- ఆంధ్రాలో విలీనమైన వాటిని తెలంగాణలో కలపాలని డిమాండ్
- పలుమార్లు ఆ గ్రామాల ప్రజల ఆందోళనలు, అధికారులకు వినతులు
- 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఆసక్తి
భద్రాచలం, వెలుగు : దశాబ్దకాలంగా ఆందోళనలు, ప్రజాప్రతినిధులకు చేస్తున్న విజ్ఞప్తులు ఎప్పటికైనా ఫలించకపోతాయా అని ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీల ప్రజలకు గోదావరి వరదలు వస్తే బాధలు తప్పవు. 2020 వరదల సమయంలో తెలంగాణ నుంచి లాంచీలు వెళ్లి వరద బాధితులను రక్షించాల్సి వచ్చింది.
ఈ విభజన, పంచాయతీల విలీనంతో ఎక్కువగా నష్టపోయింది భద్రాచలమే. కనీసం డంప్ యార్డుకు, ప్రభుత్వ కార్యాలయం కట్టుకోవాలన్నా సెంటు భూమి కూడా లేని పరిస్థితి ఉంది. ఇక భద్రాద్రి రాముడి గుడి తెలంగాణలో ఉంటే, 1000 ఎకరాల దేవుడి మాన్యం ఆంధ్రాలో విలీనమైన పురుషోత్తపట్నంలో ఉంటుంది. ఈ విషయమై ఐదు గ్రామాల ప్రజలు ఇప్పటికే రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రికి సైతం వినతిపత్రాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలోనూ ప్రజలది ఇదే డిమాండ్ ప్రధానంగా ఉన్నది.
కాంగ్రెస్ హామీ.. ఆ దిశగా అడుగులు..
గత పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భద్రాచలం నుంచి ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహబూబ్ బాద్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు ఖమ్మంను కాంగ్రెస్‌కు గెలిపించి చేతిలో పెట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసి ఐదు పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేసేలా ఈనెల 6న భేటీలో ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని కోరారు. ఇద్దరు సీఎంల మధ్య మంచి రిలేషన్ ఉండడం ఇందుకు కలిసొచ్చే అంశమని స్థానికులు చెబుతున్నారు.
ఆ గ్రామాల పరిస్థితి ఇదీ..
భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న భక్తులు దుమ్ముగూడెం మండలం పర్ణశాల దేవాలయానికి నిత్యం వేలాది మంది వెళ్తుంటారు. పేరూరు వరకు 130 కిలోమీటర్ల వరకు తెలంగాణ ప్రాంతం ఉంది. ఈ రహదారిపై పదేళ్ల కాలంలో తట్ట మట్టిని కూడా ఆంధ్రా ప్రభుత్వం పోయలేదు. పెద్ద గోతులతో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. ఎటపాక, పిచ్చుకులపాడు, కన్నాయిగూడెం పంచాయతీల పరిధిలో ఉన్న ఈ రోడ్డు డెవలప్మెంట్ ఆగిపోయింది.
భద్రాద్రిరాముడి భూములు పురుషోత్తపట్నంలో 1000 ఎకరాలు ఉంది. దీన్ని పలువురు ఆక్రమించుకుంటున్నారు. అక్కడి రాజకీయ నేతల ప్రోద్భలంతో పెద్ద భవనాలు కట్టారు. అడ్డుకోవడానికి వెళ్లిన దేవస్థానం స్టాఫ్‌పై భౌతిక దాడులకు పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టినా పట్టించుకునే నాథుడే లేడు. భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం కబ్జాకోరులు పట్టించుకోవట్లేదు. ఈ కష్టాలు తీరాలంటే తిరిగి ఆ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపడమే మార్గం అని అక్కడి ప్రజలు ఆశపడుతున్నారు.
తిరిగి ఇవ్వాలి
ఆంధ్రాలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికే వినతిపత్రాలు అందజేశాం. ప్రజాసంక్షేమం, భావి తరాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కూడా ఆలోచించాలి. కలెక్టర్, ఎస్పీ ఆఫీసులతో పాటు, ఇక్కడి గిరిజనులు ఐటీడీఏ ఆఫీసుకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సీఎంల భేటీలో ఐదు పంచాయతీలు తెలంగాణకు తిరిగి తీసుకొచ్చేలా చూడాలి. -
పిట్టా శ్రీనివాసరెడ్డి, అడ్వొకేట్
కష్టాల నుంచి గట్టెక్కించండి
ఏదైనా ప్రమాదం జరిగితే 108 కోసం తెలంగాణలోని భద్రాచలంకు ఫోన్ చేస్తే ఏపీ అని వచ్చే పరిస్థితి లేదు. ఆసుపత్రులు దూరంగా ఉన్నాయి. ఏదైనా సర్టిఫికెట్లు తెచ్చుకోవాలన్నా జిల్లా కేంద్రం చాలా దూరంగా ఉంది. రైతులకు ఎరువులు, పురుగు మందులు దొరికే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మా గ్రామాలను తెలంగాణలో కలిపి ఇబ్బందులు తీర్చాలి.
సంపత్ యాదవ్, కన్నాయిగూడెం, విలీన పంచాయతీ