- ఎమ్మెల్యేలకు నిరసన సెగ
- పెద్దపల్లిలో ప్రభుత్వ పథకాల కోసం నిలదీసన మహిళలు
- అసహనం వ్యక్తం చేసిన మనోహర్‌రెడ్డి
- కామారెడ్డి జిల్లా షేరి బీబీపేటలో అర్హులకు దళితబంధు ఇవ్వాలని‘గంప’ కాన్వాయ్ అడ్డగింత
- వైరా ఎమ్మెల్యే తమ ఊరికి రావొద్దంటూ ఫ్లెక్సీలు కట్టిన కేజీ సిరిపురం దళితులు
సుల్తానాబాద్/కామారెడ్డి/వైరా, వెలుగు : ప్రభుత్వ పథకాలు అర్హులకు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేసేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆదివారం పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాలు డబ్బున్న వాళ్లు, బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని మహిళలు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని నిలదీశారు. కామారెడ్డి జిల్లాలో అర్హులైన అందరికీ దళితబంధు ఇవ్వాలని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ లీడర్లతో పాటు ఎమ్మెల్యే రాములు నాయక్ తమ గ్రామానికి రావొద్దంటూ కేజీ సిరిపురం దళితులు ఫ్లెక్సీలు కట్టారు. దళితబంధుతో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు ఏమైనయ్?
బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకులలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యటించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమయ్యాయంటూ మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. దళిత బంధు, బీసీ బంధు ఇతర సంక్షేమ పథకాలు సంపన్నులకు, కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక పథకంలో లబ్ధి పొందిన వారినే మళ్లీ మరో పథకానికి ఎంపిక చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే కొద్దిసేపు మహిళలను సముదాయించారు. అయినా వారు వినకపోవడంతో ‘అసలు మీ సమస్య ఏమిటి.. మీరేమైనా దరఖాస్తులు పెట్టుకున్నారా? ’ అని ప్రశ్నించారు. తామంతా దరఖాస్తు చేసుకున్నా రాలేదని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ALSO READ :- కాజీపేట వరకు పూణె-హైదరాబాద్ స్పెషల్ రైలు
అర్హులైన వారికి దళితబంధు ఇవ్వాలి
బీబీపేట మండలం షే రి బీబీపేటలో ఆదివారం దళితబంధు కోసం దళితులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. బీబీపేట,తుజాల్పూర్, షేరి బీబీపేటలో పలు అభివృద్ధి పనులను విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించేందుకు వచ్చారు. దీంతో షేరి బీబీపేట, తుజాల్‌పూర్‌కు చెందిన పలువురు దళితులు షేరీ బీబీపేటలో ఎమ్మెల్యే కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లారు. అర్హులైన అందరికీ దళితబంధు ఇవ్వాలని నినాదాలు చేశారు. పోలీసులు, బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చేస్తున్న వారిని పక్కకు తప్పించగా కాన్వాయ్ ముందుకు కదిలింది
మా గ్రామానికి రావద్దు
దళితబంధు పేరుతో ఎస్సీలను విడదీసి చిచ్చుపెడుతున్న అధికార పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్తమ గ్రామానికి రావద్దంటూ ఖమ్మం జిల్లాలోని వైరా మండలం కేజీ సిరిపురం గ్రామ దళితులు ఫ్లెక్సీలు పెట్టారు. తమ గ్రామంలో రాజుపేట, సిరిపురం ఎస్సీ కాలనీ, ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయని, ఇందులో రాజుపేటకి దళిత బంధు ఇచ్చి అన్నదమ్ములుగా ఉన్న ఊరిలో చిచ్చు పెట్టారని ఆరోపించారు. అందుకే అధికార పార్టీకి చెందిన గ్రామ నాయకుల నుంచి రాష్ట్ర నాయకుల వరకు తమ గ్రామానికి రావద్దని, వారిని బహిష్కరిస్తున్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే అన్ని ఎన్నికల్లో తమ గ్రామ దళితులంతా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తారన్నారు.