బుక్స్ చదువుతూ.. సిన్మలు చూస్తూ..
నచ్చిన పనిలోనిమగ్నమైన సిటీజనం
పెండింగ్ పనులపై ఫోకస్
కుకింగ్, సోషల్ మీడియాలో పోస్టులు
హైదరాబాద్, వెలుగు: లాక్‌డౌన్ టైమ్ ను సిటీ జనాలు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. నెలలుగా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నపనులను కంప్లీట్ చేస్తున్నారు. టైమ్ లేదనే మాటలకు బైబై చెప్పి ఇష్టమైన పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. సిటీలో విద్యార్థులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడం అంటే కాలంతో పోటీ పడటమే. ఓ విద్యార్థి మంచి చిత్రకారుడు. ఏదైనా మంచి పెయింటింగ్ వేయాలని కోరిక. ఓ ఉద్యోగికి సరదాగా ఫ్రెండ్స్ తో దిగిన ఫొటోలను ఆల్బమ్‌లో చక్కగా సర్దుకోవాలని ఆలోచన. ఓ గృహిణికి
సంగీతం అంటే చాలా ఇష్టం. సాధన చేయాలని అనుకుంటుంటుంది. ఓ విశ్రాంత ఉద్యోగి తన పిల్లలు, మనవళతో సరదాగా గడపాలని భావిస్తుంటాడు. కానీ ఇలాంటి వారందరి ఆశలు నెరవేరకపోవడానికి కారణం టైమ్ లేకపోవడం. ప్రస్తుతం వారందరికీ కావాల్సినంత టైమ్ దొరికింది.
నాలుగు గోడల మధ్యే ఎంటర్ టైన్ అవ్వొచ్చు. ఎప్పటి నుంచో చూడాలని అనుకుంటున్న సినిమాలను సరదాగా చూసెయ్యొచ్చు. చాలామంది
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు. ఇంటిపట్టునే ఉంటున్నాం .. భార్యకు వంటలో సాయం చేస్తున్నామని చెబుతున్నారు.
మరికొందరైతే మొక్కలకు నీళ్లు పోస్తూ ప్రశాంతంగా గడుపుతున్నామని పేర్కొంటున్నారు. హోమ్ క్వారంటైన్‌లో ఏమీ తోచక పిల్లికి హెయిర్
కటింగ్ చేస్తున్నట్టుగా సరదాగా పోస్టులు పెట్టే వాళ్లు ఉన్నారు. ఎవరు ఏం చేసినా ఇంటి పట్టున ఉండాలనే మెసేజ్ ఇస్తున్నారు. కొందరు నాకు
నచ్చిన సినిమాలు చూసేస్తున్నానని, నచ్చిన బుక్స్ చదివేస్తున్నానని చెబుతున్నారు. ప్రశాంతంగా ఇంటి పట్టునుంటే కరోనాను కట్టడి చేయొచ్చని చాటుతున్నారు.