- నిర్మాణాలు పూర్తైన చోట ఇంకా పంచుతలేరు
- ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ., స్థలాలు లేని పేదలకు పంచాలని డిమాండ్
మహబూబాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయగా, కొన్నిచోట్ల మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసి, పేదలకు పంచారు. అనేక చోట్ల బిల్లులు సకాలంలో రాకపోవడం, మెటీరియల్ ధరలు పెరిగిపోవడం, కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కాకపోవడంతో నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు మధ్యలో నిలిచిపోయిన పనులు, నిర్మాణాలు పూర్తైన డబుల్బెడ్రూమ్ ఇండ్లను పంచుతారా లేదా అని గతంలో దరఖాస్తులు చేసుకున్నవారు సందిగ్ధంలో ఉన్నారు. స్థలాలు లేని పేదలకు నిర్మాణాలు పూర్తయిన డబుల్ ఇండ్లను పంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read :- జగిత్యాల హాస్పిటల్‌లో ల్యాబ్ సిబ్బంది దందా
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా..
డబుల్ బెడ్రూమ్ఇండ్ల నిర్మాణాలు పూర్తై నెలలు గడుస్తున్నా, పంపిణీ చేయకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నవి. రాత్రి వేళల్లో మందుబాబులకు స్థావరాలుగా మారడంతో మద్యం సీసాల కుప్పలు పేరుకుపోతున్నవి. డబుల్ బెడ్రూమ్ఇండ్ల పంపిణీ విషయమై జిల్లా ఆఫీసర్లను వివరణ కోరగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా చర్యలు ఉంటాయని చెబుతున్నారు.
జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వివరాలు
జిల్లా మహబూబాబాద్ జనగామ హనుమకొండ వరంగల్ భూపాలపల్లి ములుగు
మంజూరైన ఇండ్లు 5567 4393 4326 6333 3822 1783
పనులు స్టార్ట్ కానివి 1101 1373 107 2503 1343 247
నిర్మాణంలో ఉన్నవి 1963 1566 2076 1503 926 620
పూర్తైన ఇండ్లు 2503 1454 2143 2327 1613 916
పంపిణీ చేసినవి 1403 670 436 500 1197 –
డబుల్ ఇండ్లను పంచాలి
అర్హులైన పేదలకు తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్మాణం పూర్తైన ఇండ్లను పంచాలి. సొంత ఇల్లు లేక అనేక మంది పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొర్రూరు పట్టణం దుబ్బతండా సమీపంలో డబుల్ ఇండ్లు నిర్మాణాలు పూర్తై నెలలు గడుస్తున్నా పేదలకు పంచడంలేదు. గ్రామ సభల ద్వారా అర్హులైన పేదలను గుర్తించి, పంపిణీ చేయాలి. అలిసేరి రవిబాబు, బీజేపీ తొర్రూరు పట్టణాధ్యక్షుడు