లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట మండలంలో ఒకే ఒక్క ఆధార్ సెంటర్ ఉండడంతో ఆధార్ నమోదు, అప్డేట్ కోసం వచ్చే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోకెట్ల కోసం ఎదురుచూసి దక్కకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం ఎస్బీఐలో ఉన్న ఏకైక ఆధార్ నమోదు కేంద్రానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో బ్యాంకు మొత్తం కిక్కిరిసిపోతోంది. రోజువారీగా కేవలం 30 మందికి మాత్రమే ఆధార్ నమోదు అప్డేట్ కోసం టోకెన్లు అందజేస్తున్నారు.
దీంతో టోకెట్లు దక్కనివారంతా ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. గతంలో గ్రామీణ బ్యాంకు పోస్టాఫీస్ లో మరో రెండు ఆధార్ సెంటర్లు ఉండేవి. ఇటీవల కంప్యూటర్కాలిపోవడంతో పోస్టాఫీస్ లో ఆధార్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్బీఐలోని ఆధార్ సెంటర్కు వారం రోజులుగా జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు. మంగళవారం జనాలు భారీగా రావడంతో కొద్దిసేపు అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వచ్చి జనాన్ని శాంతింపజేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఆధార్ సేవలను విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు.