మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలోని ఐటీ పార్క్‌లో బ్యాటరీల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని అంటున్నారని, దీనివల్ల పాలమూరు రోగాల జిల్లాగా మారుతుందని, ఇలాంటి కంపెనీలు వద్దని ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ పార్క్ వద్ద మంగళవారం ఉదయం ఎలక్ర్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుపై అధికారులు పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ముందుగా టీఎస్ఐఐసీ తరఫున రిప్రజెంటేషన్ఇచ్చారు. తర్వాత ఐటీ పార్క్ శివారులోని దివిటిపల్లి, సిద్దాయపల్లి, ఎదిర, అంబట్పల్లి గ్రామాల ప్రజలు, రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ బ్యాటరీల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారని అంటున్నారని, అదే జరిగితే తాగు, సాగునీరు కలుషితమవుతుందని, గొర్లు, బర్రెలు, మేకలు చనిపోతాయని, ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు.
30 ఏండ్ల కింద ఎదిరలో ఏర్పాటు చేసిన కాటన్డెయింగ్సెంటర్ వల్ల ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఐటీ పార్క్ఏర్పాటు చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయని అనుకున్నామని, కానీ బ్యాటరీ కంపెనీ తీసుకొస్తామంటే తమ భూములు ఇచ్చేవాళ్లం కాదన్నారు. కొంతమంది స్టేజీ వద్ద మాట్లాడుతుండగానే ఆఫీసర్లు..ప్రజలు, రైతుల వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటుండటంతో ఆందోళనకు దిగారు. సంతకాల బుక్‌ను చించివేసే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో కొంత తోపులాట చోటుచేసుకుంది. జాయింట్కలెక్టర్తేజస్ నందలాల్‌పవర్ కలగజేసుకొని పబ్లిక్ హియరింగ్‌కు అటెండ్అయిన వారి సంతకాలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతించాలి: కలెక్టర్
‘ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది ఎలక్ర్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరా? లేక అమర రాజా బ్యాటరీ కంపెనీనా? క్లారిటీ ఇవ్వండి’ అని కొందరు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేయడం, ప్రజలు, రైతుల నిరసనతో కలెక్టర్ఎస్.వెంకట్రావు మాట్లాడారు. పాలమూరు పారిశ్రామికంగా వెనుకబడిందని, తప్పనిసరిగా ఏ పరిశ్రమ వచ్చినా అందరూ స్వాగతించాలన్నారు. ఐటీ పార్క్‌లో ప్రతిపాదించింది ఎలక్ర్టానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ అని.. కానీ అందరూ అమర రాజా అంటున్నారని, అది కాదని స్పష్టం చేశారు. టీఎస్ఐఐసీ ఆఫీసర్లు కంపెనీలతో మాట్లాడి భూములిచ్చిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేలా ప్రయత్నం చేయాలని కోరారు. భూములకు సంబంధించిన విషయంలో ఎవరికన్నా అన్యాయం జరిగి ఉంటే బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నుంచి ఒకటిన్నర వరకు తనను కలవవచ్చన్నారు.