- సోషల్మీడియాలో పోస్ట్ వైరల్
- కావడంతో పెరిగిన రద్దీ చెక్ చేయాలని పంపిణీ
- ఆపేయించిన వైద్యాధికారులు అయినా తరలివస్తున్న ప్రజలు
వనపర్తి/కొత్తకోట, వెలుగు : వనపర్తి జిల్లా కొత్తకోటలో మోకాళ్ల నొప్పి తగ్గించే మందు బాగా పని చేస్తుందని ప్రచారం జరగడంతో జనం ఎగబడ్డారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో వారు వచ్చి మందుల పంపిణీ ఆపేయించారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మూడు రోజుల కింద కొత్తకోట బస్టాండ్సమీపంలో ఉండే నాటు వైద్యుడు రాములు ఇస్తున్న ఆయుర్వేద మందు బాగా పని చేస్తోందని, తనకు తగ్గిందని సోషల్మీడియాలో పోస్ట్పెట్టాడు. ఇది వైరల్కావడంతో ఒక్కసారిగా జనం తాకిడి పెరిగింది.
దీంతో రెండు రోజుల నుంచి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుండడంతో కొత్తకోట బస్టాండ్ఏరియా కిక్కిరిసిపోతోంది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం రాములు దగ్గరకు వెళ్లి మాట్లాడారు. తాను వనమూలికల నుంచి తీసిన మందులనే ఇస్తున్నానని చెప్పగా, ఆ మందు వల్ల దుష్ప్రభావాలు లేవని తేలేదాక మందుల పంపిణీ ఆపెయ్యాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు మందుల పంపిణీ నిలిపివేస్తున్నట్టు బోర్డు పెట్టారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాసులు మాట్లాడుతూ రాములు తయారు చేస్తున్న మందును ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులకు పంపి చెక్ చేయిస్తామని, వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
పంపిణీ నిలిపివేశారని తెలియని జనాలు తరలివస్తూనే ఉండడంతో మంగళవారం కూడా కొత్తకోట రద్దీగా మారింది. ట్రాఫిక్ పోలీసులు రాములు దగ్గరకు వెళ్లి పోస్ట్ పెట్టిన వ్యక్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నంబర్ అడగ్గా తనకు తెలియదని సమాధానమిచ్చాడు. మందుల పంపిణీ ఆపేసినా రూ.1500కు ఒక టోకెన్చొప్పున మంగళవారం ఒక్కరోజే 500కు పైగా టోకెన్లు ఇచ్చినట్టు సమాచారం.