- ప్రజలు కేసీఆర్ కుటుంబానికి బానిసలు కాదు
- మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణ
మునుగోడు, వెలుగు: ‘మునుగోడు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు , మంత్రులు, కేసీఆర్కుటుంబ సభ్యులు సూట్ కేసుల నిండా డబ్బు, లారీల నిండా లిక్కర్, ట్రక్కుల నిండా చికెన్ బిర్యానీ పొట్లాలతో వస్తున్నారు.. సీఎం కేసీఆర్ డబ్బుతో ఓటర్లను కొనాలని చూస్తున్నారు.. కానీ మునుగోడు ఓటర్లు వీటికి లొంగరు.. తెలంగాణ ప్రజలు ఏ కుటుంబానికీ బానిసలు కారు’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మంగళవారం మునుగోడు మండలం చీకటి మామిడి, రావిగూడెం గ్రామల్లో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, ధర్మం కోసం బీజేపీ పోరాడుతోందని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లిక్కర్‌తో యువతని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 4 నెలల్లో పది ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న కేసీఆర్ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించలేక పోయారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వసూళ్లు చేయడంలో దిట్ట అని, తాను వార్డెన్‌గా పనిచేసినప్పుడు పిల్లల బియ్యాన్ని, షాంపూలు, కొబ్బరి నూనె అమ్ముకొని సస్పెండ్ అయ్యాడని ఆరోపించారు.
కోమటిరెడ్డి సాయం చేయడంలో మంచి మనసున్న నేత అని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, బీజేపీ రాష్ట్ర నాయకులు మారగోని రవి కుమార్ యాదవ్, గోలి మధుసూదన్ రెడ్డి, చీకటిమామిడి సర్పంచ్ తాటికొండ సంతోష సైదులు యాదవ్, యాదయ్య తదితరులు ఉన్నారు.