అడవుల్లో తిండి దొరక్క జనావాసాలకు వలస

  • కోతులు వెంటపడగా.. చెరువులో పడి ఇటీవల ఇద్దరు చిన్నారుల మృతి 
  • జిల్లాలో  మంకీపార్క్ ​ఏర్పాటు చేయాలని డిమాండ్​

నిజామాబాద్,  వెలుగు : జిల్లాలో మళ్లీ   కోతుల బెడద మొదలైంది.  కోతులు వెంటపడడంతో మామిడిపల్లిలో ఇటీవల ఇద్దరు చిన్నారులు  చెరువులో పడి..  ప్రాణాలు కొల్పోయారు. ఊళ్లలో తిరుగుతున్న కోతులను  మంకీ  పార్క్​లకు తరలించాలని, పునరుత్పత్తిని  నియంత్రించేందుకు కోతులకు ఆపరేషన్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ చాలా స్లోగా సాగుతోందని.. ఇప్పటివరకు 800   కోతులకు మాత్రమే  ఆపరేషన్లు చేశారని అంటున్నారు.  ఉమ్మడి జిల్లాలో బాల్కొండ, భీంగల్, నవీపేట, డిచ్ పల్లి, జక్రాన్ పల్లి,  మాక్లూర్ , వర్ని, బాన్స్​వాడ, కామారెడ్డిల్లో  కోతుల  బెడద ఎక్కువగా ఉంది.  డిచ్ పల్లి  సెవన్త్ బెటాలియన్ , ముప్కాల్, మెండోరా, అడవి మామిడిపల్లి ,అర్గుల్​  గ్రామాల్లో కోతులు  గుంపులుగా వచ్చి  బీభత్సం చేస్తున్నాయి. చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తున్నాయి. దీంతో చిన్న పిల్లలను బయటకు పంపడానికి భయపడుతున్నారు. కోతులు ఇండ్లలోకి చొరబడి ఆహారాన్ని, సామాన్లను  ఎత్తుకుపోతున్నాయి.  ఇళ్ల మీద  కూన పెంకలను ధ్వంసం చేస్తున్నాయి.  అడవుల్లో  ఆహారం దొరక్క  దగ్గరగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లోకి కోతులు వస్తున్నాయి.  ఫుడ్​కోసం  ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి తరలిపోతున్నాయి.  

పట్టుకునేందుకు లక్షల్లో  ఖర్చు..
కోతులను  పట్టుకునేందుకు విలేజ్​  కమిటీలు రూ. లక్షల్లో  ఖర్చు చేస్తున్నాయి. మెండోరా  నుంచి కోతులను తరలించేందుకురూ. 2 లక్షలు ఖర్చుచేశారు.  ప్రతి ఇంటి నుంచి రూ. 1,500 వసూలు చేశారు.  మామిడిపల్లిలో కోతుల తరలించేందుకు విలేజ్​ కమిటీ తీర్మానం చేసింది. ప్రతి ఇంటి నుంచి డబ్బులు వసూలు చేయాలని   తీర్మానించారు. కోతులను పట్టుకునేందుకు  ఉత్తరప్రదేశ్, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్స్​పర్ట్​లను పిలిపిస్తున్నారు.  

కోతుల పార్క్ ఎప్పుడో..  
నిర్మల్ జిల్లా సారంగా పూర్ మండలం చించోలి  వద్ద  2016లోకోతుల పార్క్ ఏర్పాటు చేసారు. రూ. 2 కోట్ల వ్యయంతో పది ఎకరాలల్ఓ ఈ పార్క్ ఉంది.  ఇక్కడ కోతులకు  ఫుడ్ కోసం పండ్ల మొక్కలను పెంచుతున్నారు. కోతుల ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా వైద్యం అందిస్తున్నారు. పునరుత్పత్తి నియంత్రణకోసం  ఆపరేషన్లు చేస్తున్నారు.  నిజామాబాద్​ జిల్లాలోనూ ఇలాంటి పార్క్​ ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 80  వేల కోతులు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు.   అయినా కోతుల పార్క్​ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.

పరేషాన్​ చేస్తున్నయి
కోతులు పరేషాన్​ చేస్తున్నయి.  చిన్నపిల్లలు, ఆడవాళ్ల మీద దాడి చేస్తున్నాయి. పీహెచ్​సీల్లో  యాంటీ రేబిస్ ఇంజక్షన్లు ఉంటలేవు. కోతులను పట్టుకుని వదిలేస్తున్నా మళ్లా వస్తున్నాయి.  
- మల్లారెడ్డి సర్పంచ్​ మామిడిపల్లి

కోతుల పార్క్​  కు తరలిస్తం 
జిల్లాలో  కోతుల  నియంత్రణకు ప్రత్యేకచర్యలు చేపట్టాం. ఇప్పటివరకు 800 కోతులకు ఆపరేషన్లు జరిగాయి. కోతుల  తరలింపు ఖర్చు గ్రామకమిటీలే భరించాలి.  పట్టుకున్న కోతులను ప్రస్తుతం చించోలి కోతుల పార్క్​ కు తరలించడానికి  చర్యలు చేపడుతున్నాం. -  వికాస్​ నీనా, డీఎఫ్​ ఓ