విలీన గ్రామాల్లో తాగునీటి తిప్పలు

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: నగరంలోని చుట్టుపక్కల గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసి పన్నుల ద్వారా రాబడిని పెంచుకుంటున్న అధికారులు ఆయా గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. రూ.కోట్లు కేటాయించి, అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లి, అలుగునూర్, పద్మానగర్ గ్రామాలను నగరపాలక సంస్థలో కలుపుతూ 2019లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరిలో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో విలీనమైన గ్రామాలను కలుపుకొని గతంలో ఉన్న 50 డివిజన్లను 60 డివిజన్లుగా పెంచి  వాటికి ఎన్నికలు నిర్వహించింది. ఆయా గ్రామాలకు బల్దియాలోని మిగతా డివిజన్లకు అందించే అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆయా గ్రామాలకు కనీసం తాగునీటి వసతి కూడా కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

గ్రామ పంచాయతీ నీళ్లే దిక్కు..

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన పైప్ లైన్ ద్వారా వచ్చే తాగునీటినే విలీన గ్రామాల ప్రజలు వినియోగిస్తున్నారు. రెండు రోజులకోసారి అందించే గ్రామ పంచాయతీ నీటిని నిత్యావసరాలకు వాడుకుంటున్నారు. తాగునీరు కావాలంటే డబ్బులు పెట్టి కొనాలి. లేదంటే కోర్టు ట్యాంక్​ నుంచి క్యాన్లలో తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు 2020 జనవరి నుంచి పన్నులు చెల్లిస్తున్నా, తాగునీటిని అందించడంలో మాత్రం మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైంది. అయితే కార్పొరేటర్లు లేదా వారి కుటుంబ సభ్యులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో మున్సిపాలిటీ అంతా ఇష్టారాజ్యంగా తయారైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో పనులు దక్కించుకొని, వారికి నచ్చినట్లు పనులు చేస్తున్నారు. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కవ్వడంతోనే ఈ పరిస్థితి తయారైందని పలువురు ఆరోపిస్తున్నారు.  

పేరుకే మున్సిపాలిటీ

తాగడానికి నీళ్లు లేవు. కొత్త పైప్ లైన్ లేదు. పేరుకు మాత్రమే మాది మున్సిపాలిటీ. గ్రామ పంచాయతీ నీళ్లే మాకు దిక్కయితున్నయ్. కోర్టు ట్యాంకుకు పోయి సైకిళ్లమీద నీళ్లు తెచ్చుకుంటున్నం. ఎవ్వరిని అడిగినా ఫాయిదా లేదు. 
-అస్తపురం అంజయ్య, రేకుర్తి

టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది

విలీన గ్రామాల డివిజన్లలో రూ.7కోట్లతో కొత్త పైప్ లైన్ వేసి తాగునీరు అందించేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశాం. 40 శాతం పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. పలువురికి నోటీసులు పంపించాం. పనులు చేయకపోతే పది రోజుల్లో వారిని తొలగించి కొత్తవారితో పనులను యుద్ధప్రాతిపదికన  పూర్తి చేయిస్తాం. ఎండాకాలం లోపు విలీన గ్రామాలకు తాగునీరు అందిస్తాం. 
-సునీల్ రావు, మేయర్, కరీంనగర్