సంగారెడ్డి/కంగ్టి, వెలుగు: జిల్లాలోని కంగ్టి మండలం తడ్కల్ గ్రామ జనావాసాల మధ్య ఓ రైస్ మిల్లు అక్రమంగా కొనసాగుతోంది. గ్రామానికి కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన రైస్ మిల్లు ఊరికి ఆనుకొని ఉండడం అనేక అనర్ధాలకు దారితీస్తోంది. ధాన్యపు పొట్టు బయటకు రాకుండా ఏర్పాట్లు చేయకుండా చుట్టుపక్కల ఇళ్లపైకి వదలడం, మిల్లు నుంచి రోజువారీగా విడుదలయ్యే రసాయనాలు, వాయు కాలుష్యం వల్ల ప్రజలు శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నారు. తాగునీటిలో సన్నటి ధాన్యపు పొట్టు కలవడంతో ఆ నీటిని తాగుతున్న గ్రామస్తులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఓ బీఆర్ఎస్ నేత అక్రమంగా నడిపిస్తున్న ఈ మిల్లుపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధం
రైస్‌మిల్లు ఏర్పాటుకు ఐదెకరాల భూమితోపాటు పారా బాయిల్డ్ మిల్లు ఉండాలి. ఊక నిల్వ చేసేందుకు షెడ్డు, ప్రహరీ, మిల్లు చుట్టూ గ్రీనరీ డెవలప్ మెంట్ కోసం చెట్లను పెంచాలి. కానీ ఇక్కడ అవేవీ కనిపించవు. పైగా మిల్లు నుంచి వచ్చే వ్యర్ధ జలాలను ఇష్టం వచ్చినట్టు బయటికి వదలడంతో పక్కనే ఉన్న ఎస్సీ కాలనీలో చాలామంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మిల్లు యాజమాన్యం పట్టించుకోకుండా యధావిధిగా నడిపిస్తుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్నాటక నుంచి కంగ్టి మీదుగా కామారెడ్డి జిల్లా పిట్లంకు వెళ్లేందుకు ప్రధాన దారి పక్కనే మిల్లు ఉండడంతో వాహనదారుల కళ్లల్లో ధుమ్ము ధూళి పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి రైస్ మిల్లును గ్రామానికి దూరంలో ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకోవాల్సిందే
ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న రైస్ మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందే. ఇంతకాలం నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న మిల్లును వెంటనే మరో చోటికి తరలించాలి. తాగునీటిని సైతం కలుషితం చేస్తున్న మిల్లును ఇక్కడి నుంచి తరలించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. - – సాయిలు రెడ్డి, బాధితుడు
హెల్త్ క్యాంప్ పెట్టాలి
గ్రామంలో కనీసం నెలకు ఒకసారైనా హెల్త్ క్యాంప్ పెట్టాలి. ఎక్కువమంది శ్వాసకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా మిల్లు నడవడం వల్ల గ్రామంలో వ్యాధులు ప్రబలుతున్నాయి. రైస్ మిల్లులను మరోచోటకు తరలించి తమ ఆరోగ్యాలను కాపాడాలి. -– మహేశ్, తడ్కల్