సింగరేణిలో పాత వాహనాలు ప్రాణాలు తీస్తున్నయ్‌‌‌‌

సింగరేణిలో పాత వాహనాలు ప్రాణాలు తీస్తున్నయ్‌‌‌‌
  • సింగరేణిలో కాలం చెల్లిన వాహనాలతో కార్మికులకు కష్టాలు
  • స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ కొరతతో మొరాయిస్తున్న మెషీన్లు
  • గురువారం జీడీకే 11 గనిలో ఎల్‌‌‌‌హెచ్‌‌‌‌డీ మెషీన్‌‌‌‌ కింద పడి ఆపరేటర్‌‌‌‌ మృతి
  • మార్చిలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన మరో కార్మికుడు
  • కొత్త యంత్రాల కొనుగోలును పట్టించుకోవడం లేదంటున్న కార్మికులు

కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్/గోదావరిఖని, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల్లో కాలం చెల్లిన యంత్రాల వాడకం కార్మికులకు శాపంగా మారుతోంది. పాత వాటి స్థానంలో కొత్త యంత్రాల కొనుగోలు చేయాల్సిన సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పాత వాటికే రిపేర్లు చేసి నడిపిస్తున్నారు. ఇలాంటి వెహికల్స్‌‌‌‌ కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గడంతో పాటు కార్మికుల ప్రాణాలు పోతున్నాయి.

మార్చి 16న మందమర్రి ఏరియా స్టోర్స్‌‌‌‌లో నుంచి ఇనుప రేకులను ఎస్కార్ట్‌‌‌‌ వెహికల్‌‌‌‌ స్ర్పింగ్‌‌‌‌ తాడు ద్వారా లోడింగ్‌‌‌‌ చేస్తుండగా తాడు తెగి రేకులు రాజు అనే కార్మికుడిపై పడ్డాయి. దీంతో అతడు స్పాట్‌‌‌‌లోనే చనిపోయాడు. తాజాగా గురువారం జీడీకే 11 గనిలో జరిగిన ప్రమాదంలో ఓ వెహికల్‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌ చనిపోయాడు. ఇలా రెండున్నర నెలల్లోనే ఇద్దరు కార్మికులు చనిపోవడానికి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మికులు మండిపడుతున్నారు.

అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌, ఓసీపీల్లో మెషీన్లే కీలకం

సింగరేణి వ్యాప్తంగా అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌, ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ మైన్స్‌‌‌‌లో కాలం చెల్లిన యంత్రాలనే వినియోగిస్తున్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో సైడ్‌‌‌‌ డిశ్చార్జి లోడర్‌‌‌‌ (ఎస్డీఎల్​), లోహైట్‌‌‌‌ డిశ్చార్జి లోడర్‌‌‌‌ (ఎల్‌‌‌‌హెచ్‌‌‌‌డీఎల్‌‌‌‌) యంత్రాలే కీలకం. పది మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో చేసే పనిని ఒక్క ఎస్డీఎల్‌‌‌‌ మెషీన్‌‌‌‌ ఒకే షిఫ్ట్‌‌‌‌లో పూర్తి చేస్తోంది. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఈ యంత్రాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.

రూ.35 లక్షల విలువైన ఎస్డీఎల్‌‌‌‌ మెషీన్‌‌‌‌ జీవిత కాలం నాలుగేళ్లు(12 వేల గంటలు). 1.2 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం ఈ మెషీన్‌‌‌‌ కెపాసిటీ. ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ గనుల్లో ఉత్పత్తి చేసిన బొగ్గును డంప్‌‌‌‌ యార్డులో భద్రపరుస్తారు. డంప్‌‌‌‌ చేసిన బొగ్గును క్రషర్‌‌‌‌కు తరలించందుకు డంపర్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ను వాడుతారు. ఇలా అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌, ఓసీపీల్లోనూ యంత్రాల వినియోగమే కీలకంగా మారింది. 

