చోరీ.. చోరీ.. పోలీసులు ఏరీ? .. పోలీసుల బదిలీలతో కొరవడిన పర్యవేక్షణ

  • ఆర్మూర్​లో వరుసగా బైక్​చోరీలు, చైన్​ స్నాచింగ్​లు
  • తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా లూటీలు
  • అంగడి రోజుల్లో మరింత పేట్రేగుతున్న దొంగలు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం ఏదో ఒక చోరీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకో చోట ఒక్కోరకంగా రకంగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వరుసగా బైక్ లు, సెల్​ఫోన్​ల​ చోరీలు, చైన్​ స్నాచింగ్ లు, తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలు జరుగుతున్నా ఏ ఒక్క కేసును పోలీసులు ఛేదించిన దాఖలాలు కనిపించడం లేదు. చోరీ కేసుల్లో రికవరీ చూపించాల్సి వస్తుందని అనేక కేసులను పోలీసులు ఫైల్​ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

రోజుకో చోట చోరీ..

ఆర్మూర్ టౌన్​లోని కుమ్మరిగల్లికి చెందిన కాసుల మీనాక్షి గత శనివారం మల్లారెడ్డి చెరువు కట్ట రోడ్డుపై తన కూతురుతో కలిసి స్కూటీపై వస్తోంది. వెనకాలే బైక్ పై వచ్చిన వ్యక్తి మీనాక్షి మెడలో ఉన్న మూడున్నర తులాల గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు. ఆదివారం పెర్కిట్ కు చెందిన సుమన్ కొత్త బస్టాండ్ ముందు తన బైక్ పార్క్ చేసి, టీ తాగి బయటకు వచ్చే సరికి అతడి బైక్ మాయమైంది. సోమవారం విద్యానగర్​కాలనీలోని ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి ఒంటరిగా కూర్చొని బీడీలు చుడుతున్న రాజవ్వ ఒంటిపై ఉన్న రెండున్నర తులాల గోల్డ్ చైన్ లాక్కొని పారిపోయాడు. జర్నలిస్టు కాలనీలో ఓ ఇంట్లో అద్దెకుటున్న బానోత్ సందీప్ తన బైక్ బయట పార్క్​చేసి ఇంట్లోకి వెళ్లాడు. బయటకు వచ్చేసరికి అతడి బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం అంగడిలో కూరగాయాలు కొంటున్న పాత బస్టాండ్ కు చెందిన సంగీత హ్యాండ్ బ్యాగ్​లో నుంచి, టీచర్స్​ కాలనీకి చెందిన బొడ్డు సాగర్ షర్ట్​జేబులో నుంచి స్మార్ట్​సెల్​ఫోన్ లను దొంగలు చాకచక్యంగా ఎత్తుకెళ్లారు.

తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా..

ఆర్మూర్ టౌన్ లోని కిందిబజార్ లో ఉన్న రజక సంఘం పక్క ఇంట్లో రెండు నెలల కింద, కొటార్మూర్​లో లింబాద్రి గౌడ్ ఇంట్లో, మామిడిపల్లిలోని వెంకటేశ్వర కాలనీలో, ఆలూర్ లోని రాంనగర్ లో నెల రోజుల క్రితం దొంగలు తాళం వేసిన ఇండ్లలో నగలు, సొత్తు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలపై ఫిర్యాదులు స్వీకరించారే తప్ప, ఎంక్వైరీలో ఎలాంటి పురోగతి లేదు.

అంగట్లో దొంగల హల్ చల్​....

ఆర్మూర్ అంగడి సెల్​ఫోన్ దొంగతనాలు చేసే వారికి అడ్డాగా మారింది. ప్రతీ బుధవారం జరిగే అంగడిలో దాదాపు పదికి పైగా సెల్​ ఫోన్ లు దొంగతనమవుతున్నాయి. కానీ పోలీసులు ఇప్పటివరకు ఒక్క ఫోన్​ను కూడా రికవరీ చేయలేదు. చైన్ స్నాచర్ల​ బ్యాచే​ సెల్ ఫోన్​ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయిదు నిమిషాల్లో బైక్​ ఎత్తుకెళ్లారు

పొలం పనులకు వెళ్లి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చాను. బైక్ ను ఇంటి ముందు నిలిపి, ఇంట్లోకి వెళ్లొచ్చే చూసేసరికి బైక్ లేదు. చుట్టు పక్కల రాత్రి దాకా వెతికినా దొరకలేదు. రాత్రి పోలీస్​స్టేషన్​కు పోయి కంప్లైంట్​ చేశా. 

గుమ్ముల బాజన్న, ఆర్మూర్​ కొత్తగా వచ్చే వారికి సవాల్​..

గడిచిన మూడు నెలల్లో ఆర్మూర్​లో అనేక నేరాలు, దొంగతనాలు జరిగాయి. పోలీస్​ఆఫీసర్లు బదిలీ ప్రక్రియ కొనసాగుతున్నందున ఆర్మూర్​కు కొత్తగా వచ్చే ఏసీపీ, ఎస్ఐలకు ఇక్కడ జరిగిన నేరాలు సవాల్ గా మారనున్నాయి. మూడు రోజుల కింద ఆర్మూర్​లో అక్కాచెల్లెళ్ల హత్య ఘటన సవాల్ గా నిలిచింది. ఆర్మూర్ లో ఆఫీసర్స్ లేకపోవడంతో జిల్లా ఇన్​చార్జి సీపీ ప్రవీణ్​ ఈ కేసును సీసీఎస్ పోలీస్​ బృందానికి అప్పగించారు.