కామ్రేడ్ల తాపత్రయమంతా సీట్ల కోసమేనా : కూరపాటి వెంకట నారాయణ

కామ్రేడ్ల తాపత్రయమంతా సీట్ల కోసమేనా : కూరపాటి వెంకట నారాయణ

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే సంస్కృతి కమ్యూనిస్టులకు కూడా  అంటుకుంటుందని  కారల్ మార్క్స్, ఫెడరిక్ యాంగిల్స్, స్టాలిన్ ఊహించకపోవచ్చు. భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకసారి కాంగ్రెస్ తో, మరోసారి టీడీపీతో ఒకటి రెండు సీట్ల కొరకే పొత్తులు పెట్టుకొని ప్రజలకు కార్యకర్తలకు శ్రామిక వర్గాలకు శాశ్వతంగా దూరమయింది. చంద్రబాబుకు అనుకూలురు టీడీపీతో జతకట్టాలని, రాజశేఖర్ రెడ్డికి అనుకూలమైన వారు కాంగ్రెస్ తో  జత కట్టడానికి ప్రయత్నించారని క్షేత్రస్థాయి కామ్రేడ్స్ చర్చించుకుంటారు. 1985 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీతో పొత్తులు కలవడం ఒక సాధారణ ఆనవాయితీగా వస్తున్నది.

అధికార పార్టీలతో పోత్తులు పెట్టుకోవడం వల్ల ఎదిగిన కొద్ది మంది మొదటి రెండవ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీలో  చేరి దోపిడీ వ్యవస్థలో భాగస్వాములు కూడా అవుతున్నారు. వాస్తవం మాట్లాడుకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలలో ఒకటి రెండు సామాజిక వర్గాల నుంచి మాత్రమే కొద్దిమంది అగ్ర నాయకులు ఎదుగుతున్నారు. ఇతర సామాజిక వర్గాల నాయకులు ముఖ్యంగా బహుజనుల నుంచి దశాబ్దాల కాలం పార్టీని వీడకుండా సమర్థవంతంగా, అంకిత భావంతో శ్రమించినప్పటికీ వారికి ఎదుగు బొదుగు లేకుండా  అలానే మిగిలిపోతున్నారు. పొత్తుల కారణంగా ఒకటి రెండు అవకాశాలు వచ్చినా అగ్ర నాయకులకే దక్కుతున్నాయి. పాలేరు, మిర్యాలగూడ, కొత్తగూడెం, హుస్నాబాద్ నియోజకవర్గాలను తమకే కేటాయించాలని వామపక్షాల అగ్ర నాయకులు కొందరు  పట్టుబడుతున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

ఆశ్చర్యపోతున్న బుద్ధిజీవులు

ప్రజా వ్యతిరేక ఆర్థిక రాజకీయ విధానాలను అమలు చేస్తున్న తీరు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరుగలేదు. ప్రజా జీవనం, అభివృద్ధి సంక్షేమ రంగాల విధ్వంసకరమైన పాలన జరుగుతున్నా మన కామ్రేడ్స్ కు కనీసం కనికరం కూడా రావడం లేదని మేధావులు భావిస్తున్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలి అధికార దాహంతో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వేలకోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని వెదజల్లుతున్న నాయకునితో పొత్తులు పెట్టుకుంటామని కామ్రేడ్స్ సమాలోచనలు చేయడం స్వీయ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలను, మేధావులను, తెలంగాణ ప్రజలందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. తెలంగాణ కామ్రేడ్స్ త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల పొత్తుల ఆలోచన శ్రామిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని, భూస్వామ్య నిరంకుశ కుటుంబ ఆధిపత్య  ప్రాంతీయ పార్టీతో అంట కాగడం సబబు కాదని జస్టిస్ చంద్రకుమార్ సార్ కూడా ఇటీవల ఒక ప్రముఖ దినపత్రిక ద్వారా కామ్రేడ్స్ కు హితవు పలికారు.

ఎక్కడ చూసినా సమస్యలే

ప్రజల మౌలిక సమస్యలను ఉపేక్షించి కేవలం కొద్ది మంది అగ్రస్థాయి నాయకుల కొరకు చట్టసభలలోఒకటి రెండు సీట్లు పొందడం కొరకే తాపత్రయపడుతున్నారని వివిధ వర్గాల కార్మికులు ఆందోళన పడుతున్నారు. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం క్రింది స్థాయి కార్యకర్తలను పురమాయించి క్షేత్రస్థాయిలో అడపా దడపా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయించడం పరిపాటి అయింది. తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న అశాంతి, బాధలు, కష్టాలు అనుభవిస్తున్న నష్టాలు వర్ణనాతీతం. నిరుద్యోగులు విద్యార్థులు, కాంట్రాక్టు ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాంఘిక భద్రత లేకుండా బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నారు. 

