- ఎస్12, ఎస్ 8లో ఒకటిగా అనుమానం
- ఆందోళనలో నాలుగు గ్రామాల ప్రజలు
- అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు
కొడిమ్యాల/వేములవాడ, వెలుగు: కొడిమ్యాల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామ శివారులో ఆవును పెద్దపులి చంపినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నాలుగు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చనిపోయిన ఆవును తినడానికి శుక్రవారం మళ్లీ పులి వచ్చే అవకాశం ఉండడంతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొడిమ్యాల అటవీ ప్రాంతం 40 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. 30 ఏండ్లుగా పెద్దపులి కనపడిన దాఖలాలు లేవు. అకస్మాత్తుగా పులి గ్రామ శివారులోకి రావడం, ఆవును చంపడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా మగపులిగా ప్రాథమికంగా నిర్ధారించారు. సిర్పూర్ కాగజ్ నగర్ ఏరియాలో కనిపించినఎస్12, భూపాలపల్లి ప్రాంతంలో కనిపించిన ఎస్8 పులుల్లో ఏదో ఒకటిగా అనుమానిస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతంలో నాలుగు నెలలుగా ఎస్ 12 పులి కనిపించడం లేదని అధికారులు తెలిపారు.
అప్రమత్తమైన ఆఫీసర్లు..
పెద్దపులి నుంచి ప్రజలను రక్షించడంతో పాటు పులికి హాని కలగకుండా ఎఫ్ఆర్వో మొహియుద్దీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొండాపూర్, బొల్లెంచెరువు, దమ్మయ్యపేట, రామకృష్ణాపూర్, నల్లగొండ, సూరంపేట గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వ్యవసాయ పనులకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. గతంలో కరెంట్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడిన స్మగ్లర్ల వివరాలు సేకరించి బైండోవర్ చేయాలని నిర్ణయించారు. పులికి హాని తలపెట్టకుండా నాలుగు బృందాలుగా ఏర్పడి మండలంలో గాలింపు చర్యలు చేపట్టారు.
వేములవాడలో ..
జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారంతో వేములవాడ ఫారెస్ట్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెద్దపులి జాడ కోసం అడవుల్లో గాలిస్తున్నారు. కొండాపూర్లో కనిపించిన పెద్దపులి వేములవాడ పరిధిలోని చందుర్తి, మల్యాల అటవీ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉండడంతో వేములవాడ ఎఫ్ఆర్వోఖలీలుద్దీన్, చందుర్తి, మల్యాల డీఆర్వో రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి, నూకలమర్రి, చందుర్తి మండలం తిమ్మాపూర్, చందుర్తి, మల్యాల, మోత్కురావుపేట, రుద్రంగి, రామన్నపేట ప్రాంతాల్లో సెర్చింగ్ చేస్తున్నారు. అడవిలో నీళ్లు తాగేందుకు రావచ్చనే ఉద్దేశంతో కాలి ముద్రలను గుర్తించే పనిలో పడ్డారు. రాత్రి వేళల్లో పులి సంచారం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్వో ఖలీలుద్దీన్ సూచించారు. పులి జాడ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.