కేసీఆర్ ​నగర్​లో ప్రజలకు నీటిగోస

  • డబుల్​ ఇండ్లకు చేరని ‘భగీరథ’
  • కేసీఆర్​నగర్​లో ప్రజలకు నీటిగోస
  • తిప్పలు పడుతున్న జనం 
  • డబుల్ ఇండ్ల నిర్వహణ మాది కాదంటున్న పాలకవర్గాలు 
  • పట్టించుకోని సిరిసిల్ల మున్సిపాలిటీ, మండేపల్లి జీపీ 

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి పంచాయతీ పరిధిలో కేసీఆర్​నగర్​కాలనీ పేరిట 1320 డబుల్​బెడ్రూం ఇండ్లు నిర్మించారు. కేసీఆర్​నగర్ లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల నుంచి వాటర్​ రావడం లేదు. దీంతో ట్యాంకర్లతో రెండు మూడు రోజులకోసారి వచ్చే నీటిని పొదుపు వాడుకుంటున్నారు. పై అంతస్తులకు నీటిని మోసుకెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులకు మొరపెట్టుకోవటంతో మండేపల్లి సర్పంచ్ ట్యాంకర్ల ద్వారా మూడు రోజులకు ఒకసారి నీటిని సప్లై చేస్తున్నారు. ట్యాంకర్లు వచ్చినప్పుడే నీటిని పట్టుకొని, వాటిని మోసుకెళ్లాల్సి వస్తోందని కాలనీ వాసులు వాపోతున్నారు. 

కేసీఆర్ నగర్ ను పట్టించుకోని పాలకులు

కేసీఆర్​నగర్ కాలనీలో 1,320 డబుల్ ఇండ్లలో  60 మండేపల్లి పంచాయతీకి కేటాయించారు. అయితే మండేపల్లిలోని 60 ఇండ్లకు ఏ సమస్యలేదు కానీ మిగతా 1,260 ఇండ్లలో నివస్తున్న ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఇండ్లు సిరిసిల్ల మున్సిపల్​పరిధిలోకి వస్తాయని మండేపల్లి పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఇది మండేపల్లి పాలకవర్గం చూసుకుంటుందని మున్సిపాలిటీ కమిషనర్​చెబుతున్నారు. దీంతో కేసీఆర్ నగర్ లో ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సిరిసిల్ల మున్సిపాలిటీదే బాధ్యత 

కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లోకి మొదట్లో 400 మంది వచ్చారు కాబట్టి అన్ని మేమే చూసుకున్నాం. ఇప్పుడు మంది ఎక్కువయ్యారు కాబట్టి మావల్ల కావడం లేదు. మాది చిన్న పంచాయతీ. మా ఊరును చూసుకోవడంతోనే మాకు సరిపోతుంది. గతంలో  కేసీఆర్ నగర్ కు నీటి సప్లై అంతా  మండేపల్లి జీపీ చూసుకుంది. ఎన్ఆర్​ఈజీఎస్​ పనులకు సంబంధించి మొక్కలకు నీరు పట్టడం గురించి కలెక్టర్ మాకు చెప్పారు. కేసీఆర్ నగర్ బాధ్యత సిరిసిల్ల మున్సిపల్ వాళ్లదే.
- శివజ్యోతి, మండేపల్లి సర్పంచ్ 

డబుల్ ఇండ్ల నిర్వహణ మండేపల్లి జీపీదే..

మండేపల్లి జీపీ పరిధిలోనే డబుల్ ఇండ్లు ఉన్నాయి. కాబట్టి వాటి నిర్వహణను ఆ పంచాయతే చూసుకోవాలి. డబుల్ ఇండ్లు సిరిసిల్ల మున్సిపల్ కు చెందిన వారిని ఎంపిక చేసి ఇచ్చాం. మండేపల్లి జీపీ పరిధిలో ఉన్నప్పుడు వారే చూసుకోవాలి. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లైని  మున్సిపల్ చూసుకుంటోంది. మిగతా నిర్వహణ మండేపల్లి జీపీ చూసుకోవాలి. 

సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ 

మా సమస్యలు మేమే తీర్చుకుంటున్నం..

కేసీఆర్ నగర్ లో ఏమైనా సమస్యలుంటే ఓ కమిటీలాగా ఏర్పడి మేమే పరిష్కరించుకుంటున్నాం. మండేపల్లి పంచాయతీని అడిగితే మావల్ల కాదంటున్నారు. సిరిసిల్ల మున్సిపల్ వారిని అడిగినా అదే సమాధానం. ఏ అపార్ట్​మెంట్​వారే శుభ్రం చేసుకోవాలని చెప్పాం. ఇప్పటికయినా కేసీఆర్​నగర్​నిర్వహణ బాధ్యత ఎవరిదో స్పష్టం చేయాలి. 
 -
 ప్రభాకర్, కేసీఆర్ నగర్ నివాసి

సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు

కేసీఆర్ నగర్ లో నిర్మించిన 1260 ఇండ్లను రెండు విడతలుగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు పంపిణీ చేశారు. కేసీఆర్ నగర్ లో ఉంటున్న వారందరూ సిరిసిల్ల మున్సిపల్ ప్రజలు కావడంతో  ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్​ మున్సిపల్ ఖాతాలో జమవుతున్నాయి. మండేపల్లి  జీపీకి ఒక్క పైసా  ఇవ్వకపోవడంతో కేసీఆర్ నగర్ కు కావాల్సిన వనరులు సమకూర్చడానికి  నిధులు లేక ఆ పాలకవర్గం చేతులెత్తేసింది. కేవలం 60 కుటుంబాలకు చెందిన ఎన్ఆర్​ఈజీఎస్ ఫండ్స్​మండేపల్లి జీపీలో పడుతున్నాయి. దీంతో వారి పరిధి వరకే మండేపల్లి పంచాయతీ నిర్వహణ బాధ్యత చూస్తోంది.  అయతే కేసీఆర్​నగర్ లో  స్ట్రీట్ లైట్స్, వాటర్​సప్లై, శానిటేషన్​బాధ్యత మున్సిపాలిటీ పాలకవర్గమే చూసుకోవాలని గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు.