జగిత్యాల జిల్లా : ఒకప్పటి ఉద్యమ బతుకమ్మ ఇప్పుడు ఓట్ల బతుకమ్మగా మారిందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. అదే బతుకమ్మ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కోసం మరోసారి ఉద్యమ బతుకమ్మగా మారాలన్నారు. సకల సంపదలు గల దేశంలో దరిద్రం ఎట్లా ఉంది అని తాను 1972లో రాశానని, ఇప్పటికీ ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మైనింగ్, ఇసుక, ల్యాండ్, వైన్, ఓటు మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. యువకులు తమ ఓటును ఆయుధంగా వాడుకోవాలన్నారు. రైతు శక్తి రాజకీయ శక్తిగా మారాలన్నారు. ప్రజలు కోరుకుంటే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడం కోసం అవసరమైతే చెరుకు రైతులతో కలిసి గోకరాజు గంగరాజును, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వారు ఒప్పుకోకుంటే రైతులతో కలిసి ఉద్యమం చేస్తానని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో గద్దర్ పాల్గొన్నారు.
బీజేపీని వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన బీజేపీ వ్యతిరేక రాష్ట్ర ప్రతినిధుల మీటింగ్ కు ఎందుకు వెళ్లలేదని ప్రజా గాయకుడు గద్దర్ ప్రశ్నించారు. బీజేపీ వాళ్లతో ఎప్పుడు సఖ్యతగా ఉంటారో, ఎప్పుడు వ్యతిరేకిస్తారో అర్థం కాదని, ఈ విషయంలో కేసీఆర్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. పబ్లిక్ సెక్టార్ అంతా ప్రైవేటుపరం అవుతోందన్నారు. ఫ్యాక్టరీలను నడిపించడానికి ప్రైవేట్ వ్యక్తులు ఫ్యాక్టరీలను కొనడం లేదని, వాటి భూముల కోసమే కొంటున్నారని అన్నారు. ఫ్యాక్టరీలు మూసివేసి భూములను అమ్ముకోవడానికి చూస్తున్నారని చెప్పారు. ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులు ఆ ఫ్యాక్టరీలను మూసివేసినప్పుడు తమ భూములు తమకు ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేయాలన్నారు. మావోయిస్టులు జెండాలు పాతిన దొరల భూములకు కూడా రైతుబంధు ఇస్తున్నారని, ఇదంతా ధరణి మహత్యం అన్నారు. అమెరికాలో ఉంటున్న సంపన్నులు కూడా రైతుబంధు తీసుకుంటున్నారని చెప్పారు.