నల్గొండలో ఫ్రీ చికెన్.. ఎగబడ్డ జనం.. జస్ట్ గంటలో ఊదేశారు..!

నల్గొండలో ఫ్రీ చికెన్.. ఎగబడ్డ జనం.. జస్ట్ గంటలో ఊదేశారు..!

నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ మేళాకు జనం భారీగా తరలివచ్చారు. మేళాలో 2 వేల ఎగ్స్‌‌, 300 కేజీల చికెన్ 65 తయారు చేసి ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల్లో అంతుచిక్కని వ్యాధులతో కోళ్లు చనిపోతుండగా చికెన్‌‌ కొనుగోళ్లు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ మేళాలో గంటలోనే ఎగ్స్‌‌, చికెన్​65 ఖాళీ అయింది. బర్డ్‌‌ ఫ్లూపై అవగాహన పెంచి కోళ్ల కొనుగోళ్లు పెంచాలనే ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహించినట్లు టౌన్ చికెన్ సెంటర్స్ యజమానులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌ మండలం నేలపట్ల గ్రామంలోని శివ అనే వ్యక్తికి చెందిన ఫారంలో తరచూ కోళ్లు చనిపోతున్నాయి. ఈ నెల 16న ఒకేసారి 600 కోళ్లు చనిపోవడంతో గొయ్యి తీసి పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న పశుసంవర్థక శాఖ ఆఫీసర్లు ఫారం వద్దకు వచ్చి కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌‌ను సేకరించి ల్యాబ్‌‌కు పంపించారు. అక్కడ టెస్ట్‌‌లు చేసి చనిపోయిన కోళ్లకు బర్డ్‌‌ ఫ్లూ సోకిందని జిల్లా ఆఫీసర్లకు ప్రాథమికంగా సమాచారం అందించారు. 

దీంతో జిల్లా పశు సంవర్థక శాఖ ఆఫీసర్‌‌ జానయ్య తన సిబ్బందితో కలిసి హుటాహుటిన నేలపట్లలోని కోళ్లఫారం వద్దకు చేరుకున్నారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది పీపీఈ కిట్స్‌‌, ముఖాలకు మాస్క్‌‌లు ధరించి కోళ్ల ఫారంలోకి వ్యర్థాలను పూర్తిగా తొలగించారు.