- జిల్లాలో పెరుగుతున్న కేసులు
- జ్వరాలతో మంచమెక్కిన చింతవర్రె గ్రామం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో జ్వరాలతో ప్రజలు అవస్థలు పడ్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల తర్వాత వైరల్ ఫీవర్స్పెరిగినట్టు వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు వందకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు దాదాపు 70కిపైగా నమోదయ్యాయి.
డెంగ్యూతో మహిళ మృతి..
జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు డెంగ్యూ, వైరల్ ఫీవర్స్‌తో అల్లాడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వందకు పైగా డెంగ్యూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తొంది. డెంగ్యూ లక్షణాలతో కరకగూడెం మండలంలో మంగళవారం ఓ మహిళ మృతి చెందారు. లక్ష్మీదేవిపల్లి మండలం చింతవర్రె గ్రామంలో దాదాపు ఇంటికొకరు చొప్పున వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఐదారుగురు డెంగ్యూ వ్యాధిబారిన పడ్డారు. వారం రోజులుగా దాదాపు 60 నుంచి 70 మందికి వైరల్ ఫీవర్సోకింది. స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి వెళ్తే పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.
ఇదే అదనుగా భావించిన ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ పేరుతో దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామంలోని అశోక్ అనే వ్యక్తి ఇంట్లో ఆయనతో పాటు ఆయన భార్య, తల్లి, పిల్లలు వైరల్ ఫీవర్, డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నారు. చికిత్స కోసం దాదాపు రూ. 50వేలు ఖర్చు చేసినట్టుగా అశోక్ వాపోయారు. ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నా వైద్య శాఖ హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేయకపోవడంతో పాల్వంచ, కొత్తగూడెంలలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా వారం, పది రోజులుగా గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో గ్రామంలోని బోర్ వాటర్ తాగుతున్నారు.
దోమలు విజృంభిస్తున్నాయి. చర్ల మండలంలోని విజయకాలనీ, సాలిబజార్, పాత చర్ల, సత్యనారాయణపురం, దమ్మపేట మండలంలోని పర్కాల గండి, అంకం పాలెం, పట్వారిగూడెం, కరకగూడెం మండలంలోని కరకగూడెం, కొత్తూరు గ్రామాలు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ బారిన పడ్డాయి. అశ్వారావుపేట మండలంలోని కుడుములపాడు గ్రామంలో ఇటీవలి కాలంలో వైరల్ ఫీవర్స్ విజృంభించాయి. వర్షాలు, ఎండలు, వాతావరణ మార్పులతోనే హెల్త్ సమస్యలు పెరుగుతన్నాయిని వైద్యులు పేర్కొంటున్నారు. చింతవర్రె గ్రామంలో జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలను జడ్పీటీసీ మేరెడ్డి వసంత పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
గ్రామంలో హెల్త్‌క్యాంప్
లక్ష్మీదేవిపల్లి మండలంలోని చింతవర్రె గ్రామంలో ప్రజలు జ్వరాలతో బాధపడున్నారనే విషయం మంగళవారం తమ దృష్టికి వచ్చిందని డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. బుధవారం గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు సంబంధించి రక్తపూతలు సేకరించామన్నారు. మూడు రోజుల పాటు హెల్త్ క్యాంప్‌ను కొనసాగించనున్నట్టు తెలిపారు.