ప్రజా సమస్యల కారకుడితో  పొత్తా?

పంటలు పండించినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లేక సబ్సిడీలు ఎత్తివేయడం రుణమాఫీ చేయకపోవడం, పంటల భీమా ఎత్తివేయడం కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ ఆగకపోవడం  సింగరేణి కార్మికుల సమస్యలు పేరుకుపోవడం, శ్రామిక వర్గాలంతా ప్రస్తుత ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు బీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకోవడానికి ప్రగతి భవనంలో మంతనాలు జరుపుతున్నదని మీడియాలో కథనాలు చదువుతున్నాం. అధికార పార్టీతో అంటకాగడానికి ఏదో ఒక కానీ పోనీ కుంటి సాకు చెపుతుంటారు మన కామ్రేడ్స్. తెలంగాణ రాష్ట్రంలో కేవలం బీజేపీని ఓడించడానికి బీఆర్​ఎస్​తో పొత్తు పెట్టుకుంటున్నామని ఒక వంక చెపుతుంటారు. ఏ కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు  వేలాదిమంది  కామ్రేడ్స్ ఆనాడు జమీందారులు, జాగిర్దారులు, నవాబులకు, రజాకార్లకు దొరలకు వ్యతిరేకంగా అనేక త్యాగాలు చేసినారో ఆ దొరలతో అంటకాగడానికి ఎలా ఇష్టపడుతున్నారని ప్రజల్లో చర్చ ఉంది.

ప్రజల సమస్యలు పట్టని ఉభయ కమ్యూనిస్టులు

గత తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ 90% ప్రజల విద్య వైద్య రంగాలు పూర్తిగా నిర్లక్ష్యం  చేయబడ్డాయి. నీటి ప్రాజెక్టుల, లిక్కర్ వ్యాపార స్కాముల, అవినీతితో పాటు ఆశ్రిత పక్షపాతం, కుల వివక్షత, వర్గ దృక్పథం, ధరణి కష్టాలు కౌలు రైతుల మరణాలు, ఇంకా విచ్చలవిడిగా విస్తరిస్తున్న మద్యం దుకాణాల వ్యాపారం, అకాల మరణాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మద్యం వ్యసన బారిన పడ్డ లక్షలాది పేద కుటుంబాలు ముఖ్యంగా భర్తలను కోల్పోయిన స్త్రీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోతున్నారు. ఈ బాధిత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవలసిన బాధ్యత కామ్రేడ్స్ కు  పట్టదా? నైజాముల పాలనను తలపించే నిర్బంధం, అణిచివేత, అప్రజాస్వామిక చర్యలు, మహిళల పట్ల అధికార పార్టీ కొందరు ప్రతినిధులు, నాయకుల అసభ్యకర చేష్టలు రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులను వెక్కిరిస్తున్నాయి.  

 ప్రగతి భవన్​ పిలుపు కోసం ఎదురుచూపులా?

ఆనాడు భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, బానిసత్వ నిర్మూలన కొరకు కార్మిక రాజ్యం కొరకు పాటుపడ్డారు, 4000 మంది ప్రాణత్యాగాలు చేసినారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్ర నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించే  ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజల పక్షాన నిలబడాలని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో మమేకమవుతున్న కార్యకర్తలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో సంప్రదించి సముచితమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కార్మికుల, కర్షకుల, నిరుపేదల పక్షాన నిలబడి పోరాటం చేయవలసిన కామ్రేడ్స్ ప్రస్తుతం నిజాం కాలం నాటి దొరతనాన్ని ఆధిపత్యాన్ని అణచివేతను నిరంతరం అమలు చేస్తున్న నాయకునితో సంప్రదింపులు, సీట్ల బేరం చేయడం అనేక వామపక్ష పోరాటాలలో రైతాంగ పోరాటాలలో ప్రాణాలర్పించిన వీరుల అమరత్వాన్ని త్యాగాలను కించపరచినట్లే  కదా?   ముఖ్యంగా ఉభయ కమ్యూనిస్టుల అగ్ర నాయకులు   మరోసారి చారిత్రక తప్పిదం చేయకుండా ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీలకు మనుగడ కొనసాగుతుంది.  లేదంటే  తమ ఉనికిని తామే కాదనుకున్నట్లవుతుంది.

కూరపాటి వెంకట నారాయణ,రిటైర్డ్​ ప్రొఫెసర్