- అధికారులు, పోలీసులు రూలింగ్ పార్టీకి తొత్తులుగా మారిన్రు
- 12 సీట్లొస్తే రాష్ట్రాన్ని శాసిస్తం.. వాళ్లు మళ్లీ మన మాటే వింటరు
- రాముడు అందరివాడు.. మనం కూడా జై శ్రీరామ్ అందామని కామెంట్
వేములవాడ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించలేదని.. తమను తామే ఓడించుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. వేములవాడలో ఆదివారం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాజధాని గడువు జూన్2 నాడు అయిపోతుందని, కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఎవరైనా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు. గోదావరి నీళ్లను తరలించుకువెళ్లకుండా ఆపగలిగేది, డీలిమిటేషన్ వంటి అంశాల్లో అన్యాయం జరగకుండా చూడగలిగేది తమ పార్టీ ఒక్కటేనన్నారు. ‘‘మనల్ని ప్రజలు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నాం” అని పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి అని విమర్శించారు. ‘‘శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదు.. రాముడు అందరివాడు. మనందరం కూడా జైశ్రీరామ్ అందాం” అని క్యాడర్‌కు ఆయన పిలుపునిచ్చారు.
రేవంత్, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్
కరీంనగర్లో జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాలని ఆశించారని.. కానీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ ఏడాదిలోపు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్నారు. ‘‘మన ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు మన మాట వినేవారు. ఇప్పుడు సుంకరి కూడా పిలిస్తే రావడం లేదు. ఇది మనకు అవమానం కాదా? అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులు, పోలీసులు మళ్ళీ మన మాట వినాలంటే మనకు10 నుంచి 12 సీట్లు రావాలి” అని కేటీఆర్ కామెంట్ చేశారు. వరికి రూ.500 బోనస్ ఇవ్వట్లేదు, 6 గ్యారంటీలు అమలు కావడంలేదన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ స్కీంలు కూడా మాయం అవుతాయన్నారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ నేతలు పాల్గొన్నారు.