తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక.. హామీగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మొదటగా రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చింది. మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామని తెలిపింది. అందులో భాగంగా 500 రూపాయలకే సబ్సిడీకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పేర్కొంది. 500 రూపాయలకే సబ్సిడీ రావాలంటే కేవైసీ తప్పనిసరి అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో వినియోగదారులు కేవైసీ చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. ఏజెన్సీ నిర్వహకులు మాత్రం తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని.. కేవైసీ కోసం చివరి తేదీ అంటూ ఏమీ లేదని చెబుతున్నారు. కానీ జనం మాత్రం కేవైసీ కోసం రోజువారీ పనులు ఆపేసుకొని మరీ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.
సూర్యాపేట జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు. గ్యాస్ వినియోగదారులు కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడికాపులు కాస్తున్నారు. కేవైసి వేలి ముద్రలు తప్పనిసరి కావడంతో మూడు రోజులుగా లబ్ధిదారులు క్యూ లైన్ లో వేచి ఉండటంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.