భారతీయ జనతా పార్టీ 1985 నుంచి అయోధ్యలో రామ జన్మభూమి సమస్యను ప్రధానంగా లేవనెత్తుతోంది. అయోధ్యలో రామమందిరం ఉద్యమం దేశవ్యాప్తంగా హిందువులలో ఐక్యతను తెచ్చిపెట్టడంతోపాటు బీజేపీ అధికారంలోకి రావడానికి సహాయపడిందని చాలామంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇతర మతాల మాదిరిగా, క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు పవిత్ర ఖురాన్ ఉన్నట్లుగా హిందువులకు సర్వత్రా ఆమోదం పొందిన ఒక గ్రంథం లేదా ప్రత్యేక నియమావళి లేదు. క్రైస్తవులకు పోప్ ఉన్నవిధంగా హిందువులకు అధికారికంగా అధినేత లేదా మతపెద్ద అంటూ ఎవరూ లేరు. దీనివల్లే హిందువులు కులాల వారీగా విభజించబడ్డారనే అభిప్రాయం ఏర్పడింది.
భారతదేశంలో జరిగే ఎన్నికల్లో కులం పెద్ద పాత్ర పోషిస్తుందనేది వాస్తవమే కావచ్చు. కానీ, రామమందిర ఉద్యమం ఖచ్చితంగా హిందువుల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు తెచ్చింది. హిందువులు కులం లేదా ఇతర కారణాల వల్ల వారి ఓట్లు ఆయా పార్టీలకు వేసినప్పటికీ, కొన్ని సాధారణ నమ్మకాలు, జ్ఞాపకాలు హిందువులు అందరికీ ఉన్నాయని కొన్ని సంఘటనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
దీనికి మహా కుంభమేళా లేదా తెలుగువారికి నదీ పుష్కరాలు మంచి ఉదాహరణలు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా అనేది 1768లో మొదటిసారిగా ప్రచురితమైన ఒక ప్రఖ్యాత పుస్తకం. ఈ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం, అదేవిధంగా భారత ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2019లో గంగానదిలో జరిగిన కుంభమేళాకు 20 కోట్ల మందికిపైగా హిందువులు హాజరయ్యారు.
ఆ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన 5 కోట్ల మంది హిందువులు తరలి వచ్చారని వెల్లడైంది. దీంతో 4 ఫిబ్రవరి, 2019 కుంభమేళాలో అత్యంత ముఖ్యమైన రోజుగా నమోదైంది. ప్రపంచ చరిత్రలో ఒకే రోజు ఏ దేశంలో, ఏ ప్రాంతంలోనూ 5 కోట్ల మంది కూడిన జనసమూహాన్ని ప్రపంచం చూడలేదంటే అతిశయోక్తి కాదు.
రామమందిరం బీజేపీని గెలిపిస్తుందా..
2024 జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడం ఈ ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సహాయపడుతుందా అనేది కీలక ప్రశ్నగా మారింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిన కామన్ సివిల్కోడ్తోపాటు కొన్ని కీలక కల్చరల్ ఇష్యూస్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో 2024 లోక్సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది. భారతదేశం తన చరిత్ర, సంస్కృతి, విశిష్ట గుర్తింపును, 7000 సంవత్సరాల చరిత్రను కొనసాగించాలని నరేంద్ర మోదీ, బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
రామమందిరం వారి ఫిలాసఫీకి గొప్ప ఉదాహరణ. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు సాంస్కృతిక, మతపరమైన యుద్ధంగా మారాయి. అదేవిధంగా ఆర్థిక, కులాల సమస్యలు కూడా ఉన్నాయి. కానీ, దేశంలో మెజార్టీ ప్రజలను జాతీయవాద దిశలో ఉంచగలిగితే చాలు బీజేపీకి గెలుపు నల్లేరుపై నడకగా ఆ పార్టీ భావిస్తోంది. దీనికోసం బీజేపీ ఎలాంటి కుల రాయితీలు ఇవ్వడానికైనా వెనకాడదు. అదేవిధంగా అన్ని రాజకీయపార్టీల కంటే ఎక్కువ ఉచితాలను ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. బీజేపీ రాజకీయాలు అన్ని కుల సంఘాలను సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఉన్నాయి.
1951లో భారత్ చిహ్నంగా.. సోమనాథ్
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మనుగడలో దళితులు, గిరిజనులు, ఓబీసీల పాత్ర కీలకం. మోదీ పాలసీలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా కులం, భాష, ప్రాంతాలకు అతీతంగా హిందువుల మధ్య ఐక్యత పెరుగుతుందని నిర్ధారించేవిధంగా మోదీ విధానాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా ఈ ఏడాది జనవరి 22న నిర్వహించనున్నారు.
