‘డిజి’టల్ సేవల్లో తెలంగాణ పూర్ !

డిజీలాకర్​లో అందుబాటులో లేని సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు 

కరీంనగర్, వెలుగు : ఐటీ రంగానికి రాజధానిగా ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్న తెలంగాణలో ప్రజలకు డిజిటల్ సేవలు అందడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డిజిటల్ సేవల్లో మన రాష్ట్రం అట్టడుగున ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు జారీ చేసిన కార్డులను ఒక్క క్లిక్ తో పొందే అవకాశమున్నప్పటికీ..ఆ సౌకర్యాన్ని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజీలాకర్ అనే  పోర్టల్ లో మన రాష్ట్రానికి సంబంధించిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు లభ్యం కాకపోవడం రాష్ట్ర ఐటీ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజీలాకర్​కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 కోట్ల 30 లక్షల యూజర్లు ఉన్నారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన వారు లక్షల్లోనే ఉన్నారు. ముందుగా డిజీలాకర్ లో ఆధార్ నంబర్ వివరాలతో రిజిస్టర్ అయ్యాక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, పాన్ కార్డులు, కోవిడ్ వ్యాక్సిన్, యూఏఎన్ సర్టిఫికెట్లు మాత్రమే డౌన్ లోడ్ అవుతున్నాయి. ఒరిజినల్స్ తో సమానంగా గుర్తించే ఈ డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్‌‌తో రాష్ట్రానికి చెందిన ట్రాన్స్ పోర్ట్ డిపార్టెమెంట్ సర్టిఫికెట్లు, ఓటర్ ఐడీ, వివిధ యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ బోర్డులు అందించే టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇతర సర్టిఫికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు వ్యయ, ప్రయాసలు తప్పడం లేదు. 

డిజీలాకర్​లో 635 సర్వీసులు  

డిజీలాకర్​లో ఆధార్, పాన్, కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, సీబీఎస్ఈ క్లాస్ 12 మార్క్ షీట్, వివిధ రాష్ట్రాల సెకండరీ బోర్డులు ఇచ్చే టెన్త్ క్లాస్ మార్క్ షీట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్​(ఆర్సీ), రేషన్ కార్డు, వెహికిల్ ట్యాక్స్ రిసిప్ట్, పీఎఫ్ అకౌంట్ కు సంబంధించిన యూఏఎన్ కార్డు, ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్, ఎల్​పీజీ సబ్‌‌స్క్రిప్షన్ వోచర్, క్యాస్ట్, ఇన్ కం, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, రెసిడెన్సీ, హెల్త్ కార్డ్/ సర్టిఫికెట్, మెగ్రేషన్ సర్టిఫికెట్, భూమి హక్కుల రికార్డులు, పెన్షన్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌‌ సర్టిఫైడ్ కాపీలు, ఓబీపీ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్లతో వివిధ యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ కు సంబంధించి మొత్తం 635 రకాల ఒరిజనల్ తో సమానమైన సర్టిఫికెట్లు అందించే సర్వీసులు డిజీలాకర్​లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 131.77 కోట్ల మంది ఆధార్ కార్డులు, 43.02 కోట్ల మంది యూఏఎన్ కార్డులు, 38.17 కోట్ల మంది పాలసీ డాక్యుమెంట్లు, 36.54 కోట్ల మంది పాన్ వెరివిఫికేషన్ రికార్డులు, 26.02 కోట్ల కుటుంబాల రేషన్ కార్డులు, 21.42 కోట్ల వెహికిల్ ఆర్సీలు, 19.62 కోట్ల వెహికిల్స్ కు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, 18.13 కోట్ల మంది విద్యార్థుల టెన్త్ క్లాస్ మార్క్ షీట్స్, 10.13 కోట్ల మంది డ్రైవింగ్ లైసెన్సులు, 9.47 కోట్ల మంది క్యాస్ట్ సర్టిఫికెట్లు, 9.18 కోట్ల మంది బర్త్ సర్టిఫికెట్లు,10.97 కోట్ల మంది ఇన్ కం సర్టిఫికెట్లు, 1.57 కోట్ల ల్యాండ్ పాస్ బుక్స్ డిజీలాకర్​లో ఉన్నాయి.  

నల్గొండ ఎంజీ యూనివర్సిటీ డిగ్రీ మార్కుల షీట్స్​ మాత్రమే.. 

డిజీలాకర్​సర్వీసుల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా వెనకబడింది. మహారాష్ట్ర అత్యధికంగా 192 రకాల సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అందిస్తుండగా, కర్ణాటక 181, ఢిల్లీ 150, గుజరాత్ 109, ఉత్తర ప్రదేశ్ 121, హర్యానా 88, ఒడిశా 84, తమిళనాడు, కేరళ 82 చొప్పున, మధ్య ప్రదేశ్ 74, ఏపీ, రాజస్థాన్ 72 చొప్పున, పంజాబ్ 70, వెస్ట్ బెంగాల్ 68, జమ్మూ అండ్ కశ్మీర్ 65 రకాల సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు డిజీలాకర్​లో అందుబాటులో ఉంచాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 35 రకాల సర్వీసులు డిజీలాకర్​లో చూపిస్తున్నప్పటికీ 14 సర్వీసులు ఐఐటీ హైదరాబాద్, ఇఫ్లూ, వరంగల్ నిట్, ఊర్దూ యూనివర్సిటీ, నైపర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తదితర 14 విద్యాసంస్థలవే ఉన్నాయి. స్టేట్ యూనివర్సిటీల్లో కేవలం నల్లగొండ ఎంజీ వర్సిటీ డిగ్రీ మార్కుల షీట్స్ మాత్రమే డౌన్ లోడ్ అవుతున్నాయి.

అన్ని మీ సేవ ద్వారానే.. 

డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ ఆర్సీ, ఫిట్ నెస్ సర్టిఫికెట్ తదితర ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన సర్టిఫికెట్లేవి డిజీలాకర్​లో డౌన్ లోడ్ కావడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేస్తే ‘నో డ్రైవింగ్ లైసెన్స్ ఫౌండ్’ అని చూపిస్తోంది. మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న అగ్రికల్చర్ ఇన్ కం, క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్లు, కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఈబీసీ, ఫ్యామిలీ మెంబర్స్, ఆలస్యంగా రికార్డు చేసిన బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు, నేటివిటీ సర్టిఫికెట్, నేమ్ చేంజ్ సర్టిఫికెట్, రెసిడెన్సీ డిజిటల్ సర్టిఫికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని డిజీలాకర్​లో ఆప్షన్ చూపిస్తున్నప్పటికీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డులా డౌన్ లోడ్ కావడం లేదు. దీంతో డిజీలాకర్​లో రిజిస్టర్ అయిన యూజర్లకు నిరాశే ఎదురవుతోంది. ఇలాంటి ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలంటే మళ్లీ మీ సేవకే వెళ్లాల్సి వస్తోంది.