
- అమెరికా రక్షణ శాఖ ఆఫీస్‌ను సందర్శించనున్న డోజ్ చీఫ్
- ఆయనకు యుద్ధ రహస్యాలను వివరించనున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం
వాషింగ్టన్: చైనాతో యుద్ధం వస్తే అమెరికా ఏంచేయనుందన్న రహస్యాలను ఎలాన్ మస్క్ కు యూఎస్ రక్షణశాఖ ఆఫీస్ పెంటగాన్ అధికారులు వివరించనున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక గురువారం సంచలన కథనం వెలువరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహితుడైన మస్క్ ఇప్పటికే డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) చీఫ్ గా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ఇకపై ఆయన పాత్ర మరింత విస్తృతం కానుందని ఆ పత్రిక తెలిపింది.
యూఎస్ డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ ఆహ్వానం మేరకు మస్క్ శుక్రవారం పెంటగాన్ ను సందర్శించనున్నారని పేర్కొంది. ‘‘చైనాతో యుద్ధం వస్తే అమెరికా అనుసరించాల్సిన యుద్ధ ప్రణాళికపై అత్యంత రహస్య సమాచారంతో అధికారులు 20 నుంచి 30 స్లైడ్‌లతో నివేదిక సిద్ధం చేశారు. యుద్ధం మొదలైతే అమెరికాలోని ఏయే లక్ష్యాలపై చైనా దాడి చేస్తుంది? ప్రతిగా అమెరికా ఎలాంటి రక్షణ, ప్రతిదాడి వ్యూహాలను అమలు చేయాలి? అన్న రహస్యాలను ఇందులో పొందుపర్చారు. ఈ నివేదికను త్వరలోనే ప్రెసిడెంట్ ట్రంప్‌కు పెంటగాన్ అధికారులు అందజేయాల్సి ఉంది. కానీ అంతకుముందుగానే ఈ నివేదికలోని సీక్రెట్స్ ను అధికారులు మస్క్‌కు తెలియజేయనుండటం ఆశ్చర్యకరమైన విషయం” అని వివరించింది. అయితే, న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ ఖండించారు.
టైమ్స్ కథనం విడ్డూరం: ట్రంప్
ఎలాన్ మస్క్‌కు రక్షణ శాఖ రహస్యాలను వెల్లడించనున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన కథనం విడ్డూరంగా ఉందని ప్రెసిడెంట్ ట్రంప్ విమర్శించారు. ఆ పత్రిక కథనం పూర్తి అబద్ధాలతో ఉందని ఖండించా రు. మస్క్ కేవలం పెంటగాన్‌ను సందర్శిస్తున్నార ని, అసలు ఈ పర్యటనలో చైనా ప్రస్తావనే లేదన్నారు.
న్యూయార్క్ టైమ్స్ మళ్లీ ఫేక్ కథనాన్ని వండి వార్చిందని రక్షణ మంత్రి హెగ్సెత్ కూడా ఖండించారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. న్యూయార్క్ టైమ్స్‌కు తప్పుడు సమాచారాన్ని లీక్ చేసిన పెంటగాన్ సిబ్బందిని గుర్తించి, చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, టెస్లా సీఈవో మస్క్ కు ఇటు పెంటగాన్ తో, అటు చైనాతో రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి న వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే యుద్ధ రహస్యాలు తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష డెమోక్రాట్లు, విమర్శకులు ఆరోపిస్తున్నారు.