పాత వాటికే రిపేర్లు.. ప్రమాదాల బారిన కార్మికులు

కాలం చెల్లిన మెషీన్లను పక్కన పెట్టి కొత్తవి కొనడంలో సింగరేణి యాజమాన్యం జాప్యం చేస్తోంది. సింగరేణిలో సుమారు ఐదేళ్లకు పైబడిన వాహనాలను వాడుతున్నారు. వీటికే తరచూ రిపేర్లు చేస్తూ నడుపుతున్నారు. స్పేర్స్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ సమకూర్చడంలో కూడా జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా హైడ్లర్‌‌‌‌ వీల్స్‌‌‌‌, రోలర్లు, ట్రాక్‌‌‌‌ చైన్స్‌‌‌‌ కొరత తీవ్రంగా ఉంది. రికాల్‌‌‌‌ స్ర్పింగ్స్‌‌‌‌ సప్లై కూడా సరిగా ఉండడం లేదు.

హోస్‌‌‌‌ పైప్స్‌‌‌‌ సైతం తరచూ పగిలిపోతున్నాయి. కాలం చెల్లిన డంపర్లను నడపడం వల్ల రన్నింగ్‌‌‌‌లో టైర్లు ఊడిపోయే ప్రమాదం ఉందని, బ్రేక్‌‌‌‌లు సరిగా పడవని, కాలుతున్న బొగ్గును ఎత్తే క్రమంలో అనుకోకుండా ఫైర్‌‌‌‌ సంభవించినప్పుడు వాటిని కట్టడి చేసే సెన్సార్లు కూడా పనిచేయడం లేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు తరచూ బ్రేక్‌‌‌‌డౌన్‌‌‌‌ అవుతుండడంతో రిపేర్‌‌‌‌ చేయడానికి రోజంతా పడుతోంది.

ఎస్‌‌‌‌డీఎల్‌‌‌‌ యంత్రాల్లో వాడే హైడ్రాలిక్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ సైతం నాసిరకం వాడుతున్నారని ఆపరేటర్లు చెబుతున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని పలుమార్లు కార్మిక సంఘాలు నిరసన తెలిపినా ఫలితం లేకుండా పోతోంది. ఇలాంటి వాహనాల వల్ల బొగ్గు ఉత్పత్తి సైతం తగ్గి నష్టం వాటిల్లుతోంది. 

ఆపరేటర్లకు అనారోగ్య సమస్యలు

కాలం చెల్లిన వాహనాల నడుపుతుండడంతో ఆపరేటర్లకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పనిస్థలాలకు, బొగ్గు లోడింగ్‌‌‌‌ టబ్బులకు దూరం ఎక్కువగా ఉండటంతో ఆపరేటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. యంత్రాలను కిందికి, పైకి నడిపేటప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా సేపు కూర్చొనే పనిచేయాల్సి ఉండడంతో నడుం నొప్పులు, మెడ నరాలు, చేతులు లాగడం వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

ఎస్‌‌‌‌డీఎల్‌‌‌‌ మెషీన్లను ప్రైవేట్‌‌‌‌కు అప్పగించేందుకే యాజమాన్యం కుట్రపూరితంగా ఆలస్యం చేస్తుందని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గనుల్లో రూఫ్‌‌‌‌ బోల్టింగ్‌‌‌‌ పనులను ఇప్పటికే ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులకు అప్పగించింది. బెల్లంపల్లి రీజియన్‌‌‌‌లోని కొన్ని గనుల్లో మూడు నుంచి నాలుగేళ్లుగా ప్రైవేట్‌‌‌‌ ఎస్డీఎల్‌‌‌‌ యంత్రాల ఏర్పాటు కోసం యాజమాన్యం ఎదురుచూస్తోంది. 

