వచ్చినోళ్లే వస్తున్నారు! .. పరిష్కారం చూపని   యంత్రాంగం

  • నెలల తరబడి ప్రజావాణికి  తిరుగుతున్న బాధితులు
  • జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపితేనే ఫలితం

కామారెడ్డి, వెలుగు : తమ సమస్యల పరిష్కారం కోసం మండల అధికారుల చుట్టూ తిరిగి విసిగిన జనం, జిల్లాస్థాయిలో తమ గోడు వెల్లబోసుకుందామని కలెక్టరేట్​లో జరిగే ప్రజావాణి ప్రోగ్రామ్​కు వస్తుంటారు. ఇక్కడ కూడా వారికి అదే పరిస్థితి తలెత్తుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక ప్రతీ సోమవారం కలెక్టరేట్​ వచ్చిపోతున్నారు. ఇక్కడ కూడా  సమస్యలు పరిష్కారం కాకపోవడం, అసలు పరిష్కారమవుతుందా? లేదా? అనే విషయామై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో వచ్చిన బాధితులే మళ్లీమళ్లీ వస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపితే కొంత వరకైనా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశముంది. ఎన్నికల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమైన ప్రజావాణికి గతంలో ఫిర్యాదులు ఇచ్చిన వారే ఎక్కువ మంది వచ్చారు.

ప్రధాన సమస్యలు ఇవే..

పట్టాదారు పాస్​బుక్​ రాకపోవడం, భూమి కొలతకు చలాన్ చెల్లించి నెలలు తరబడి వేచిచూసినా సర్వేయర్లు వచ్చి హద్దులు చూపకపోవడం, పాస్​బుక్​లో పేర్లు తప్పుగా రావడం, పట్టా భూమిని ఇనాం భూమిగా చూపడం, భూమి తక్కువ, ఎక్కువగా చేసి చూపడం, తండ్రి, తల్లి, భర్త చనిపోతే వారి పేరుపై  ఉన్న భూమి వారసుల పేరిట మార్చేందుకు తిప్పలు పెట్టడం, అర్హుల లిస్ట్​లో పేరున్నా డబుల్ బెడ్ రూమ్​ఇల్లు రాలేదని, బీసీ బంధు, దళిత బంధు రాలేదని చాలా మంది కలెక్టరేట్​కు వస్తున్నారు.

అప్లికేషన్ పెట్టి ఆరు నెలలైంది

నా భార్య కుటుంబ సభ్యులకు సదాశివ్​నగర్ లో 6 ఎకరాల అగ్రికల్చర్ పట్టాభూమి ఉంది. భూమిని సర్వే చేయాలని ఆరునెలల కింద గవర్నమెంట్ అకౌంట్ కు చలానా చెల్లించి, అప్లికేషన్ పెట్టా. మండల సర్వేయర్ మాత్రం భూమి సర్వే చేయకుండా తిప్పుతున్నాడు. ఎన్నిసార్లు వెళ్లి అడిగినా ఫలితం లేక ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశా. ఒక రోజు వచ్చి సర్వే చేయడానికి నెలల తరబడి ఆపడం సరికాదు. 

 వినయ్​రెడ్డి, దేమికలాన్

పేరు మార్పిడి కోసం..

నా తండ్రి రమావత్ భోజ్య పేరుపై ఎకరంన్నర భూమి ఉంది. ఆయన ఈ ఏడాది ఏప్రిల్​లో చనిపోయాడు. మా అమ్మ పేరుపై పట్టా మార్పిడి చేయాలని అప్లికేషన్ పెట్టి 6 నెలలు కావొస్తోంది. ఇప్పటికీ మార్పిడి చేయలేదు.  తహసీల్​ఆఫీస్​కు వెళ్తే, కలెక్టరేట్​లో పెండింగ్​లో ఉందని చెబుతున్నారు. ఇక్కడికి కూడా రెండుసార్లు వచ్చా. 

రమావత్ శంకర్, నాగిరెడ్డిపేట 

డబుల్ బెడ్ రూమ్​ ఇల్లు కోసం

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో 35 ఏండ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నా. దివ్యాంగుడైన నేను రోడ్డు పక్కన పండ్లు అమ్ముతూ జీవిస్తున్నా. డబుల్ బెడ్ రూమ్​కోసం అప్లయ్ చేయగా, దివ్యాంగుల కోటాలో అర్హత లిస్ట్​లో నా పేరు వచ్చింది. కానీ ఇంత వరకు ఇల్లు ఇవ్వలేదు. అడిగితే డ్రాలో పేరు రాలేదని చెబుతున్నారు. నాకు 90 శాతం వైకల్యం ఉంది. నాకంటే తక్కువ ఉన్న వైకల్యం ఉన్న వారికి ఇల్లిచ్చి, నాకు ఇవ్వలేదు. న్యాయం చేయాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశా.

సామల యాదగిరి, దేవునిపల్లి

తప్పును సరిదిద్దాలని..

నాకు గ్రామ శివారులో సర్వే నంబర్ 303/ఉ లో 21 గుంటల భూమి ఉంది. ఇది పట్టాభూమి అయినప్పటికీ పాస్​బుక్​లో ఇనాం భూమిగా చూపించారు. నాకు మిగతాసర్వే నంబర్లలోనూ కొంత భూమి ఉంది. బ్యాంక్​ లోన్ కోసం వెళ్తే  ఒక సర్వే నంబర్ తప్పుగా ఉండడంతో ప్రాబ్లమ్ అవుతోందని చెప్పారు. తప్పుగా పడిన వివరాలను సరిచేయాలని వినతి పత్రం ఇచ్చా. ప్రజావాణిలో ఇప్పటికే 3 సార్లు అర్జీ పెట్టుకున్నా, అయినా ఇప్పటివరకు క్లియర్​ కాలేదు.

డోకూరి విజయ్​కుమార్, ​మర్కల్, సదాశివ్​నగర్