16వ శతాబ్దంలో మొగలుల కాలంలో రాముడి జన్మస్థలంలో బాబ్రీ మసీదు నిర్మితమైతే దాదాపు 500 సంవత్సరాల తర్వాత రామమందిర నిర్మాణాన్ని గొప్ప నాగరికత విజయంగా బీజేపీ ప్రదర్శిస్తోంది. 1951లో అప్పటి భారత ప్రభుత్వం భారతదేశ చిహ్నంగా సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించింది. కానీ, ఇప్పటి రామమందిరం వేడుకలతో పోలిస్తే ఆ వేడుక ఈ స్థాయిలో లేదు. రామమందిర వేడుకలను జాతీయ వేడుకగా చేయడానికి, వివిధ సామాజిక వర్గాలు రామమందిరం వేడుకల్లో పాల్గొ నేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. దేశ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రామమందిరాన్ని నిర్మించామని, బీజేపీ హామీలను నెరవేర్చిందని ఎన్నికల సమయంలో చెప్పేందుకు బీజేపీ కచ్చితంగా ప్రయత్నిస్తుంది.
కాంగ్రెస్ పాఠాలు నేర్చుకుందా?
2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని, వరుసగా మూడోసారి దేశాన్ని ఏలాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా బలమైన భారత దేశాన్ని తయారు చేసేందుకు బీజేపీ ఆసక్తి చూపుతోందని, బీజేపీ వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేరుస్తుందని రామమందిరం అంశాన్ని ప్రజలకు చెప్పనుంది. రామమందిరం బీజేపీని సొంతంగా గెలిపించలేదు. కానీ, రామ్ ప్లస్ గుడ్ గవర్నెన్స్ బీజేపీ విజయానికి తప్పకుండా దోహదపడుతాయని ఆ పార్టీ ఆశిస్తుంది.
రక్షణ, భారీ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, సాధ్యమయ్యే ప్రతిదీ అమలుచేయడమే సుపరిపాలన. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ అందజేసిన నివేదికలో..కాంగ్రెస్ గొప్ప సెక్యులర్ పార్టీ. కానీ, కాంగ్రెస్ లౌకికవాదాన్ని వదిలి మైనారిటీల వైపు మొగ్గు చూపిందని హిందువులు భావించారని తెలిపారు.
కాంగ్రెస్ తన వైఖరిని సరిదిద్దుకోవాలని, అప్పుడే హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని ఏకే ఆంటోనీ సిఫార్సు చేశారు. మొదటి ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో వారి చేతుల్లో తమ దేశం సురక్షితంగా ఉంటుందని భావించినందున మెజారిటీ హిందువులు వారిని విశ్వసించారు. ఏకే ఆంటోనీ సలహాను కాంగ్రెస్ చిత్తశుద్ధితో పరిగణించాల్సిన అవసరం ఉంది.
రాముడే కాదు, సుపరిపాలన కూడా అవసరం
దేశాలంటే కేవలం భూమి కాదు. భూమి సరిహద్దులు మారుతాయి. సాధారణంగా ఒక దేశాన్ని తయారు చేసేది ‘కామన్ చారిత్రక జ్ఞాపకాలు’. రాముడి జన్మస్థలంలో రామమందిరం నిర్మించడం వల్ల బీజేపీకి లాభమే కానీ ఎటువంటి నష్టం జరగదు. అయితే ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి రామ్ ప్లస్ సుపరిపాలన కూడా అవసరం. మోదీ సుపరిపాలన ఇవ్వకపోతే రామమందిరం ఏ మాత్రం ఉపయోగపడదు. రామరాజ్యం అంటే "గొప్ప సుపరిపాలన"తో పాటు రామమందిరం. దేశ ప్రజలందరికీ అయోధ్యను చూపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇక
సార్వత్రిక ఎన్నికల సమరంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎటువంటి తీర్పును ఇస్తారో వేచి చూద్దాం.
సంక్షేమ పథకాల వైపు బీజేపీ మొగ్గు
భారతదేశ చరిత్ర, గొప్పతనంతో మాత్రమే ప్రతిసారి ప్రజలను ఆకట్టుకోలేమని, ఎన్నికల్లో గెలవలేమని బీజేపీ చాలా కాలం క్రితమే గ్రహించింది. ప్రజలు కూడా ఉచితాలు, సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారని బీజేపీకి అగ్రనాయకత్వానికి అర్థమైంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంక్షేమ పథకాలు ఊపందుకున్నాయి. సాంస్కృతిక లక్ష్యాలతోపాటు సామాజిక లక్ష్యాలను సాధించాలని ప్రధాని మోదీ గ్రహించారు.
దేశవ్యాప్తంగా ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలను అందించడంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీలను అధిగమించాలి. తద్వారా సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయం సాధించాలి. 2014లో నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అదృష్టవశాత్తూ అంతర్జాతీయంగా చమురు ధర చాలా తక్కువ స్థాయికి పడిపోయింది ఈ పరిణామం బీజేపీ ప్రభుత్వానికి కలిసొచ్చింది. మిగులు సొమ్మును మౌలిక సదుపాయాలు, రక్షణ, సంక్షేమ పథకాలకు ఎక్కువగా మోదీ సర్కారు వినియోగించింది. భూమ్మీద ఏ దేశం కూడా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వలేదనేది వాస్తవం.
- పెంటపాటి పుల్లారావు పొలిటికల్ ఎనలిస్ట్