- బర్త్, డెత్ సర్టిఫికెట్లు సమయానికి అందట్లే
హైదరాబాద్, వెలుగు: బర్త్, డెత్సర్టిఫికెట్లకు సమయానికి బల్దియా అధికారుల నుంచి అప్రూవల్ రావట్లేదు. దీంతో ప్రజలు మీ సేవ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. టెక్నాలజీతో సేవలను ఈజీ చేస్తున్నామంటూ బల్దియా అధికారులు చెబుతుండగా, జారీలో మాత్రం లేట్చేస్తున్నారు. దరఖాస్తుదారులు సెంటర్లకు వెళ్లి త్వరగా ఎందుకు రావట్లేదని అడిగితే సంబంధిత విభాగ అధికారులు అప్రూవల్ఇవ్వట్లేదని సమాధానమిస్తున్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ, రవాణా తదితర డిపార్టుమెంట్ల సర్టిఫికెట్ల జారీని మీ సేవ సెంటర్లు నిర్వహిస్తుండగా, కొద్దినెలల కిందట బర్త్, డెత్సర్టిఫికెట్ల సేవలను కూడా అప్పగించారు. మరికొద్ది రోజుల్లోనే మ్యుటేషన్ల సేవలను కూడా ట్రాన్స్ఫర్ చేసేందుకు బల్దియా సిద్ధమైంది. అయితే మీసేవ కు అప్పగించడం వరకే చేస్తూ, అనంతరం త్వరగా వచ్చేలా అధికారులు దృష్టి పెట్టట్లేదు. సర్టిఫికెట్లు టైమ్‌కు ఇస్తున్నరా ? లేదా? అనేది ఫాలోఅప్ చేయడం లేదు. దీంతో జనానికి అందే సేవలు మరింత ఆలస్యమవు తున్నాయి. క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే కొత్త సర్వీసులను మీ సేవకు ఇవ్వాలని జనం కోరుతున్నారు.
నిర్వాహకులను అడిగితే..
అప్లై చేసిన తర్వాత గడువు పూర్తయ్యాక మీ సేవకు వెళ్లి అడిగినా సర్టిఫికెట్లు రావట్లేదు. దరఖాస్తుదారులు అడిగితే నిర్వాహకులు తెలియదని సమాధానం ఇస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులను అడిగినా స్పష్టత ఇవ్వడం లేదు. అప్లికేషన్లు పేరుకుపోయాయని, టైమ్ వచ్చినప్పుడు పూర్తవుతాయని అంటున్నారు. ప్రజలకు త్వరగా సేవలు అందించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల్లోగా ఇవ్వాల్సిన బర్త్, డెత్ సర్టిఫికెట్20 రోజులైనా రావట్లేదు.
3 జిల్లాల్లో వెయ్యికి పైగా సెంటర్లు
హైదరాబాద్ జిల్లాలో 436, రంగారెడ్డిలో 297, మేడ్చల్ జిల్లాలో 290 మీ సేవ సెంటర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రభుత్వ మీ సేవలు కూడా కొనసాగుతున్నాయి. చాలా సెంటర్ల వద్ద జనంతో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. సర్టిఫికెట్లు సమయానికి అందకపోతుండగా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాంటున్నారు. సకాలంలోనే ఫైళ్లు పంపినా కూడా ఉన్నతాధికారుల నుంచి అప్రూవల్ రావడం లేదని కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.
వారంలోపు వస్తదని చెప్పగా..
నాకు పాప పుట్టింది. బర్త్ సర్టిఫికెట్‌కు అప్లయ్ చేసిన. వారంలోపు వస్తదని అన్నరు. కానీ 20 రోజులకు వచ్చింది.
మీ సేవ సెంటర్‌కు పోయి అడిగితే తమకు తెలియదని, బల్దియా అధికారులు అప్రూవల్ ఇస్తే వస్తుందని సమాధానం ఇచ్చారు.
- గంగారం, మెహిదీపట్నం
ఉన్నతాధికారులకు చెబుతున్నం
సర్టిఫికెట్లు ఆలస్యం అయితే వెంటనే ఉన్నతాధికారులకు చెబుతున్నం. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు కూడా పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తున్నారు. మీ సేవ సెంటర్లలో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లకు అధికారులు అప్రూవల్ ఇస్తేనే ఇక్కడ సర్టిఫికెట్లు వస్తాయి. ప్రజలకు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాం.
- వరలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్(టెక్నికల్), మీ సేవ