ఏసీడీ చార్జీలపై ఎన్పీడీసీఎల్ చైర్మన్ను నిలదీసిన ప్రజలు

కరీంనగర్ టౌన్, వెలుగు: అడిషనల్​ కన్జంప్షన్​డిపాజిట్( ఏసీడీ) చార్జీలు ఎందుకేస్తున్నారని వినియోగదారులు ఎన్పీడీసీఎల్ చైర్మన్ శ్రీరంగారావును నిలదీశారు. కరీంనగర్ ​కలెక్టరేట్ లో సోమవారం విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో విద్యుత్​ సమస్యలమీద వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీడీ చార్జీలు పెనుభారంగా మారాయని, సక్రమంగా సేవలు అందించకుండా చార్జీలు ఎలా వసూలు చేస్తారని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నా 10 గంటలకు పైగా కోతలు విధిస్తున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నేత సంపత్ రావు ఆరోపించారు. 40ఏళ్ల కింద వేసిన ట్రాన్స్ ఫార్మర్లను తరలించాలన్నా.. పోల్ ఎక్స్ టెన్షన్ కావాలన్నా విద్యుత్​ అధికారులు డబ్బులు అడుగుతున్నారని మానకొండూర్ మండలం నిజాయితీగూడెం సర్పంచ్  మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60ఏళ్ల క్రితం వేసిన విద్యుత్ వైర్లను మార్చడం లేదని రామడుగు మండలం దేశరాజ్ పల్లి సర్పంచ్ కోల రమేశ్​చెప్పారు.  ఇష్టమొచ్చినట్టు రీడింగ్​ తీస్తున్నారని, రెండు రూముల ఇంటికి రూ.20వేల బిల్లు వచ్చిందని ఆయన ఆరోపించారు.  చిగురుమామడి మండల కేంద్రంలో ఇళ్ల పైనుంచి విద్యుత్ వైర్లు పోతున్నాయని ఎంపీపీ  కొత్త వినీత చెప్పారు.  చిలుముపట్టిన, మోరీల్లో ఉన్న పాత పోల్స్ ను తొలగించాలని, పెంచిన ఏసీడీ చార్జీలను రద్దు చేయాలని  కార్పొరేటర్లు  పెద్దపల్లి జితేందర్,  యాదయ్య, మాధవి, కళ్యాణి  కోరారు.   

డిస్కంలపై భారం నివారించేందుకే.. 

చాలా మంది కరెంట్​బిల్లులు ఎగవేయడం వల్ల డిస్కంలపై భారం పడుతోందని,అందుకోసం డిపాజిట్ వసూలు చేస్తున్నామని శ్రీరంగారావు చెప్పారు. విద్యుత్ మీటర్​ తీసుకునేటప్పుడు అగ్రిమెంట్​ ప్రకారం రెండు నెలల బిల్లు మొత్తం డిపాజిట్ గా ఉంచాలని, ఈ నిబంధన మేరకే ఏసీడీ చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు. నెల ముందు నోటీసు ఇచ్చిన తర్వాత బిల్లులు వసూలు చేయాల్సి ఉందన్నారు.  ప్రతీ వినియోగదారుడు ఏసీడీ కట్టాల్సిందేనన్నారు. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ నుంచి వసూలు చేస్తున్నామని, త్వరలో ఎస్పీడీసీఎల్ పరిధిలో కూడా వసూలు చేస్తామని తెలిపారు. స్టేట్​లో రూ. 350 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. ఎవరైనా బిల్లు కట్టకుంటే రెండు నెలల తర్వాత కనెక్షన్స్ కట్ చేస్తామని, ఎగవేతలను నిలువరించేందుకు ఈ విధానం తెచ్చామన్నారు. ఉచిత విద్యుత్ వల్ల ఏర్పడ్డ రూ.20వేల కోట్ల లోటు భర్తీ కోసం ఏసీడీ చార్జీలు వసూలు చేస్తున్నారనడంలో నిజం లేదన్నారు. వినియోగదారులు కూడా కరెంట్ పొదుపుగా వాడుకోవాలని కోరారు. 24గంటల విద్యుత్ అవసరం లేదని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు సూచించిన అంశంపై  సీఎండీ ప్రకటన చేస్తారన్నారు.  ఏసీడీపై అభ్యంతరాల నేపథ్యంలో త్వరలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.