- టెలీ మానస్ కాల్ సెంటర్‌కు నెలకు 4 వేల కాల్స్
- బాధితుల్లో 60% మంది యువతే
- జిల్లాల్లోని మెంటల్ హెల్త్ క్లినిక్‌లకూ వేలల్లో పేషెంట్లు
- జనవరి నుంచి ఏప్రిల్ వరకు 34,920 మందికి ట్రీట్ మెంట్
- ఆర్థిక, కుటుంబ కలహాలే ప్రధాన కారణం.. పిల్లలపై చదువు, ఉద్యోగాల ఒత్తిడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రకరకాల మానసిక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏదో ఓ కారణంతో మెంటల్ స్ట్రెస్‌కు గురవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం టెలీ మానస్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేయగా, దానికి నెలకు సగటున 4 వేల కాల్స్ వస్తున్నాయి. బాధితుల్లో 60% మంది యువతే ఉంటున్నారు. అప్పులు, కుటుంబ కలహాలు, చదువుల ఒత్తిడి, నిరుద్యోగం, అనారోగ్యం, రకరకాల అడిక్షన్స్‌తో ఆందోళనకు గురై ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్తున్నారు.
వీళ్లకు టెలీ మానస్‌లో పని చేసే సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పరిస్థితిని బట్టి హాస్పిటల్‌కు రిఫర్ చేసి, అవసరమైన ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. అయితే ఇలాంటి సర్వీస్ ఒకటి రాష్ట్రంలో ఉన్నట్టు ఎక్కువ మందికి అవగాహన లేదని, దీనిపై జనాల్లో అవేర్‌నెస్ వస్తే కాల్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు.
జిల్లాల్లో హెల్త్ క్లినిక్స్..
మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి అవసరమైన కౌన్సెలింగ్, ట్రీట్‌మెంట్ అందించేందుకు అన్ని జిల్లా హాస్పిటళ్లు, టీచింగ్ హాస్పిటళ్లలో మెంటల్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్‌లకు కూడా వేలాది మంది వస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ 34,920 మంది ఈ క్లినిక్‌లకు వచ్చి ఆరోగ్య సేవలు పొందారు. ఇందులో ఎక్కువ మంది మెంటల్ స్ట్రెస్‌తో ఇతర అనారోగ్యాలకు గురయ్యారని, ఆ రోగాల ట్రీట్‌మెంట్ కోసం వచ్చినప్పుడే వారికి మానసిక సమస్యలు ఉన్నట్టు గుర్తించి, సైకియాట్రిస్టుల వద్దకు రిఫర్ చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. పెద్ద పెద్ద హాస్పిటళ్లలో ఉండే మెడిసిన్స్ అన్నీ ఈ క్లినిక్‌లలో కూడా అందుబాటులో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే మెంటల్ హెల్త్ సమస్యల కోసం ఇలాంటి క్లినిక్స్ ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉన్నట్టు జనాలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ప్రాణాలు తీస్తున్న వ్యసనాలు..
టెలీ మానస్‌కు ఫోన్ చేస్తున్న వాళ్లలో చాలా మంది తాము అప్పుల్లో కూరుకుపోయామని, వాటి నుంచి బయటపడే దారిలేక ప్రాణాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది చెడు వ్యసనాలకు బానిసలుగా మారినట్టు ఒప్పుకుంటున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడం, బెట్టింగ్స్, పూర్తిగా ఆల్కహాల్‌కు బానిసలై అప్పుల పాలవడం, వాటి నుంచి బయటపడలేక, ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా సతమతమవుతూ చివరికి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. టెలీ మానస్‌కు వస్తున్న కాల్స్ లో పురుషుల కంటే మహిళలవే ఎక్కువగా ఉంటున్నాయి. వీరిలో ఎక్కువ మంది కుటుంబ కలహాలు, డొమెస్టిక్ వయొలన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఒత్తిడి గురవుతున్నట్టు కౌన్సెలర్లు చెబుతున్నారు.
మొబైల్ అడిక్టర్స్ ఎక్కువే..
టెలీ మానస్‌కు ఫోన్ చేస్తున్న వారిలో మొబైల్ అడిక్టర్స్ కూడా ఎక్కువగానే ఉంటున్నారు. మొబైల్‌కు అడిక్ట్ అయ్యి అసలు నిద్రపోలేకపోతున్నామని వారు చెబుతున్నారు. నిద్రపోవాలని ప్రయత్నించినా పోలేకపోతున్నామని, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. వీరి పరిస్థితిని బట్టి డీఅడిక్షన్ సెంటర్లకు రిఫర్ చేస్తున్నారు.
మాతో చెప్పుకోండి..
టెలీ మానస్ కాల్ సెంటర్, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ద్వారా వేల మందికి సేవలు అందిస్తున్నాం. స్టూడెంట్స్ నుంచి వృద్ధుల వరకు అందరూ కాల్స్ చేసి, వాళ్ల సమస్యలు చెప్పుకుంటున్నారు. స్టూడెంట్స్‌లో ఎక్కువగా మార్కులు, ర్యాంకుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి. యువతలో ఆర్థిక సమస్యలు, చెడు వ్యసనాలు, కుటుంబ కలహాలు ఒత్తిడికి దారి తీస్తున్నాయి. మధ్య వయస్కులు, వృద్ధుల్లో కుటుంబ కలహాలతో పాటు అనారోగ్య సమస్యలు ఒత్తిడికి కారణమవుతున్నాయి. చాలామంది సూసైడ్ ఆలోచనలు వస్తున్నట్టు చెబుతారు. కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాక కాల్స్ చేస్తున్నారు. అలా ఎవరు కాల్ చేసినా వారి పేరు అడగకుండానే అవసరమైన కౌన్సెలింగ్ అందిస్తున్నాం. వారి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరికైనా మానసిక ఇబ్బందులు ఉంటే 14416, 1800914416 నంబర్లకు ఫోన్ చేసి సహాయం తీసుకోవచ్చు.
‑ డాక్టర్ అనూష, ప్రోగ్రామ్ ఆఫీసర్, టెలీ మానస్
4 నెలల్లో వచ్చిన కాల్స్
వయసు కాల్స్%
0-12 1.9
13-17 4.8
18-45 62.4
46-64 24.1
65+ 6.8