల్లు, వెలుగు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన మాడుగుల మండలం నర్సాయిపల్లి, కొలుకులపల్లి తండాకు చెందిన ఇద్దరు మహిళల కుటుంబాలను సర్కారు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. శుక్రవారం కోలుకులపల్లిలో గీత కార్మికులకు లైసెన్స్‌లు అందించేందుకు వచ్చిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా... టీఆర్‌ఎస్ నాయకులు అనుకూలంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సీఐ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం నేతలు వెంకటేశ్, పెద్దయ్య యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకు బాధిత కుటుంబాలను పరామర్శించే టైం లేదా..? అని ప్రశ్నించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి మూడేళ్లుగా కష్టపడి గీత కార్మికులకు లైలెన్సులు మంజూరు చేయిస్తే.. ఎమ్మెల్యే ఎలా పంపిణీ చేస్తారని మండిపడ్డారు. కాగా, ఎమ్మెల్యే గీత కార్మికులకు లైసెన్సులతో పాటు ఎంపీ రాములుతో కలిసి మాడుగుల మండల కేంద్రంలో పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.
స్టూడెంట్ల బాగోగుల కోసం ఆత్మీయ కమిటీలు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రెసిడెన్షిల్ స్కూల్, కేజీబీవీ స్టూడెంట్ల బాగోగులను చూసేందుకు ఆత్మీయుల పేరుతో జిల్లా సీనియర్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపీడీవో, మెడికల్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ, మున్సిపల్ వార్డు ఆఫీసర్లతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకట్ రావు తెలిపారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీసులో గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా కోఆర్డినేటర్లతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కారణాలు తెలుసుకొని చర్యలు చేపట్టాలని సూచించారు. ఏ స్కూల్‌లోనైనా అస్వస్థతకు గురైతే వెంటనే కోఆర్డినేటర్, ఆర్సీవో, డీఎంహెచ్‌వకు సమాచారం ఇవ్వాలని ప్రిన్సిపాల్స్, జీసీడీవోను ఆదేశించారు. ఇంకా ఎక్కడైనా పుస్తకాలు పంపిణీ పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సోషల్ వెల్పేర్ డీడీ యాదయ్య, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిర, ట్రైబల్ వెల్పేర్ ఆఫీసర్ చత్రు నాయక్, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, మైనార్టీ ఆఫీసర్ శంకరాచారి, రెసిడెన్షియల్ రీజనల్ కో ఆర్డినేటర్లు లింగయ్య, నాగార్జున, ఫ్లోరెన్స్, ఆర్‌సీఎం ఖాజా మొయినుద్దీన్, జిల్లా కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నరు
కల్వకుర్తి, వెలుగు: సీఎం కేసీఆర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి ఆరోపించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా శుక్రవారం కల్వకుర్తిలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నిరసన తెలపగా పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఆచారి వారిని పరామర్శించారు. అనంతరం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల విషయంలో వివక్ష చూపుతోందని విమర్శించారు. హిందువులకో న్యాయం, ఇతర వర్గాలకో న్యాయం చేయడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో హిందువులంతా ఏకమై కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరసింహ, రాఘవేంద్రగౌడ్, దుర్గాప్రసాద్, వీహెచ్‌పీ నేతలు పాల్గొన్నారు.