జీడీకే 11 గనిలో ప్రమాదం, ఎల్‌‌‌‌హెచ్‌‌‌‌డీ ఆపరేటర్‌‌‌‌ మృతి

సింగరేణి రామగుండం రీజియన్‌‌‌‌ పరిధిలోని జీడీకే 11 బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో రామగిరి మండలం పన్నూర్‌‌‌‌ గ్రామానికి చెందిన ఇజ్జగిరి ప్రతాప్‌‌‌‌ (58) అనే ఎల్‌‌‌‌హెచ్‌‌‌‌డీ ఆపరేటర్‌‌‌‌ చనిపోయాడు. గనిలో 40వ లెవల్‌‌‌‌లో కార్మికులు పైనుంచి పని స్థలాలకు చేరుకునేందుకు చైర్‌‌‌‌ కార్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు 4వ సీమ్‌‌‌‌ (పొర) నుంచి 3వ సీమ్‌‌‌‌ వరకు టన్నెల్‌‌‌‌ పనులు చేస్తున్నారు.

సెకండ్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌లో బండను బ్లాస్టింగ్‌‌‌‌ చేయగా దానిని తొలగించే పనిని ఎల్‌‌‌‌హెచ్‌‌‌‌డీ మెషీన్‌‌‌‌తో ప్రతాప్‌‌‌‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో కింద ఉన్న పని స్థలం నుంచి పైకి కొద్ది దూరం రాగానే మెషీన్‌‌‌‌కు ఎయిర్‌‌‌‌డక్స్‌‌‌‌ అడ్డు వచ్చాయి. వాటిని కార్మికులు తొలగిస్తుండగా ప్రతాప్‌‌‌‌ మెషీన్‌‌‌‌ను నిలిపివేశాడు. ఈ టైంలో మెషీన్‌‌‌‌ ఒక్కసారిగా కింది వైపు దూసుకెళ్లడంతో ప్రతాప్‌‌‌‌ కిందపడ్డాడు. అతడి నడుము పైనుంచి మెషీన్‌‌‌‌ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించిన తోటి కార్మికులు ప్రతాప్‌‌‌‌ను గని ఉపరితలానికి, అక్కడి నుంచి గోదావరిఖనిలోని ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పాత వాహనాల వాడకం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు బి.జనక్‌‌‌‌ప్రసాద్‌‌‌‌, ఎస్.నర్సింహారెడ్డి, సదానందం, ఆరెల్లి పోచం, రంగు శ్రీనివాస్​, మిర్యాల రాజిరెడ్డి, ఎం.రామ్మూర్తి, నూనె కొమురయ్య, రియాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు.

సింగరేణి సీఎండీ ఎన్‌‌‌‌.బలరాం నాయక్‌‌‌‌ ఆర్జీ 1, 2 జీఎంలు చింతల శ్రీనివాస్‌‌‌‌, ఎల్‌‌‌‌వీ.సూర్యనారాయణతో కలిసి సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌కు చేరుకొని ప్రతాప్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీ వద్ద నివాళి అర్పించారు. ఘటనపై విచారణ జరిపిస్తామని, ప్రతాఫ్‌‌‌‌ ఫ్యామిలీలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు, 15 రోజుల్లోగా అన్ని రకాల బెనిఫిట్స్‌‌‌‌ అందేలా చూస్తామని సీఎండీ చెప్పారు.

కాలం చెల్లిన ఎల్‌‌‌‌హెచ్‌‌‌‌డీతోనే ప్రమాదం 

సింగరేణిలో కాలం చెల్లిన యంత్రాలను వాడడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోదావరిఖని 11 ఇంక్లైన్‌‌‌‌లో ప్రమాదం జరిగి కార్మికుడు ప్రతాప్‌‌‌‌ చనిపోవడానికి ఎల్‌‌‌‌హెచ్‌‌‌‌డీ వెహికల్‌‌‌‌ బ్రేకులు పడకపోవడమే కారణం. పని స్థలాల్లో సీనియారిటీ ఉన్న వారిని నియమించకపోవడం, ఆఫీసర్లు సూపర్‌‌‌‌వైజింగ్‌‌‌‌ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరు. యంత్రాలకు అవసరమైన స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ను సైతం సింగరేణి కొనుగోలు చేయడం లేదు.

 ఆరెల్లి పోశం, ఏఐటీయూసీ బ్రాంచ్‌‌‌‌ సెక్రటరీ