మహబూబాబాద్, వెలుగు: రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. గత ఐదేండ్లుగా సర్కారు స్పందించకపోవడంతో.. పేదలకు పథకాలు దూరమవుతున్నాయి. రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు చేసుకుందామని వెళ్తున్న తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. ఉన్నతాధికారుల వరకూ వెళ్లినా.. సర్కారు నిర్ణయం తీసుకోనిదే తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.
పథకాలకు దూరం..
రేషన్ కార్డులు లేకపోవడంతో వల్ల ప్రజలు వివిధ పథకాలకు, సబ్సిడీలకు దూరం అవుతున్నారు. ఈ కార్డు ద్వారా అందించే రూపాయికి కిలోబియ్యం, చక్కెర అందుకోలేకపోతున్నారు. గతంలో కుటుంబం మొత్తానికి రేషన్ కార్డు ఒక లీగల్ డాక్యుమెంట్ గా పనిచేసిది. గ్యాస్ సబ్సిడీకి కూడా ఇదే వాడేవారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఇది ఎంతో ఉపయోగపడేది. డ్రైవింగ్ లైసెన్స్, స్కాలర్ షిప్లు, నివాస సర్టిఫికేట్ల జారీకి ఈ కార్డు అవసరం పడుతుంది. రేషన్ కార్డు లేక అన్ని రకాల సేవలకు ప్రజలు దూరం అవుతున్నారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 25,800 మంది వివరాల నమోదు కోసం ఎదురుచూస్తున్నారు.
ఖర్చుల భారం..
రేషన్ కార్డు లేక ప్రజలకు ఖర్చులు భారం అవుతోంది. బియ్యం, ఇతర సరుకులు బయటనే కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆరోగ్య సేవలు, విద్యాపరమైన సర్వీసులకు దూరం అవుతున్నారు. కొన్ని శాఖలు రేషన్ కార్డు ఉంటేనే పథకాలు మంజూరు చేస్తున్నాయి. కొత్త కార్డుల కోసం మీసేవా కేంద్రాల చుట్టూ బాధితులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. చనిపోతే వెంటనే రేషన్ కార్డు తీసేసే ప్రభుత్వం.. పిల్లలు పుడితే మాత్రం రేషన్ కార్డులో పేరు నమోదుకు నమోదుకు అవకాశం ఇవ్వడం లేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇకనైనా సర్కారు దృష్టి సారించి, వివరాల నమోదుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఇబ్బంది అవుతోంది...
మాకు ఇద్దరు పిల్లలు ఉన్నరు. పుట్టిన కొద్దిరోజులకే రేషన్ కార్డులో పేర్ల నమోదు కోసం మీసేవకు వెళ్లినం. గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రాలేదని చెప్పారు. దీంతో రేషన్ సరుకులు వస్తలేవు. సివిల్ సప్లై, తహసీల్దార్లను అడిగినా లాభం లేదు. - రాళ్లబండి ప్రవీణ్, కొత్తపల్లి గ్రామం, కొత్తగూడ మండలం
ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ అందలేదు
రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. రాగానే పేర్లను చేర్చడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో మృతి చెందిన వారి సమాచారం ఆధారంగా 9241 రేషన్ కార్డులను తొలగించాం. - నర్సింగ్ రావు, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్, మహబూబాబాద్