పింఛన్ల కోసం పడిగాపులు.. రెండేండ్లుగా మంజూరుకాని  పెన్షన్లు   

  • 45 వేల మందికి అందని ఆసరా 

నిజామాబాద్,  వెలుగు:  ఆసరా పింఛన్ల కోసం ఉమ్మడి జిల్లాలో అర్హులైన 45  వేల మంది పడిగాపులు పడుతున్నారు. తమకు పెన్షన్​ మంజూరు చేయాలంటూ ప్రతి  సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి అధికారులను వేడుకుంటున్నారు. మండల ఆఫీసుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వారి గోడు పట్టించుకోకపోవడంతో  వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు నెలల తరబడి నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. 

ఆఫీసులు చుట్టూ చక్కర్లు

వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తోంది.   వృద్ధులకు, ఒంటరి మహిళలకు   రూ. 2016, దివ్యాంగులకు రూ. 3,016 ఇస్తోంది.   ఉమ్మడి జిల్లాలో 3. 21,942  మందికి పింఛన్లు అందిస్తున్నారు. ఇందులో  నిజామాబాద్ జిల్లాలో 2,39,394 మంది,  కామారెడ్డి జిల్లాలో 82,548 మంది పింఛన్లు పొందుతున్నారు.  ఉమ్మడి జిల్లాలో కొత్తగా పెన్షన్ల కోసం లక్షా 15 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇందులో అర్హులైన కొంతమందికి  2022 జూన్‌‌‌‌ పెన్షన్​లు మంజూరు చేయగా, అన్ని అర్హతలు ఉన్న 45 వేల  మందికి ఇంకా పెన్షన్​ మంజూరు కాలేదు.    నిజామాబాద్ జిల్లాలో 65 వేల మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు.  

తాజాగా జిల్లాకు  48  వేల మందికి ఆసరా పెన్షన్​   మంజూరు చేశారు. నిజామాబాద్ అర్బన్ లో  8,500 మందికి,   ఆర్మూర్ లో 7,888 , బాల్కొండ లో 9,600,  బాన్స్ వాడలో  4,986,  బోధన్ లో 8,926,   నిజామాబాద్ రూరల్ పరిధిలో    8, 945 పింఛన్‌‌‌‌లను మంజూరు చేశారు. జిల్లాలో ఇంకా  26 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.  కామారెడ్డి జిల్లాలో  50 వేల మంది  దరఖాస్తు చేయగా,  31,104  వేల మందికి మంజూరయ్యాయి . ఇంకా   19 వేల మందికి నిరాశ ఎదురైంది. పించన్లు మంజూరు కాని వారంతా మున్సిపల్ , ఎంపీ డీవో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.  పెన్షన్​ మంజూరు చేయడం  తమ పరిధిలో లేదంటూ  సిబ్బంది వారిని వెనక్కి   పంపించేస్తున్నారు. 

ఏజ్​ లిమిట్​తగ్గించినా.. 

వృద్ధాప్య పెన్షన్​ పొందేందుకు వయోపరిమితిని తగ్గించినా చాలామందికి పింఛన్లు రాలేదు. ఏజ్​ లిమిట్​ 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించారు. ఈ కేటగిరి కింద నిజామాబాద్​ జిల్లాలో 20 వేల మంది  దరఖాస్తు చేసుకుంటే, దాదాపు 6 వేల మందికి పింఛన్​ మంజూరయ్యింది. ఇంకా 14 వేల మంది  దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు.  అధికారులకు మొర పెట్టుకుంటే  ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. 

ఏడాదైనా పింఛన్​ రాలే 

నా   భర్త చనిపోయి ఏడాదైంది . అప్పుడే దరఖాస్తు చేశాను.  నాలుగు సార్లు కలెక్టరేట్​ ప్రజావాణిలో అర్జీ ఇచ్చాను.  ఇప్పటివరకు పింఛన్​ మంజూరు కాలే.  నెలనెలా పింఛన్​ వస్తే ఆసరా ఉంటుండె.  నా ఖర్చుల గురించి ఇంట్లో ఎవరూ పట్టించుకుంటలేరు.   -  గోవిందమ్మ , నిజామాబాద్ జిల్లా   

ప్రజావాణికి  నాలుగుసార్లు పోయిన

రెండేండ్ల కింద  నా కొడుకుకు  దివ్యాంగుల పింఛన్​ కోసం దరఖాస్తు పెట్టిన. ఇంకా   మంజూరు కాకపోవడంతో  ఇబ్బంది అవుతోంది.  ప్రజావాణిలో నాలుగైదు సార్లు  దరఖాస్తు చేసిన.  ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు  మంజూరు కాలేదు.  -  గంపల చందు,  నిజామాబాద్