- తాళం వేసి ఉన్న ఇండ్లు, షాపులు, రద్దీ ప్రాంతాలే టార్గెట్
- పెట్రోలింగ్‌ను పెంచుతామంటున్న పోలీస్ ఆఫీసర్లు
మహబూబాబాద్, వెలుగు: మానుకోటలో వరుస దొంగతనాలతో ప్రజలు వణికిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లు, షాపులు, రద్దీ ప్రాంతాలనే టార్గెట్‌గా చేసుకుని విలువై వస్తువులు, నగదు చోరీకి పాల్పడుతున్నారు. సరైన పోలీస్నిఘా లేకపోవడంతోనే దొంగతనాలు ఎక్కువయ్యాయని ప్రజలు భయాందోళన వ్యక్తం
చేస్తున్నారు.
పబ్లిక్ మీటింగ్‌లో ...
ఈనెల 8న జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌కమిటీ ప్రమాణస్వీకార సభకు మంత్రులు పోగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో జేబు దొంగలు చేతి వాటాన్ని ప్రదర్శించారు. సభకు హాజరైన సీరోలు మండలం కొత్తూరుకు చెందిన చిత్తూరు లక్ష్మీనారాయణ
వద్ద రూ.50వేలు, తేజావత్ బాలకృష్ణ వద్ద రూ.15 వేలు, చిరంజీవి వద్ద రూ.12 వేలు, లక్ష్మీపురానికి చెందిన మరో వ్యక్తి దగ్గర రూ.10వేలు చోరీ చేశారు.
తొర్రూరు బస్టాండ్‌లో..
ఈ నెల 9న తొర్రూరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద కొడకండ్ల మండలానికి చెందిన ఎర్రం శివలక్ష్మి బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె మెడలోని 6 తులాల పుస్తెలతాడు చోరీకి చేశారు.
తాళం వేసినవే టార్గెట్..
ఈ నెల5న మహబూబాబాద్ పట్టణంలోని బెస్తబజారులో జంగిలి హరీశ్ఇంటికి తాళవేసి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు తాళం పగులగొట్టి బీరువాలోని 6 తులాల వెండి, ముప్పావు తులం బంగారు ఆభరణం, రూ.6,500 నగదును చోరీ చేశారు.
Also Read : స్క్రాప్ నుంచి కరెంట్ ఉత్పత్తి
పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలోని మల్లం బజారులో మహేందర్ - స్వాతి ఇంటికితాళం వేసి పనికి వెళ్లారు. సాయంత్రం వచ్చి చూసే వరకు తాళం పగులగొట్టిఉంది. ఇంట్లోని బీరువాలో ఉన్న 6 గ్రాముల బంగారు నాణేలు, రూ.6 వేల నగదును అపహరించారు. బెస్తబజారులోని దుగ్గి పూలమ్మ ఇంట్లోచోరీకి యత్నించగా, ఇంటి పక్కన తలుపులు తెరిచి ఉండటంతో దుండగులు పరారయ్యారు.
పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచుతాం
జిల్లా కేంద్రంతోపాటు ఇతర చోట్ల పోలీస్పెట్రోలింగ్ను పెంచుతాం. ప్రజలు అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశంలో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నాం. కొత్త వ్యక్తుల కదలికలపై అనుమానం ఉంటే సమాచారం అందించాలి.
సుధీర్రామ్నాథ్కేకన్, ఎస్పీ, మహబూబాబాద్