తాగునీటికి తండ్లాట .. రిజర్వాయర్లలో అడుగంటుతున్న నీటి మట్టం

  • పాలేరు, వైరాలో ఉన్న నీళ్లు అంతంతే
  • క్రమంగా పడిపోతున్న భూగర్భ జలాలు 
  • ఖమ్మం జిల్లాలో178 గ్రామాల్లో సమస్యాత్మకమని గుర్తింపు 
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆఫీసర్ల ప్లాన్​ 

ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలో మంచి నీటి కోసం మహిళలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. పది రోజులుగా ఇంట్లో తాగడానికి, ఇంటి అవసరాలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మండల కేంద్రానికి తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పటికీ నీటి ఎద్దడిని తీర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోనే ఇలా ఉంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటని నిలదీశారు. అనంతరం తహసీల్దార్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. 

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో తాగునీటికి వేసవి ముంపు ముంచుకొస్తోంది. ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించేందుకు రిజర్వాయర్లలోనూ సరిపోను నీళ్లు లేవు. నాగార్జున సాగర్​ నుంచి కూడా నీళ్లొచ్చే పరిస్థితి లేదు. ఈనెల మొదటివారంలో కేవలం తాగునీటి కోసమే నాలుగైదు రోజుల పాటు సాగర్​ నీటిని రిలీజ్​ చేశారు. 

పాలేరుకు చేరుకునే సమయంలోనే కాల్వల్లో నీటిని వ్యవసాయ మోటార్లతో లాగేయడం, తూముల ద్వారా నీటిని దొంగతనంగా దారిమళ్లించడంతో ఆశించిన స్థాయిలో పాలేరుకు నీరు చేరలేదు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 13.40 అడుగులు ఉండగా, ఒక్క అడుగు నీరు ఐదు రోజులకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాకు సరిపోతుంది. తాగునీటి కోసం ఖమ్మం లకారం చెరువుకు 500 కూసెక్కుల నీరు వదిలితే 11 రోజులకు మాత్రమే నీరు సరిపోతుంది. లేదంటే 16 రోజులకు నీళ్లు సరిపోతాయి. ఈ నీటిని ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్​ జిల్లాల్లోని పలు గ్రామాలకు తాగునీటికి ఉపయోగిస్తున్నారు. 

వైరా లోనూ అదే పరిస్థితి.. 

ప్రస్తుతం వైరా రిజర్వాయర్​ లోనూ ఇదే పరిస్థితి ఉంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18అడుగుల 3 అంగుళాలు కాగా, ప్రస్తుతం 12 అడుగుల వరకు నీరుంది. రిజర్వాయర్​ లో 1.4 టీఎంసీ నీళ్లుండగా, తాగునీరు కోసం రోజుకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్​లో ఉన్న నీరు రెండు నెలల వరకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. 

లోలోతుకు నీటి మట్టం.. 

జిల్లాలో గతేడాది డిసెంబర్​ లో 4.75 మీటర్లలో ఉన్న సరాసరి భూగర్భ జలాల నీటిమట్టం, జనవరి నెలాఖరుకు 5.46 మీటర్లకు పడిపోయింది. ఈనెలాఖరుకు మరో మీటర్​లోతుకు పడిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు నాగార్జున సాగర్​ నుంచి కానీ, ఎస్ఆర్​ఎస్​పీ కాల్వల ద్వారా కానీ నీళ్లు రప్పించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. అది వీలుకాకుంటే మహబూబాబాద్​ జిల్లాలోని బయ్యన్న వాగు నుంచి నీటిని తెచ్చేలా చూస్తున్నారు. వాటితో పాటు గ్రామాల్లో స్థానికంగా బోర్లు, బావుల ద్వారా నీటిని అందించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

2.92 లక్షల ఇండ్లకు నీళ్లివ్వాలి.. 

ఖమ్మం జిల్లాలో మిషన్​ భగీరథ ద్వారా 589 గ్రామ పంచాయతీల్లోని 969 ఆవాస ప్రాంతాల్లో 2.92 లక్షల ఇండ్లకు తాగునీటిని అందిస్తున్నారు. 588 కొత్త ఓవర్​ హెడ్​ ట్యాంకులతో కలిపి మొత్తం 1,487 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. వీటిలో అధికారులు తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం 11 గ్రామాల్లో నీటి సరఫరా సక్రమంగా లేదని గుర్తించారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 178 గ్రామాల్లో మంచినీటికి తీవ్ర సమస్య వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ..

ప్రణాళికలు.. ప్రతిపాదనలు

అన్ని గ్రామాలకు నీళ్లందేలా ఆఫీసర్లు ప్లాన్​ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సుమారు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పాలేరు నియోజకవర్గంలో 45 గ్రామాలకు గాను రూ.కోటితో అంచనాలు సిద్ధమయ్యాయి. ఖమ్మం నియోజకవర్గంలో 25 గ్రామాలకు రూ.85లక్షలు, వైరా నియోజకవర్గంలో 26 గ్రామాలకు రూ.83 లక్షలు, కామేపల్లి మండలంలో 11 గ్రామాలకు రూ.20 లక్షలు, సత్తుపల్లి నియోజకవర్గంలో 37 గ్రామాల్లో రూ.కోటితో, మధిర నియోజకవర్గంలో 34 గ్రామాలకు రూ.96 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లో గతంలో ఉపయోగించిన మంచినీటి బోర్లను వాడుకోవడం, లేదంటే రైతులకు చెందిన వ్యవసాయ బోర్లను ఎండాకాలం వరకు అద్దెకు తీసుకోవడం, కొత్తగా బోర్లు వేయడం లాంటి ప్రతిపాదనలున్నాయి.