అంకిత భావంతో సేవలు అందించాలె : మంత్రి సీతక్క

  • 15 రోజులకోసారి ప్రజా దర్బార్
  • రోడ్డు పనులను తొందరగా  పూర్తి చేయాలి
  • ప్రజాదర్బార్​కు వినతుల జాతర

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్తగూడలో శుక్రవారం స్త్రీ, శిశు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్​కు ప్రజలు జాతరలా వచ్చారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్, ఎస్పీ సుధీర్ రాంనాథ్​ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, డీఎఫ్​ ఓ విశాల్ తో కలిసి మంత్రి వినతులను స్వీకరించారు. అనంతరం అన్ని శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొత్తగూడ, గంగారం మండలాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, ప్రత్యేక దృష్టి పెట్టి ఆఫీసర్లు అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఇక నుంచి శుక్రవారం వచ్చేలా ప్రతి పదిహేను రోజులకోసారి కొత్తగూడలో జిల్లాస్థాయి ఆఫీసర్లతో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో శానిటేషన్, విద్య, వైద్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆఫీసర్లను ఆదేశించారు.

సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో విరివిగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పీఆర్, ఐటీడీఏ, ఆర్అండ్ బీ ఇంజినీరింగ్ ఆఫీసర్లు రోడ్డు పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయించాలని, పని చేయని కాంట్రాక్టర్లను పక్కన పెట్టాలని చెప్పారు. మత్తు పదార్థాల వైపు యువత దృష్టి మరలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు ఎంపీడీవో ఆఫీస్​ వద్ద వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. వేలుబెల్లి శివారులోని కత్తెర్ల వాగుపై మంజూరైన బ్రిడ్జి పనులు, ఎదుళ్లపల్లి నుంచి కుందనపల్లి మీదుగా ఓటాయి వరకు మంజూరైన రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.  

ఆఫీసర్లపై ఆగ్రహం..

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్లు అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని ఆఫీసర్లు అవసరం లేదన్నారు. ఆగిపోయిన రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్​ఇండ్లు పూర్తి చేయాలని లబ్ధిదారులు వినతి ఇవ్వగా, ఐటీడీఏ ఏఈ రవిని వెంటనే పనులను పూర్తి చేయించాలని మండిపడ్డారు. 

వినతుల వెల్లువ..

కొత్తగూడలో మంత్రి సీతక్క నిర్వహించిన ప్రజా దర్బార్​కు విశేష స్పందన వచ్చింది. రైతు వేదిక బయటే జనం జాతరలా వినతులు సమర్పించారు. మంత్రి ఓపికగా అందరి వినతి పత్రాలు స్వీకరించాక భోజనానికి వెళ్లారు.

శభాష్​ పోలీస్​..

ప్రజా దర్బార్​లో డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్స్ శభాష్​ పోలీస్​ అనిపించుకున్నారు. ప్రజా దర్బార్​కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన దివ్యాంగురాలిని మహిళా కానిస్టేబుళ్లు సౌభాగ్య, సుమలత రెండు వైపులా ఎత్తుకెళ్లి వినతి ఇప్పించారు. మరో మహిళ చంటి బిడ్డతో వినతి తీసుకుని రావడంతో కానిస్టేబుల్ ఆ చంటిబిడ్డను కాసేపు ఎత్తుకుని ఆడించింది. ఇదంతా గమనించిన మంత్రి సీతక్క, జిల్లా ఆఫీసర్లు ఇరువురు కానిస్టేబుళ్లను అభినందించారు.