నిర్మల్, వెలుగు: జిల్లా కేంద్రంతోపాటు భైంసా, ఖానాపూర్ ఇంకా అనేక గ్రామాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పాడుతున్నారు. గత ఐదారు నెలల నుంచి కోతుల గుంపు విపరీతంగా పెరిగింది. వీధుల్లో ఎక్కడ చూసినా కోతుల గుంపులే కనిపిస్తున్నాయి. చేతిలో కర్ర లేనిదే గల్లీ దాటే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలామంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పంట చేలను సైతం నాశనం చేస్తున్నాయని రైతులు అంటున్నారు. రాత్రింబవళ్లు వాటిని అడ్డుకునేందుకు కాపలా కాస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..
కోతుల నుంచి రక్షించే విషయంలో మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కోతులను మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు పట్టుకొని నిర్మల్ లోని కోతుల పునరావాస కేంద్రానికి తరలించాల్సి ఉంది. అయితే కోతులు పట్టడం ఖరీదుగా మారింది. కోతులు పట్టేవారు కూడా అందుబాటులో లేకపోతుండడం సమస్య ను మరింత తీవ్రం అవుతోందని అధికారులు అంటున్నారు. కోతులను పట్టుకునేందుకు ఎలాంటి బడ్జెట్ లేదు.
అయితే కొన్ని గ్రామపంచాయతీలు మాత్రం సాధారణ నిధుల నుంచి కోతులను పట్టుకొని నిర్మల్ పునరావాసానికి తరలిస్తున్నాయి . కొద్ది రోజుల క్రితం ఇక్కడి చించోలి వద్దగల కోతుల పునరావాస కేంద్రానికి సిద్దిపేట, నర్సాపూర్ మున్సిపాలిటీల నుండి దాదాపు 500 కోతుల ను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం తీసుకువచ్చినట్లు ఇక్కడి వైద్యాధికారి తెలిపారు. అయితే నిర్మల్ జిల్లా నుంచి మాత్రం ఆశించిన రీతిలో పునరావాస కేంద్రానికి కోతులను స్టెరిలైజేషన్ కోసం తీసుకురావడం లేదు.
రెండేండ్లలో 1141 స్టెరిలై జేషన్లు మాత్రమే....
నిర్మల్ జిల్లా కేంద్ర సమీపంలోని చించోలి వద్ద గండి రామన్న హరితవనంలో ఏర్పాటుచేసిన మంకీ రెస్క్యూ అండ్ రిహాబిటేషన్ సెంటర్ (కోతుల పునరావాస కేంద్రం) లో ఇప్పటివరకు కేవలం 1141 కోతులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేశారు. ఇక్కడ 2020 డిసెంబర్ లో కోతుల పునరావాస కేంద్రాన్ని దాదాపు కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో గల కోతులను పట్టుకొని ఇక్కడి కేంద్రానికి తీసుకురావాల్సి ఉంది. ఇక్కడ స్టెరిలైజేషన్లు కాగానే వాటిని తిరిగి అదే ప్రాంతానికి పంపుతారు. ప్రతిరోజు 20 కి పైగా కోతులకు స్టెరిలైజేషన్ చేసే ఏర్పాట్లు ఉన్నట్లు పశువైద్యాధికారి తెలిపారు. ఈ కేంద్రంలో 150 కి పైగా కోతులకు స్టెరిలైజేషన్ చేసి వారం రోజులపాటు ఇక్కడే పునరావాసం కల్పించే వెసులుబాటు ఉందన్నారు.
అందరూ చొరవ తీసుకోవాలి...
కోతుల సంఖ్య తగ్గించాలంటే స్టెరిలైజేషన్ ఒక్కటే మార్గం.గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు చొరవ తీసుకోవాలి. ఇప్పటికే వివిధ జిల్లాల నుండి కూడా నిర్మల్ కేంద్రానికి కోతులను తీసుకువచ్చి స్టెరిలైజేషన్ చేయిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరింత చొరవ తీసుకుంటే సమస్య కొంతవరకైనా తగ్గుతుంది. - శ్రీకర్ రాజు, వైద్యాధికారి,