
- మూడు నెలలుగా తాగునీటికి ఇక్కట్లు
- తాత్కాలిక ఏర్పాట్లలో యంత్రాంగం
సిద్దిపేట/చేర్యాల, వెలుగు : చేర్యాల పట్టణంలో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నేషనల్హైవే విస్తరణ పనుల్లో భాగంగా మిషన్ భగీరథ పైప్ లైన్ల ను ఇష్టారీతిన కట్చేయడంతో మూడు నెలలుగా సగం పట్టణానికి నీళ్లు అందడం లేదు. ఒకవైపు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే మున్సిపల్ యంత్రాంగం మాత్రం తాత్కాలిక ఏర్పాట్లతో కాలం వెళ్లదీస్తోంది.
జనగామ నుంచి దుద్దెడ వరకు 365 బీ, నేషనల్హైవే విస్తరణలో భాగంగా చేర్యాల పట్టణంలోని మెయిన్ రోడ్డులో దాదాపు 5 కిలో మీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం కోసం తవ్వే సందర్భంలో మిషన్ భగీరథ పైపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాగునీటి పైప్ లైన్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు చేయాల్సి ఉన్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్మికులు ఇష్టారీతిన పైపులైన్లను కట్ చేసేశారు.
డ్రైన్ తవ్వకాలతో సమస్య తీవ్రం
రోడ్డు విస్తరణ లో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న డ్రైన్ తవ్వకాల వల్ల భూగర్భంలో ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్లు దెబ్బతింటున్నాయి. కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సమస్య మరింత తీవ్రగా మారింది. డ్రైన్ల కోసం తవ్వకాలు జరిపి మిషన్ భగీరథ పైప్ లైన్ల ను ఇష్టారీతిగా కట్ చేసి రోడ్ల పై పడేసిన దృశ్యాలు మెయిన్ రోడ్డులో అనేకం కనిపిస్తాయి.
చేర్యాల పట్టణంలో 12 వార్డులుంటే సగానికి పైగా వార్డుల్లో మిషన్ భగీరథ నీరు అందక పోవడంతో ప్రజలు స్థానికంగా వాటర్ ప్లాంట్ల నుంచి తాగు నీటిని కొనుగోలు చేస్తున్నారు. దెబ్బతిన్న పైప్ లైన్లను వెంటనే రిపేర్ చేసి నీటి సరఫరా అందించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదు.
పవర్ బోర్ల పై నీటి సరఫరా
చేర్యాల పట్టణంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు ధ్వంసం కావడంతో కేవలం పవర్ బోర్ల ఆధారంగా నీటి సరఫరా జరుగుతోంది. జనావసరాలకు అనుగుణంగా నీటి సరఫరా జరగక పోవడంతో ప్రజలు పొదుపుగా నీటిని వాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని బాలాజీ చౌరస్తా, శ్రీనగర్ కాలనీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, కేసీఆర్ నగర్, ఎంపీడీవో ఆఫీస్, గాయత్రి నగర్, ఎస్సీ కాలనీ, వేస్ట్ గుంటూరు పల్లి కాలనీతో పాటు పలు కాలనీలకు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. పట్టణంలో ఆరు వందల మంది విద్యార్థులు చదివే గురుకుల పాఠశాలకు తగినంత నీటి సరఫరా లేకపోవడంతో ట్యాంకర్ల పై ఆధారపడుతున్నారు.
ట్యాంకర్లతో నీటి సరఫరాకు ఏర్పాట్లు
పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లు అందక పోవడంతో తాత్కాలికంగా ట్యాంకర్లతో వార్డుల్లో నీటిని సరఫరా చేయాలని మున్సిపల్ పాలక వర్గం నిర్ణయించింది. ఇందు కోసం మున్సిపాల్టీ నుంచి రూ. 8 లక్షల నిధులను కేటాయించి ట్యాంకర్ల ను ఏర్పాటు చేయడంతో పాటు బోర్లను రిపేర్ చేయాలని నిర్ణయించారు. సమస్య తీవ్రమవుతున్న తరుణంలో తాత్కాలిక ఏర్పాట్లపైనే పాలక వర్గం దృష్టి సారించడం విమర్శలకు తావిస్తోంది.
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
చేర్యాల పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. ట్యాంకర్లలో నీటిని సరఫరా చేసేందుకు మునిసిపాలిటీ నుంచి రూ. 8 లక్షలు కేటాయించారు.దీంతో పాటు బోర్ల రిపేర్కు కొన్ని నిధులను వినియోగించనున్నాం. రోడ్డు విస్తరణ సందర్భంగా సమన్వయ లోపం కారణంగా మిషన్ భగీరథ పైప్ లైన్లు దెబ్బతినడం వల్ల పట్టణంలో తాగునీ టి సమస్య ఏర్పడింది వాస్తవమే. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.
శ్రీకాంత్, ఏఈ
పైప్ లైన్ల రిపేర్లో నిర్లక్ష్యం
మిషన్ భగీరథ పైప్ లైన్ల రిపేర్విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పైపులు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు రిపేర్ చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడం పట్టణ ప్రజలకు శాపంగా మారింది. సమస్య తీవ్రమవుతుంటే తాత్కాలిక ఏర్పాట్లతో కాలాయాపన చేస్తున్నారు.
చెవిటి లింగం, కౌన్సిలర్ 2 వ వార్డు