డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లలో సౌలత్ లు కల్పించలే

డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లలో సౌలత్ లు కల్పించలే

మహబూబ్​నగర్​/భూత్పూర్​, వెలుగు : రాష్ట్ర సర్కారు కట్టించిన డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లలో నివాసం ఉంటున్న వారు సౌలతులు లేక తిప్పలు పడుతున్నారు. తాగేందుకు మంచి నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయకుండానే ఇండ్లను ఓపెన్​ చేయడంతో, అందులో కాపురం ఉంటున్న వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూర్​ మున్సిపాల్టీలోని సిద్ధాయిపల్లి శివారులో సర్వే నంబర్ 208లోని ఐదు ఎకరాల్లో రూ.14 కోట్లతో జీ ప్లస్ టు విధానంలో 288 ఇండ్లను నిర్మించారు. గతేడాది జూన్​4న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ వీటిని ప్రారంభించారు. మొదట మహబూబ్​నగర్​-భూత్పూర్​ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణలో భాగంగా అమిస్తాపూర్​లో ఇండ్లు కోల్పోయిన 42 మంది బాధితులకు లక్కీ డిప్​ ద్వారా తహసీల్దార్​​ఆఫీసులో పట్టాలను, ఇంటి తాళాలను స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి అందజేశారు. మిగిలిన ఇండ్లను గత డిసెంబర్​లో లబ్ధిదారులకు కేటాయించారు. అయితే సౌలత్​లు లేకపోవడంతో పిల్లలు, వృద్ధులతో ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు.

కరెంటు మీటర్లు పెట్టలే..

డబుల్  బెడ్రూమ్​ ఇండ్లకు కరెంట్​ కనెక్షన్లు ఇవ్వలేదు. ఏ ఇంటికి మీటర్లు బిగించలేదు. ప్రస్తుతం ఇక్కడ 20 కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే కరెంట్​ ఉంది. వీరు ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 వరకు బిల్లులు చెల్లిస్తున్నారు. కరెంట్​ మీటర్లు పెట్టాలని గృహ ప్రవేశాలు చేసినప్పటి నుంచి ఆఫీసర్లకు చెబుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిషన్​ భగీరథ కనెక్షన్లు ఇయ్యలే..

నిర్మాణ సమయంలో ప్రతి ఇంటికి మిషన్​ భగీరథ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. సిద్దాయిపల్లి సమీపంలోని డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల వద్ద ఒక్క ఇంటికీ కూడా పైపులైన్​ కనెక్షన్​ ఇవ్వలేదు. 288 ఇండ్లకు ఇక్కడ రెండే బోర్లు వేశారు. ఆ బోరు నీటినే అన్ని అవసరాలకు వాడుకుంటున్నారు. తాగేందుకు ట్యాంకర్​ నీళ్లు వచ్చేవి. వారం నుంచి ఆ ట్యాంకర్​ కూడా రావడం లేదు. దీంతో ఇక్కడ ఉంటున్న ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బోర్ల నుంచే ఉప్పు నీటిని పట్టుకొని తాగుతున్నారు. 

ఒంటికి, రెంటికి బయటికే..

ఇండ్లల్లో మరుగుదొడ్లు ఉన్నా.. ఒక్క దానికి కూడా వాటర్​ సప్లై లేదు. అన్ని ఇండ్లకు పైపులైన్​ కనెక్షన్లు ఉన్నా, ప్రతి బిల్డింగ్​లో ప్రత్యేకంగా వాటర్​ ట్యాంకులను ఏర్పాటు చేయలేదు. దీంతో ఇక్కడ ఉంటున్న జనం ఒంటికి, రెంటికి బయటికి వెళ్తున్నారు. పక్కనే ఉన్న గుట్టల చాటుకు వెళ్తుండడంతో పాములు, విష పురుగులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రీట్​ లైట్లు కూడా లేకపోవడంతో రాత్రి పూట బయటకు రావాలంటేనే భయం వేస్తోందని వాపోతున్నారు.

నీళ్లకు గోస పడుతున్నం..

నేను ఈ ఇంట్లోకి వచ్చి 8 నెలలు అవుతోంది. మంచినీళ్ల కోసం అరిగోస పడుతున్నాం. ఇంత వరకు మాకు ఫిల్టర్​ నీళ్లు రావు. భగీరథ కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. సిద్దాయిపల్లికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నాం. లక్ష్మమ్మ, లబ్దిదారు

బాత్రూమ్​లకు వాటర్​ సప్లై లేదు..

మా ఇంట్లో బాత్రూమ్​లు ఉన్నాయి. పైపులైన్లు వేసి నల్లాలు బిగించినా నీళ్లు వస్తలేదు. స్నానాలకు బోర్​ మోటార్​ నుంచి నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నాం. రాత్రిళ్లు బయటకు పోవాలంటే భయమేస్తుంది. పద్మమ్మ, లబ్ధిదారు