- 16 సంవత్సరాలుగా కాలనీ వాసుల పోరాటం
- రిపేర్లు చేస్తున్నామంటున్న ఆఫీసర్లు
- పేలుళ్లతో దెబ్బతింటున్న ఇండ్లు
- శ్లాబ్ పెచ్చులూడి పలువురికి గాయాలు
- పట్టించుకోని సింగరేణి
ఖమ్మం/సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లిలో కోల్ మైనింగ్ కోసం సింగరేణి సంస్థ చేస్తున్న బాంబ్ బ్లాస్టింగ్ తో తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని ఎన్టీఆర్ నగర్, వెంగళరావు నగర్ వాసులు 16ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. పేలుళ్లతో దెబ్బతిన్న తమ ఇండ్లకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితుల్లో కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించగా, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయినా బాధితుల ఆందోళనలను సింగరేణి లైట్ తీసుకుంది. పరిహారం ఇవ్వకుండా కేవలం రిపేర్లతోనే సరిపెడుతోంది. కొన్ని నెలల క్రితం కాలనీల్లో సర్వే చేసిన సింగరేణి అధికారులు, ఇప్పుడు ఆ ఇళ్లకు రిపేర్లు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పరిహారం ఇప్పిస్తామంటూ చెప్పి, హామీ ఇచ్చిన లీడర్లు ఇప్పుడు స్పందించడం లేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల డిమాండ్పట్టించుకోని సంస్థ..
సత్తుపల్లి పట్టణ పరిధిలోని వెంగళరావునగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీల్లో సింగరేణి బ్లాస్టింగ్ లతో ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. విధిలేని పరిస్థితుల్లో వెంగళరావు నగర్ కాలనీవాసులు సుమారు150 మంది దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు చేయించుకున్నారు. ఎన్టీఆర్ నగర్ వాసులు మాత్రం పూర్తిస్థాయిలో శిథిలమైన తమ ఇళ్లకు మరమ్మతులతో ప్రయోజనం ఉండదంటున్నారు. తమకు కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అలా సాధ్యపడకపోతే స్లాబులను తొలగించి, కొత్త స్లాబులు నిర్మించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నగర్ లో 647 ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇవి పూర్తిగా శిథిలావస్థకు చేరి స్లాబ్ పెచ్చులూడుతుండడంతో వాటిలో ఉంటున్నవారు గాయాలపాలవుతున్నారు. మరోవైపు తీవ్ర వాయు కాలుష్యంతో శ్వాస, చర్మ సంబంధిత వ్యాధులు ప్రభలుతున్నా సింగరేణి సంస్థ పట్టించుకోవడంలేదని స్థానికులు కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఎన్జీటీ ఇరుపక్షాల వాదనలు విన్నాక సింగరేణి సంస్థకు రూ.41.21 కోట్లను జరిమానాగా విధిస్తూ ఆ మొత్తాన్ని ఎన్టీఆర్ నగర్ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని ఆదేశించింది. అయినా సంస్థ పోకడలో మార్పు రాకపోగా, సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం గమనార్హం.
ఆరు కాలనీలపై ప్రభావం...
2005లో సత్తుపల్లిలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ఆర్జలగం వెంగళరావు ఓపెన్‌కాస్ట్(జేవీఆర్‌ఓసీ)ని ప్రారంభించారు. దీంతో వాతావరణ కాలుష్యం, అనారోగ్య సమస్యలు, బొగ్గు తీసేందుకు బ్లాస్టింగ్ ల కారణంగా ఇండ్లు దెబ్బతింటున్నాయి. శ్లాబు, గోడలకు పగుళ్లు ఏర్పడడం, పాతబడిన ఇండ్లు కూలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో తమకు పరిహారం ఇవ్వాలంటూ పట్టణంలోని వెంగళరావునగర్, ఎన్టీఆర్ నగర్, జలగంనగర్, విరాట్ నగర్ తోపాటు కిష్టారం బీసీ కాలనీ, ఎస్సీ కాలనీవాసులు ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ కాలనీల్లో దాదాపు 2 వేల ఇళ్లు ఉంటాయి. వీటిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండే ప్రాంతాలే. వీరంతా రోజు వారి కూలి పనులు చేసుకునే నిరుపేదలే. ఈ బాధితులు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు ఆఫీసర్లకూ తమ సమస్యను చెప్పుకున్నారు. సంస్థ ఆఫీసర్లు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. తాము నిబంధనలకు లోబడే బ్లాస్టింగ్ చేస్తున్నామని చెబుతున్నారు.
న్యాయ పోరాటానికి కార్యాచరణ..
ఎన్టీఆర్ నగర్ లో సింగరేణి సంస్థ కారణంగా శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉండలేకపోతున్నం. ఎన్ని సార్లు ఆఫీసర్లు, లీడర్లకు చెప్పినా ఏమీ కాలే. వందల ఫ్యామీలు ఉండే ఈ కాలనీపై చిన్న చూపు ఉంది. ఎన్జీటీ ఆర్డర్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు సంస్థ వెళ్తుందే తప్ప న్యాయమైన తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుత లేదు. పరిష్కారానికి న్యాయపోరాటానికి కార్యాచరణ చేస్తున్నాం.
– నందు నాయక్, ఎన్ జీటీ పిటిషనర్
కొత్త ఇళ్లు కట్టించాలె...
సింగరేణి బాంబులతో కాలనీలోని మా ఇల్లు దెబ్బతిన్నది. దానికి రిపేర్లు వద్దు. సింగరేణి సంస్థనే కొత్త ఇల్లే కట్టించి ఇవ్వాలి. ఇప్పటికే స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డయి. నాతో పాటు చాలామందికి దెబ్బలు తాకినయ్. ఇంకా పెద్ద ప్రమాదాలు కాకముందే సార్లు, లీడర్లు స్పందించాలి.
– పఠాన్ వహీదా, బాధితురాలు, సత్తుపల్లి