అవిశ్వాసం లాంఛనమే .. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా

అవిశ్వాసం లాంఛనమే .. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా
  • నేడు యధావిధిగా మున్సిపల్ ప్రత్యేక సమావేశం
  •  క్యాంపు నుంచి నేరుగా హాజరుకానున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు
  • చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మరోసారి ప్రత్యేక సమావేశం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్​పై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కు మెజారిటీ సభ్యుల సంఖ్యాబలం ఉండడంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమైంది. దీంతో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్ తమ పదవులకు రాజీనామాలు సమర్పిండంతో అవిశ్వాస తీర్మానం లాంఛనమే కానుంది. చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామాలు ఇంకా ఆమోదం పొందకపోవడంతో గురువారం జరిగే ప్రత్యేక సమావేశాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్, మంచిర్యాల ఆర్డీవో రాములు తెలిపారు. 

చేతులెత్తేసిన బీఆర్ఎస్..

అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేటలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒకసారిగా మారిపోయాయి. 

బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. మంచిర్యాలలో మొత్తం 36 వార్డులకు గాను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 22, కాంగ్రెస్ 14 స్థానాలను గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరడంతో ఆ పార్టీ బలం 26కు పెరిగింది. కాంగ్రెస్​కు మెజారిటీ కౌన్సిలర్ల మద్దతు ఉండడంతో చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్​కు పదవీగండం ఎదురైంది.

క్యాంపుకు తరలివెళ్లిన కాంగ్రెస్​ కౌన్సిలర్లు

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ అవి ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో ప్రత్యేక సమావేశాన్ని యథావిధిగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా క్యాంపు ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు రెండు రోజుల కింద హైదరాబాద్​లోని క్యాంపుకు తరలివెళ్లారు. 

వారంతా నేడు ఉదయం క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ సమావేశానికి హాజరై అవిశ్వాసానికి మద్దతు తెలుపనున్నారు. కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో చైర్మన్​గా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్​గా చల్లా నరేశ్​ను ఎన్నుకునే అవకాశం ఉంది.

రేపు బెల్లంపల్లి, నస్పూర్​లో..

బెల్లంపల్లి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్​లు, వైస్ చైర్మన్​పై కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు అందజేయగా.. ఈనెల 12న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాస సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తన పదవిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్ లో చేరారు. 

ఆ తర్వాత 12 మంది కౌన్సిలర్లు సైతం హస్తం గూటికి చేరుకున్నారు. మొత్తం 35 స్థానాలకు గానూ పార్టీలకు అతీతంగా 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు అందజేశారు. బీఆర్ఎస్​కు చెందిన కౌన్సిలర్లు వారంరోజుల కింద క్యాంపుకు తరలివెళ్లారు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో బెల్లంపల్లిలో అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నస్పూర్ మున్సిపాలిటీలో 25 వార్డులకు గానూ ప్రస్తుతం కాంగ్రెస్​కు 17 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరంతా రెండ్రోజుల క్రితం హైదరాబాద్​లో క్యాంపుకు వెళ్లారు. దీంతో ఇక్కడ కూడా అవిశ్వాస తీర్మానం లాంఛనమే కానుంది.