న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో జనం తినే తిండి బాగా తగ్గిపోయింది. లాక్డౌన్ మొదలైన తర్వాత రూరల్ ఏరియాల్లో 50 శాతం కుటుంబాలు గతంలో కంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నట్టు తాజా సర్వేలో వెల్లడయ్యింది. ‘కోవిడ్ 19 ఇన్డ్యూస్డ్ లాక్డౌన్–హౌ ఈజ్ హింటర్‌లాండ్ కోపింగ్’ పేరిట 47 జిల్లాల్లో ఈ స్టడీ నిర్వహించారు. 12 రాష్ట్రాల్లోని 5 వేల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. బుధవారం వెబినార్‌లో ఈ స్టడీ వివరాలను రిలీజ్ చేశారు. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సర్వే చేశారు.
పీసీఎస్ స్కీంపైనే ఆధారపడ్డరు
50 శాతం ఫ్యామిలీలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తాము తీసుకునే తిండిని తగ్గించుకున్నాయి. 68 శాతం కుటుంబాలు తాము తినే ఆహారంలో ఐటమ్స్‌ను తగ్గించాయి. ఈ సర్వే ప్రకారం 84 శాతం కుటుంబాలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ద్వారా ఆహార పదార్థాలను అందుకున్నాయి. 37 శాతం కుటుంబాలు తమ ఇంటి దగ్గరే రేషన్ తీసుకున్నాయి. 24 శాతం కుటుంబాలు తమ గ్రామంలోని ఇతరుల నుంచి అప్పు తెచ్చుకున్నాయి. 12 శాతం కుటుంబాలు ఫ్రీగా ఫుడ్‌ను అందుకున్నాయి. రబీ కంటే ఖరీఫ్ పంట పైనే జనం ఎక్కువగా ఆధారపడ్డారని, అయితే ప్రస్తుతం ఆహార ధాన్యాల నిల్వ తగ్గిపోయిందని ఈ స్టడీ వెల్లడించింది. ‘‘చాలా కుటుంబాలు తీసుకునే ఫుడ్‌ను తగ్గించాయి. తినే టైమ్‌ను కూడా తగ్గించుకున్నాయి. ఎక్కువ మంది తమ అవసరాలకు పీడీఎస్పైనే ఆధారపడ్డారు”అని ఈ స్టడీ తెలిపింది.
ప్రభుత్వ సాయం అవసరం
2020 ఖరీఫ్ కు సంబంధించి సన్నద్ధత తక్కువగా ఉందని, పంట వేసేందుకు అవసరమైన విత్తనాలు, రుణాల కోసం ప్రభుత్వ సహాయం అవసరమని ఈ స్టడీ అభిప్రాయపడింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వలస కూలీలు తమ సొంతూర్లకు వెళుతూనే ఉన్నారని తెలిపింది. ‘‘లాక్డౌన్, రూమర్లు డెయిరీ, పౌల్ట్రీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో వాటి ఆదాయం తగ్గిపోయింది. వీటి వల్ల ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. జనం ఖర్చులను తగ్గించుకున్నారు” అని తెలిపింది.
మరిన్ని సర్వేలు జరగాలి
సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు ప్రధాన్, యాక్షన్ ఫర్ సోషల్ అడ్వాన్స్మెంట్, బీఏఐఎఫ్, ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా ఫౌండేషన్, గ్రామీణ్ సహారా, సాతీ–యూపీ, అగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రాంతో పాటు వికాశ్ అన్వేష్ ఫౌండేషన్, సంబోధితో కలిసి ఈ స్టడీ నిర్వహించాయి. వెబినార్ లో ప్రధాన్ ప్రోగ్రాం డైరెక్టర్ మధు ఖేతన్ మాట్లాడుతూ.. తమకు అవకాశం ఉన్న చోట్ల మాత్రమే ఈ స్టడీ నిర్వహించామని, రిమోట్ గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. బీఏఐఎఫ్ ప్రెసిడెంట్ గిరిష్ సోహానీ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి సంబంధించి కూడా అనేక విషయాలు తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటి మరిన్ని సర్వేలు జరిగితేనే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అర్థమవుతుందని చెప్పారు.
17 తర్వాత జిమ్ లు,గోల్ఫ్ కోర్సులు ఓపెన్