ఆదిలాబాద్ బోథ్‌లో పెద్దపులి కలకలం

ఆదిలాబాద్ బోథ్‌లో పెద్దపులి కలకలం

బోథ్, వెలుగు : ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా బోథ్‌‌‌‌ మండలంలో పెద్దపులి తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బాబెర గ్రామానికి చెందిన రైతు జాదవ్‌‌‌‌ దిలీప్‌‌‌‌ నేరేడుపల్లె గ్రామ సమీపంలో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఎద్దును తన పొలంలో కట్టేసి, పంటకు మందు స్ర్పే చేస్తున్నాడు. ఈ టైంలో పెద్దపులి అక్కడకు వచ్చి ఎద్దుపై దాడి చేసి చంపింది. 

గమనించిన రైతు జాదవ్‌‌‌‌ దిలీప్‌‌‌‌ కేకలు వేయడంతో చుట్టు పక్కల రైతులు అక్కడకు వచ్చారు. అప్పటికే పులి రేండ్లపల్లె గ్రామంలోకి వెళ్లింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు గ్రామంలోని పలు చోట్ల మంటలు వేసి, గుంపులు గుంపులుగా తిరిగారు. మరో వైపు చింతగూడ గ్రామ సమీపంలోని పొలంలో సైతం పెద్దపులి అడుగులను అటవీశాఖ ఆఫీసర్లు గుర్తించారు. వజ్జర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోందని, పశువుల మేత కోసం అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లొద్దని ఆఫీసర్లు హెచ్చరించారు.