మునుగోడులో బోగస్ ఓట్లను ప్రోత్సహిస్తున్న లోకల్​ లీడర్లు

నల్గొండ, వెలుగు: త్వరలో ఉపఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. రాష్ట్రమంతా ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ఒక్క మునుగోడులోనే అనూహ్య స్పందన వస్తోంది. స్థానికంగా అర్హత కలిగిన యువతతోపాటు, ఇక్కడి నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు కూడా తిరిగి మునుగోడులో ఓటరుగా నమోదు చేయించుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్న లీడర్లు.. తమ పార్టీకి మద్దతు ఇచ్చేవారి కుటుంబ సభ్యులు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసుకొని ఫోన్లు చేసి మరీ ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. బై ఎలక్షన్ కావడంతో పోలింగ్‌‌కు ముందు పార్టీ తరఫున భారీగా నజరానాలు ముట్టజెబుతామని, ఒక్కో ఓటుకు రూ.10 వేల చొప్పున ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఆశ పెడ్తున్నారు. ఫలితంగా బోగస్ ఓట్లు పెరుగుతుండగా, వాటి ఏరివేత అధికారులకు తలనొప్పిగా మారుతోంది.

ఇంకో చోట ఓటు హక్కు ఉన్నా..

ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఈ ఏడాది జనవరి ఫస్ట్​ నాటికి మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల 26 వేల 471 మంది ఓటర్లు ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏండ్లు పూర్తయ్యే ప్రతి ఒక్కరూ ఓటు పొందేందుకు వీలుగా ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల డ్రాఫ్ట్ లిస్టును నవంబర్ 9న రిలీజ్​చేస్తారు. జనవరి 5న ఫైనల్ ఓటరు లిస్ట్ ప్రకటిస్తారు. 

కానీ రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో ఓటరు నమోదు ప్రక్రియ జరగడం లేదు. కానీ మునుగోడులో మాత్రం బైపోల్ ఖాయమని తేలింది మొదలు స్థానికంగా అర్హులైన యువతీయువకులు, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా ఆన్​లైన్‌‌‌‌లో ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆరు మండలాల్లో కలిపి మొత్తం 16,975 ఆప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్‌‌‌‌కు దగ్గర్లో ఉండే చౌటుప్పల్, నారాయణ్‌‌‌‌పూర్, మునుగోడు మండలాల్లోనే కుప్పలు తెప్పలుగా కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి. హైదరాబాద్, ముంబై, ఇతర దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లతోపాటు, జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో స్థిరపడ్డ స్థానికులు కూడా అప్లై చేసుకుంటున్నారు. వీళ్లలో చాలా మందికి ఆయాచోట్ల ఇప్పటికే ఓటు హక్కు ఉన్నప్పటికీ, స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇక్కడ కూడా నమోదు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఓటుకు రూ.10 వేలు ఇస్తారనే ప్రచారం

మునుగోడులో ఉప ఎన్నికల జోష్ మొదలైనప్పటి నుంచి ప్రధాన రాజకీయ పార్టీలు ఓటరు నమోదుపై ఫోకస్ పెట్టాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన టీమ్స్ గ్రామాల్లో గడపగడపకూ తిరుగుతున్నాయి. నేతలు పాత లిస్టులను ముందేసుకొని అందులో తమ పార్టీలకు మద్దతు ఇచ్చేవారి ఫ్యామిలీల్లో మిస్​అయిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికీ ఫోన్​చేసి మరీ ఆరా తీస్తున్నారు. ఉప ఎన్నిక కాబట్టి ఒక్కో పార్టీ ఓటుకు రూ.10 వేల దాకా ఇస్తుందని, ఇంకా భారీ తాయిలాలు అందుతాయని ఆశ చూపిస్తూ కొత్త, వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు.

అధికారులకు బోగస్ బెడద

మునుగోడులో నమోదవుతున్న కొత్త ఓటర్లలో బోగస్​ఓట్ల బెడద అధికారుల మెడకు చుట్టుకుంటోంది. కొత్త అప్లికేషన్లలో డబుల్ ఓటర్లను కనిపెట్టడం కష్టంగా మారిందని ఆఫీసర్లు చెప్తున్నారు. వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన ఒకటి, రెండు రోజులకే తమపై ఒత్తిళ్లు మొదలయ్యాయని, దాంతో ముందుకు పోలేకపోతున్నామని రెవెన్యూ ఆఫీసర్లు వాపోతున్నారు. అప్లికేషన్‌‌‌‌లో  ఇచ్చిన అడ్రస్‌‌‌‌లో ఓటర్లు నివసించడం లేదని, రూల్ ప్రకారం అలాంటి అప్లికేషన్లు రిజక్ట్ చేయాలని, కానీ అధికార పార్టీ లీడర్ల ఒత్తిడితో ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. ఆధార్ లింక్‌‌‌‌తో డబుల్ ఓటర్లను తొలగించే ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. దీంతో వేరే ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు మళ్లీ మునుగోడులో అప్లై చేసుకుంటున్నా తామేమీ చేయలేపోతున్నామని ఆఫీసర్లు వాపోతున్నారు.