
- శ్మశాన వాటికల్లో సౌకర్యాలు లేక జనం అవస్థలు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపాలిటీలోని విలీన గ్రామాల్లో అంత్యక్రియలకు జనం అవస్థలు పడుతున్నారు. అయినవారు చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న వారికి వైకుంఠధామాలు లేక అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాగుల ఒడ్డున, ప్రైవేట్ స్థలాల్లో దహన సంస్కారాలు నిర్వహించుకోవాల్సి వస్తోంది. సిరిసిల్ల మున్సిపాలిటీలో చిన్నబోనాల, ముష్టిపల్లి, సర్థాపూర్, చంద్రంపేట, పెద్దూర్, రాజీవ్ నగర్ విలీనమయ్యాయి. వీటిల్లోని శ్మశానవాటికల్లో సౌకర్యాల్లేక జనం అవస్థలు పడుతున్నారు. ముష్టిపల్లి, చిన్నబోనాల గ్రామాల్లో దారిలేక ఇబ్బందులు పడుతున్నారు.
శంకుస్థాపనలకే పరిమితం
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట గ్రామంలో ఈదుల చెరువు సమీపంలో వైకుంఠధామం కోసం 2019 లో నాటి మంత్రి కేటీఆర్ శిలాఫలకం వేశారు. ఇప్పటివరకు శ్మశానవాటికలో సౌకర్యాలు కల్పించలేదు. రాజీవ్‌నగర్‌లో శ్మశానవాటిక పూర్తయితే అంబికానగర్, పద్మనగర్, వెంకంపేట, ముష్టిపల్లి ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చేది. సౌకర్యాల కల్పనలో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో వర్షాకాలంలో చెరువులు నిండటం వల్ల అంతిమ సంస్కారాలు చేయడానికి అవస్థలు పడుతున్నారు. రూ.33 లక్షలతో ప్రారంభించిన చంద్రంపేట వైకుంఠధామం పనులను మధ్యలోనే ఆగిపోయాయి. కేవలం కాంపౌండ్ నిర్మించి వదిలేశారు.