తల్లాడ వెలుగు : గ్రామాల్లో ఇంటింటికి మిషన్ భగీరథ నల్లాలు ఏర్పాటు చేసి తాగునీళ్లందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అమలులో విఫలమైందని, నల్లాలే లేని ఊర్లలో నీళ్ల పండుగలు చేయడం ఏమిటని మిషన్ భగీరథ ఆఫీసర్లను గ్రామస్తులు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు మండలాలకు సంబంధించిన వేడుకలు తల్లాడ మండలం మువ్వ గూడూరు సమీపంలోని కనిగిరి హిల్స్ వద్ద నిర్వహించారు.
ఈ సందర్భంగా తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన షేక్ మదర్ సాహెబ్ స్టేజీ మీదకు వచ్చి మిషన్ భగీరథ అమలుతీరును విమర్శించారు. కుర్నవల్లిలో దాదాపు 12వందల ఇండ్లు ఉంటే 400 మాత్రమే కనెక్షన్లు ఉన్నాయని, అవి కూడా గతంలో ప్రభుత్వాలు వేసిన పాత కనెక్షన్లకే ఇచ్చారన్నారు. నల్లాలే లేని ఊర్లలో నీళ్ల పండుగ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదని, సీఎం కేసీఆర్ పంపించిన సందేశ పత్రాన్ని చూసి వచ్చానన్నారు. ఈ క్రమంలో మరికొందరు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం, పైపులు లీకేజీలు లాంటి సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పలేక సభ ముగించి వెళ్లిపోయారు. ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, డి ఈ హరి, ఏఈ నితిన్, వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు పాల్గొన్నారు.